రాజ్యాంగం కంటే బీజేపీ తీర్మానం గొప్పదా?
- 132 Views
- wadminw
- September 9, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): సీమాంధ్రులకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించి అది సాధ్యంకాదని చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగంకంటే బిజెపి తీర్మానం గొప్పదా? అని ప్రశ్నించారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో పవన్ సీమాంధ్ర ఆత్మగౌర సభ జేఎన్‌టియూ క్రీడామైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో బిజెపిపై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే సీమాంధ్రలో బిజెపికి నూకలు చెల్లినట్టేనని అన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీకి భవిష్యత్ లేదని సాక్ష్యాత్తు వెంకయ్య నాయుడే బిజెపి చంపేశాడని విమర్శించారు. బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలు ఇకపై మరో పార్టీ చూసుకోవాలని హితవు పలికారు. కేవలం సీమాంధ్ర అభివృద్ధిని కోరుకునే తాను ఆనాడు బిజెపి, టిడిపిలకు మద్దతు ఇచ్చానని అన్నారు.
ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీ ఇస్తే ఊరుకోవద్దని సూచించారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. కేంద్రానికి దక్షిణాది అంటే అలుసేనని అన్నారు. ఎంసీలను తలుపులువేసి చితకబాది రాష్ట్ర విభజన చేశారని అన్నారు. విభజన అనంతరం ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపి కూడా చేసిన దానికి పశ్చాత్తాప పడకపోవడం శోచనీయమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాడుతారని, వారివెంట జనసేన ఉంటుందన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలు కేంద్రం మొఖానే కొట్టాలని అన్నారు. హోదా ఇవ్వనందుకు రాస్తారోకో, బంద్ వంటివాటితో ప్రయోజనం ఉండదన్నారు. అయితే బంద్‌లకు తాను వ్యతిరేకం కాదన్నారు. పదవుల్లో ఉన్న ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, తమకు చేతకాదని ఒప్పుకుంటే గ్రామగ్రామాన ప్రజలే ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తారని అన్నారు. మనమే జనసైన్యమని ప్రజలు చేపట్టిన ఉద్యమం నీరుకారదన్నారు.
ఈ సభలో పవన్ గంటపాటు ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై ఎక్కువగా మాట్లాడారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుపై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి వెంకయ్య నాయుడు కారణమని అన్నారు. మరోవైపు, బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును టార్గెట్ చేశారు. ఆయనంటే గౌరవం ఉందంటూనే తూర్పారబట్టారు. పెద్దవారైన వెంకయ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తనను క్షమించాలని వేడుకున్న పవన్ సీమాంధ్రులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఏపీలో బీజేపీని ఆయన పూర్తిగా చంపేశారని అన్నారు. బీజేపీ చేసిన తప్పుకు హైదరాబాదులోని సీమాంధ్రులు నిత్యం క్షోభ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
చట్టసభలో చేసిన చట్టాల కంటే మీ హామీలే ఎక్కువా? అని బీజేపీ నేతలను ప్రశ్నంచారు. వెంకయ్య నాయుడు పెద్దమనిషి, ఆయనంటే గౌరవం ఉందంటూనే ప్రత్యేక హోదా విషయంలో ఆయన అవలంబించిన వైఖరిపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను బీజేపీ ఎంపీలు, నేతలు పీక పిసికి చంపేశారని అన్నారు. రేపు వారు జనాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు వారికి లడ్డులు చూపిస్తే మొఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. కాబట్టి ఆయన వేరే పార్టీ చూసుకోవడం మంచిదని పరోక్షంగా వెంకయ్యనాయును ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశం, బీజేపీలకు తాను గతంలో కొమ్ముకాశానని, ప్రాణాలను కూడా లెక్కచేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను కడకండ్ల పాలు చేస్తుంటే తాము చూస్తూ ఊరుకునేది లేదని, మెడవంచి తీరుతామని అన్నారు.
