రాజస్థాన్, పంజాబ్, హర్యానాపై మంచు దుప్పటి
- 107 Views
- wadminw
- January 2, 2017
- Home Slider జాతీయం
ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై మంచు దుప్పటి పరుచుకుంది. దీంతో ఆ రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. రాజస్థాన్‌లో సాధారణ జీవితం ప్రభావితమైంది. దీంతో పలు రైళ్లు రద్దు కావడంతో పాటు మరికొన్ని రాకపోకలకు అంతరాయమేర్పడింది. రాజస్థాన్‌లోని చురు ప్రజలు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు చల్లటి రాత్రిలో గజగజ వణుకుతున్నారు.
ఈ శీతాకాలంలో ఇది అత్యంత చల్లటి రాత్రి. చురులో కనీస ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలు, మౌంట్ అబూలో 2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, సికర్‌లో కనీస ఉష్ణోగ్రత 3, ఉదరుపూర్‌లో 3.4, పిలానీలో 3.8, శ్రీనగర్‌లో 4, బికనీర్‌లో 4.8, కోటలో 6.8, జైసల్మీర్‌లో 7.4, అజ్మీర్‌లో 7.8, బర్మర్లో 9.4 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. పంజాబ్, హర్యానా, చంఢఘీర్లలో మంచు పరుచుకోవడంతో 350 మీటర్ల వరకు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. పంజాబ్ రాష్ట్రంలోని నార్నౌల్‌లో 1.6 డిగ్రీలు, హిస్సార్‌లో 1.8, అమృత్‌సర్‌లో 3.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొండ, గిరిజన ప్రాంతాల్లో మైనస్ 15 నుంచి 20 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కిలాంగ్లో మైనస్ 7, మనాలిలో మైనస్ 3, కల్పాలో మైనస్ 1.6 డిగ్రీలు నమోదైంది. ఈ రాష్ట్రంలో సరస్సులు, జలాశయాల్లో నీరు గడ్డకట్టింది. కుల్లు, మనాలి తదితర ప్రాంతాల్లో రోడ్లపై గడ్డకట్టిన మంచును తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రోజ్ టాంగ్ టన్నెల్ నిర్మాణంలో పాలుపంచుకుంటూ మంచులో చిక్కుకుపోయిన150 మంది శ్రామికులను రక్షించి బుంతార్ ప్రాంతానికి తరలించారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో సాధారణ అత్యధిక ఉష్ణోగ్రత 15 డిగ్రీలుగా నమోదైంది. జమ్యూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ పట్టణంలో 1.8 డిగ్రీలు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని నజీబాబాద్‌లో రాష్ట్రంలోనే అతితక్కువ 1.5 డిగ్రీలు నమోదైంది.
ఘోరక్పూర్, అలహాబాద్, ఆగ్రా డివిజన్లలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ముజఫర్‌నగర్‌లో చలిగాలులకు 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ జిల్లాలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు నెల 22 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించారు. ఈ జిల్లా సమీపంలోని షమ్లీ, భాగ్‌పత్, సహారన్పూర్లలో ఎముకలు కొరికే చలితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ చలి పరిస్థితులు రాష్ట్రంలో రైలు రాకపోకలపై ప్రభావం చూపింది. ఐదు రైళ్ళు దాదాపు నాలుగు గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
రాజస్థాన్ రాష్ట్రానికి పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో కప్పుకున్న మంచు రైళ్ళ రాకపోకల ఆలస్యానికి కారణమైంది. ప్రత్యేకించి హవారా, శ్రీనగర్ మధ్య నడుస్తున్న రైళ్ళు, వారణాసి, జోధ్‌పూర్, ఆగ్రా, అజ్మీర్, ఢిల్లీ, బికనీర్ ప్రాంతాలలో రైళ్ళు ఆలస్యంతో నడుస్తున్నట్లు నార్త్ వెస్టర్న్ రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్) అధికార ప్రతినిధి చెప్పారు. వాతావరణ శాఖ ప్రకారం రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింతగా విజృంభించే అవకాశం ఉంది.


