రాజప్పకు పరామర్శల వెల్లువ
- 83 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): రాష్ట్ర డిప్యూటీ సి.యం. నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఉదయం కాకినాడ సంజీవిని ఆసుపత్రిలోని లిఫ్ట్ ఫెయిల్ కావడంతో స్వల్పంగా గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాట్రావులపల్లి సమీపంలోని నెక్కింటి సీ ఫుడ్స్‌లో రసాయన వాయువుల విడుదల మూలంగా ఆస్వస్దతకు గురైన బాధితులను పరామర్శించడానికి మంగళవారం చినరాజప్ప సంజీవని ఆసుపత్రికి వచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆసుపత్రి రెండో ఫ్లోర్లో మంత్రి మరో ఐదుగురు లిఫ్ట్‌లో కిందకు రావడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా రెండో ఫ్లోర్ నుండి కిందకు పడిపోయినట్లు లిఫ్ట్‌లో ఉన్నవారు తెలిపారు.
ఈ సంఘటనలో స్వల్పంగా గాయపడిన చినరాజప్ప వెంటనే ఆసుపత్రి వైద్యులు చికిత్స అందచేసారు. ఈ సంఘటనలో గాయపడ్డ ఒక ఛానల్ కెమెరామెన్ హసన్, పోలీస్ కానిస్టేబుల్ రాంబాబుకు ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫోన్లో చినరాజప్పను పరామర్శించారు. అరోగ్య పరిస్ధితిని తెలుసుకున్నారు. ఈ సంఘటన వివరాలు ముఖ్యమంత్రికి వివరించి, ప్రమాదం నుండి బయటపడ్డాని చినరాజప్ప ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులలో లిఫ్ట్‌ల నిర్వహణ సక్రమంగా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ప్రజా భద్రత దృష్ట్యా ఈ చర్యలు అవసరం అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర డిప్యూటీ సియం చినరాజప్పను పలువురు కేబినెట్ సహచరులు ఫోన్లో పరామర్శించారు. కాకినాడ సంజీవిని ఆసుపత్రిలో అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు, జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, ఎంఎల్‌సి బొడ్డు భాస్కర రామారావు, కాకినాడ రూరల్ శాసన సభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి, జిల్లా యస్పి ఎం.రవిప్రకాశ్, జాయింట్ కలెక్టర్ యస్.సత్యన్నారాయణ, ఎడిషినల్ ఎస్పి శివశంకరరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు చినరాజప్పను పరామర్శించారు.