నాయకులు సంపాదించుకోవద్దంటే వినరని, సంపాదించుకుంటే తనకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే ప్రజలు కష్టాలు పడుతుంటే సొంత లాభం కొంత మానుకుని వారికోసం కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను బీజేపీ ఎంపీలు, నేతలు పీకనొక్కేసారని, ఆ నేతలు వేరే పార్టీ చూసుకోవడం మంచిదని పవన్ సూచించారు. బహిరంగ సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతున్న జనసేన అధినత పవన్ కల్యాణ్ దేశంలోని రాష్ట్రాల విభజనపై సమగ్రంగా మాట్లాడారు. రాష్ట్రాల అవతరణపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఓ సమగ్ర విధానాన్ని రూపొందించారని అన్నారు. ప్రస్తుతం ఆ స్ఫూర్తి పోయిందన్నారు. అయితే ఆ తర్వాత కారణాలు ఏవైనా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోందన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఆంధ్రుల వెన్నులో పొడిస్తే ఆదుకుంటుందనుకున్న బీజేపీ పొట్టలో పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంటులో ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందన్నారు. వారు ఒప్పుకోవడం లేదని, వీరు ఒప్పుకోవడం లేదని చెప్పడం సరికాదని అన్నారు. తాను ఇక్కడకు వచ్చింది భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు కాదని, సమస్యలపై చెప్పుకునేందుకే వచ్చానని పేర్కొన్నారు. బంద్‌లకు పిలుపులివ్వడానికో, రాస్తారోకోలు చెయ్యమని చెప్పడానికో ఇక్కడకు రాలేదని స్పష్టం చేశారు. పార్టీలన్నీ విఫలమైన తర్వాత మనం రోడ్డుపైకి వద్దామని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామంటూ మూడు నాలుగేళ్లు చెప్పి చివరకు రెండు లడ్డూలు చేతిలో పెట్టారని, మీరిచ్చిన పాచిపోయిన లడ్డూలు మాకొద్దని పవన్ అన్నారు. ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలు ఇస్తున్నారని, దానికంటే మా బందరు లడ్డూలు బాగుంటాయని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు వెన్నుపోటు పొడిచారని బీజేపీ దగ్గరకు వెళ్తే బీజేపీ వాళ్లు పొట్టలో పొడిచారని అన్నారు.
అటు తెలంగాణకూ న్యాయం చేయలేదని, వాళ్లకు హైకోర్టును ప్రత్యేకంగా ఇవ్వమంటే ఇవ్వడంలేదని, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని వాటిని అడుగుతుంటే మాత్రం రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారని విమర్శించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని, దీనికి స్వార్థ రాజకీయాలే కారణమని అన్నారు. పౌరుషం చచ్చిందనుకుంటున్నారా? పోరాటపటిమ తగ్గిందనుకున్నారా? అంటూ గర్జించారు. 2014లో రాష్ట్రాన్ని విడగొట్టినప్పటి నుంచి ప్రతి బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి టీడీపీ నేత ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారని, తాను కూడా వాళ్ల మాటలు నమ్మానని చెప్పారు. టీడీపీ నేతలపై ఇప్పటికీ తనకు గౌరవం తగ్గలేదని, కానీ ప్రజా సమస్యల విషయంలో మాత్రం తన వైఖరి ఇంతేనని స్పష్టం చేశారు. పాచిపోయిన ఆ లడ్డూలు టీడీపీ తీసుకుంటుందా లేదా అనేది తనకు అనవసరం అన్నారు.
మీరు సమస్యలను పట్టించుకోకపోయినా పర్వాలేదు గానీ, కొత్త సమస్య సృష్టించవద్దని చెప్పారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే దరిద్రపు ఆలోచనలు దయచేసి ఆపాలన్నారు. కళ్లు మూసుకుంటే నిద్ర కాదు జ్ఞానం అనుకోరా అని ప్రశ్నించారు. తాను రెండున్నరేళ్లుగా నిద్రలో లేనని తెలిపారు. రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదన్నారని, కానీ గడ్డం గీసుకున్నంత తేలికగా రెండు రాష్ట్రాలు ఇచ్చారుగా అని పవన్ ప్రశ్నించారు. తాను సినిమా హీరోను కావొచ్చు గానీ మీలాగా వేల కోట్లు, వేల ఎకరాలు సంపాందించుకోలేదని చెప్పారు. తన తాత ఒక పోస్ట్ మ్యాన్ అని, తన తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అని, తమకు రాజకీయాలు తెలియదని, తాము చాలా సామాన్యులమని, అందుకే అందరిలాగే బతకడం ఇష్టమని అన్నారు. సినిమాలు వదిలేయమంటే ఇప్పుడే వదిలేస్తానని, అలా వదిలేస్తే మీరే తనకు భోజనం పెట్టాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కొంచెం కారాన్ని ఒంటికి పూసుకొని నాలుగు కారం ముద్దలు తిని పార్లమెంటుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ చురకలంటించారు. అప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ కోసం సరైన పోరాటం చేయవచ్చని సూచించారు. దయచేసి ఏపీ ప్రజల ఆత్మ గౌరవం తాకట్టుపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ చేతిలో పెట్టిన పాచి లడ్డూలు తీసుకుంటారా విసిరి వారి ముఖాన కొడతారా చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎలాంటి రాజకీయ నాయకుడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వారి వెనుక ఎంత పెద్దమంది ఉన్నా భయపడబోనని తెలిపారు. ‘‘జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టకుండా ఉంచినందుకు ఇందిరాగాంధీకి ధన్యవాదాలు. ఇప్పుడు తమది 150 ఏళ్ల చరిత్ర అని చెబుతున్న కాంగ్రెస్ వాళ్లు ఎందుకు ఇందిరాగాంధీ సిద్ధాంతాన్ని కాపాడలేకపోయారు? అవకాశవాదపు రాజకీయాలవల్ల ఆంధ్రప్రదేశ్ యువకులు, తెలంగాణ యువకుల ప్రాణాలు పోయాయి. ఇది మర్చిపోదామనుకునే సమయంలో బీజేపీ కలిసి పొట్టలో పొడిచాయి.
