రాజకీయ లబ్ది కోసమే కాపుల్లో చంద్రబాబు చిచ్చు
- 94 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన రాజకీయ లభ్ది కోసం కాపు కులంలో చిచ్చుపెడుతున్నారని విశాఖ కాపునాడు అధ్యక్షుడు గుంటూరు వెంకటనరసింహారావు ఆరోపించారు. రామాటాకీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కాపులను విభజించే పాలిస్తున్నారని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో కాపులను బీసీల జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చింది కాబట్టే కాపు ఉద్యమనేత ముద్రగడ్డ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోను అమలు చేయమని అడిగితే మంత్రులచేత, ఎమ్మెల్యేల చేత తిట్టించడం సరికాదని విజయవాడలో బొండా ఉమా తిడుతుంది ముద్రగడ్డ పద్మనాభంను కాదని 13 జిల్లాల కాపులని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కాపుల సంఖ్య, వివిధ జల్లా కాపు అధ్యక్ష, కార్యదర్శులు ఎవరో తెలియని పిళ్లా వెంకటేశ్వరావు సిఎంని కాపు సంక్షేమం ఎంతో చేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. పిళ్లా వెంకటేశ్వరావు చర్యలతో ఏపిలో కాపులు మనోవేదన చెందుతున్నారన్నారు.
కాపు సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు దిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తిరుపతిలో మంజునాధ్ కమిషన్ వెళ్ళితే అక్కడ బిసీలు జరిపిన ఆందోళన వెనక చంద్రబాబు నాయుడు హస్తం వుందని ఆరోపించారు. బిసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ నేత అని పేర్కోన్నారు. కార్యక్రమంలో కాపునాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వంగా వెంకట ఫ్రభాకర్, కాపునాడు ఉపాధ్యక్షులు తోట దుర్గారావు, తుమ్మల త్రినాధ్ తదితర్లు పాల్గోన్నారు.