ఏ వ్యక్తులైనా, ఏ పార్టీ అయినా సుస్ధిరత ఇవ్వాలి. చేతగాని తనంతో, దోపిడీ విధానంతో తెలంగాణకు న్యాయం చేయకుండా, ఇప్పటి వరకు వారికి కోర్టు ఇవ్వకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఏపీకి చివరకు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు. 1996లో బీజేపీ తీర్మానం పెట్టింది. ఒక్క ఓటు వేస్తే రెండు రాష్ట్రాలు ఇస్తామని చెప్పింది. అప్పుడు అడ్డురానీ చట్టాలు, అడ్డంకులు ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాత్రం మీకు ఎలా వచ్చాయి. మహాత్ముడు, అంబేద్కర్ విగ్రహాలకు దండలు వేయడం కాదు ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలగకుండా ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలి. ఇక్కడికి మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు రాలేదు. జరిగిన అన్యాయం చెప్పేందుకు వచ్చాను.
మీ చేతికి చిన్న గాయం అయినా నా గుండె బాధపడుతుంది. బంద్‌లు చేయమని చెప్పను. నిరసనలు చేయాలని, రోడ్లెక్కాలని చెప్పను. నేను బంద్‌కు వ్యతిరేకం కాదు. పాల్గొంటారా లేదా అన్నది మీ ఇష్టం. అయినా మీరెందుకు కష్టపడాలి. పార్లమెంటులో కూర్చుంది ఎవరూ? అసెంబ్లీలో ఎవరు కూర్చున్నారు? మీరెందుకు నిరసనలు చేయాలి. మీరు చదువుకోవాలి, మీబిడ్డలు బాగా చూసుకోండి. పార్లమెంటులో సబ్సిడీ ఆహారం తినేవాళ్లు ఫైట్ చేయాలి. చేయకుంటే మేం ఒప్పుకోం. నేను భారతదేశ పౌరుడిగా బతికితే చివరకు సీమాంధ్రుడిని చేశారు. నాకు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సెంటు భూమి లేదు. ఒక మొక్కలేదు. ఈ దేశంలో సత్యమేవ జయతే అనే గొప్ప నినాదం ఉంది.
అది నినాదం అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఇంకేది గెలవదు. నాకు సమస్య ఎదుర్కోవడంలో భయం లేదు. ఎలాంటి రాజకీయ నాయకులనైనా ఎదుర్కొంటాను. చాలామంది వారి కింద ఉండొచ్చు నేను మాత్రం మీ గుండెల్లోని మాట చెప్పేందుకు ఉంటాను. మనకు గుండాలు వద్దు దుర్మార్గులు వద్దు, మనది జన సైన్యం మనకు గుండెల నిండా ధైర్యం ఉంది దేవుడు ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మేం కేవలం ఓటు వేయలేదు నేను నా ప్రాణాన్ని ఫణంగా పెట్టి మద్దతు తెలిపాను. రాష్ట్రాన్ని విడగొట్టాక బాధతో నేను 11 రోజులు అన్నం మానేశాను. 1997లోనే ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని చెప్పినవారు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆపేశారు. అధికారం ఉంటే ఒకలాగా లేకుంటే మరోలాగా మాట్లాడతారా? నేను పార్లమెంటు సెంట్రల్ హాలుకు వెళ్లి అక్కడ మహనీయుల ఫొటోలు చూశాను.
అలాంటివారు తిరిగిన సెంట్రల్ హాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. ఇది జాతీయ స్ఫూర్తికి విరుద్ధం కాదా అని కుమిలిపోయి ఎవరిని తిట్టలేక ఏడ్చేశాను. ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి రెండు రాష్ట్రాలు ఇచ్చినవారు ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్‌కుగానీ, తెలంగాణకు వచ్చి క్షమాపణలు చెప్పారా? వారికి ఉత్తర భారత అహంకారం దక్షిణ భారత పౌరులు భారత దేశ పౌరులు కాదా? మేం నిఖార్సయిన భారతీయులం. నాకు నిజంగా రాజకీయ పిచ్చి ఉంటే నేను సమైక్య ఉద్యమం నడిపేవాడిని. ఎందుకు చేయలేదంటే తెలంగాణ అంటే నాకు ప్రేమ. నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళితే నీకు ఏం తెలుసురా అన్నారు. తెలంగాణ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. నా మిత్రుడొకరు ఒక పాట ద్వారా అక్కడి బాధలలు చెప్పాడు. ఆ సమయంలో అలాంటి సమస్యలు దేశమంతా ఉన్నాయని చెప్పాను. అలా అని విడిపోతే దేశం ఏమవుతందని ప్రశ్నించాను.
ఆత్మగౌరవం ఉన్న ఏ తెలుగోడు కేంద్రం ముందుకు వెళ్లడు. ఓట్లు అడిగే సమయంలో అర్ధమయ్యే భాషలో మాట్లాడతారు. ఏదైనా ఇవ్వాల్సి వస్తే మాత్రం అర్ధంకానీ భాషలో ఎందుకు మాట్లాడతారు? రాష్ట్రం విడిపోయాక తెలంగాణ నుంచి వచ్చినవారికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ఇవన్నీ పట్టించుకోకుండా రాజధాని మీదే దృష్టి పెడితే నష్టం జరుగుతుంది. మరో రెండేళ్లే ఉంది. దయచేసి టీడీపీ కేంద్రంతో పోరాడాలి. అవంతి శ్రీనివాస్ (అనకాపల్లి) ఎంపీగారికి ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. నిజంగా నాకు ఎంపీ కావాలంటే నేనే తీసుకుంటాను. మీలో నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలనే ఆలోచన ఉంటే రాజీనామా చేసి స్ఫూర్తిగా నిలవండి. నేను గెలిపిస్తాను. మా జన సేన గెలిపిస్తుంది. వెంకయ్యనాయుడుగారు మీరంటే గౌరవం. కానీ పెద్దరికం మీదేసుకొని సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.
మీపై తిరుగుబాటు చేస్తున్నందుకు క్షమించండి. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సింధూను మీరు సన్మానిస్తున్నారు. కానీ మీరు మాత్రం తెలుగు ప్రజల కోసం చేసిందేమిటి’’ అని పవన్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ది 150 ఏళ్ల చరిత్రేనని ఒప్పుకుంటానని, కానీ లాల్‌బహదూర్ శాస్త్రి నాటి విలువలున్నాయా? ఇందిరాగాంధీ పాటించిన సిద్ధాంతాలు పాటిస్తున్నారా? అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. 2004లో అవకాశవాద రాజకీయాల కోసం, పదవుల కోసం పాకులాడారన్నారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని, న్యాయం చేయమని భాజపా వద్దకు వెళ్తే అది పొట్టలో పొడిచిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయవాదం గురించి గొప్పలు చెప్పే ఆ రెండు జాతీయ పార్టీలు నేడు తెలుగు రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించాయని ఆవేశంగా ప్రసంగించారు. ఉత్తరాది అహంకారంపైనే తన పోరాటమని, ఆంధ్రప్రదేశ్‌పై ఉత్తరాది నేతలకు ఎందుకంత వివక్ష అని ప్రశ్నించారు.
తెలుగురాష్ట్రాన్ని విడగొట్టిన మీరు అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయలేదని చెప్పారు. అటు తెలంగాణకు హైకోర్టును ఇవ్వకపోగా ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ఇవ్వకుండా రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని మండిపడ్డారు. భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఇక్కడికి రాలేదని మనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకే వచ్చానని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. బంద్‌లు చేయాలని తాను చెప్పనని, అయితే రేపు వైకాపా, వామపక్షాలు ప్రకటించిన బంద్‌లో పాల్గొనాలా వద్దా అనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నాని కార్యకర్తలకు చెప్పారు. అయితే బంద్ చేసి మీరెందుకు కష్టపడాలి, పదవులు అనుభవిస్తున్నవారు పోరాడాలి అని పవన్‌కల్యాణ్ అన్నారు.
ఏ తప్పూ చేయని ప్రజలు పోరాడుతూంటే వాళ్లు మిన్నకుంటామంటే తాను ఒప్పుకోనన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే ప్రజల తరఫున పోరాడాలని, వారు చేయాల్సింది చెయ్యకుండా ప్రజలే అన్నీ చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. సముద్రం ఒకడి ఎదుట తలవంచదని, ఆత్మగౌరవం ఉన్నోడు కేంద్రం ఎదుట జీహుజూర్ అంటూ గులాంగిరీ చేయడని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దని, తల ఎత్తి వ్యవహరించండని తెదేపా నేతలకు సూచించారు. ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు భాజపా నాయకులు మనకు అర్ధం అయ్యేలా చెప్తారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అలా చెప్పడం లేదని విమర్శించారు. మీరు చెప్పిన హ్యాపీడేస్ ఎక్కడంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. పార్టీ మేనిఫెస్టోకు ఇచ్చిన విలువ పార్లమెంట్సాక్షిగా ఇచ్చిన మాటకు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హోదా కోసం పోరాడతానంటే తన ఎంపీ స్థానాన్ని పవన్‌కు వదిలేస్తానని చెప్పిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు రాజీనామా చేసి మీరు స్ఫూర్తిగా నిలవాలని పవన్ హితవు పలికారు. మీరు రాజీనామా చేసి పోరాడితే మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత జనసేన సైనికులదని ఆయన చెప్పారు. సొంత లాభం కొంత మానుకోమని మాత్రమే పార్లమెంట్ సభ్యులకు చెప్తున్నానని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. వ్యాపారంపై చూపే దక్షత చిత్తశుద్ధి ప్రజలపైన చూపండనే తాను చెబుతున్నానని.. వ్యాపారాల కోసమే రాజకీయం చేయాలనుకుంటే నాకు బాధేనని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవాన్ని కాపాడతామని గద్దెనెక్కిన మీరు మాట తప్పిస్తే ఒప్పుకోనన్నారు.
తన అన్న, వదిన, అక్కచెల్లెళ్లని వదిలి తెదేపా, భాజపా తరఫున పోరాడేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. 2004 నుంచి తెలంగాణ ఇస్తామని చెప్పిన జైరాం రమేశ్ లాంటి వారు తమకు రాజధాని గురించి ముందే ఎందుకు చెప్పలేదని, నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. విభజన సమయంలో అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉన్నారా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తప్పు చేశారని, మాట ఇచ్చి తప్పారని ప్రజలే వారిని నిలదీయాలన్నారు. రాజకీయాల గురించి తెదేపా నేత టీజీ వెంకటేశ్ దగ్గర్నుంచి తాను నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. జనసేన వదిలేసిన రాజ్యసభ సీట్లో టీజీ వెంకటేశ్ కూర్చున్నారన్న పవన్, తాను మాట్లాడదల్చుకుంటే కర్నూలులో వారి ఫ్యాక్టరీలు వెలువరిస్తున్న కాలుష్యం గురించి చాలా మాట్లాడగలనన్నారు.
తాను రాజకీయ డ్రామాలు చేయనని, చేయదలచుకుంటే తాడోపేడో తేల్చుకుంటానని పవన్ అన్నారు. ఎంపీల్లారా మీకు పౌరుషం లేదా? ఒంటికి కాస్త కారం రాసుకునైనా పౌరుషం తెచ్చుకుని పోరాడాలని ఆవేశంగా ప్రసంగించారు. ఇప్పటికైనా తెలుగు ప్రజలకు క్షోభ కలిగించినందుకు కాంగ్రెస్, భాజపాలు క్షమాపణ చెప్పి తమ తప్పులు దిద్దుకోవాలని సూచించారు. తనకు ఏ ఒక్కరిపై వ్యక్తిగత కోపాలు లేవని మరోసారి చెబుతూ జనసేన కార్యకర్తలు, ప్రజల చేత జైహింద్ అంటూ పలికించి ప్రసంగాన్ని ముగించారు.


