రుచిలోనే కాదు… పోషకాహారంగానూ!
తినేందుకు ఎంతో రుచికరంగా ఉండే మొక్కజొన్న అంటే దాదాపుగా అందరికీ ఇష్టమే. ఉడకబెట్టినా, నిప్పులపై కాల్చుకుని తిన్నా మొక్కజొన్న రుచి భలేగా ఉంటుంది. ఈ సీజన్లో మొక్కజొన్న ఎక్కువగా లభిస్తుంది. అయితే మొక్కజొన్నను తరచూ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. మొక్కజొన్నలో విటమిన్ సి, బయో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. మొక్కజొన్నలో ఫ్లేవనాయిడ్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఈ కారణంగా క్యాన్సర్లు రావు. ట్యూమర్లు కూడా పెరగవు.
జింక్, పాస్ఫరస్, మెగ్నిషియం, ఐరన్లు, ఇతర మినరల్స్ మొక్కజొన్నలో ఉంటాయి. దీని వల్ల ఇవి మన ఎముకలకు బలాన్నిస్తాయి. ఎముకలకు దృఢత్వం కలుగుతుంది. కీళనొప్పులతో బాధ పడేవారు మొక్కజొన్నలను తమ ఆహారంలో భాగం చేసుకుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. బీటా కెరోటిన్, విటమిన్- ఎ లు ఉండడం వల్ల మొక్కజొన్నలతో కంటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. దృష్టి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. పీచు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కజొన్నలతో శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండవచ్చు.
మొక్కజొన్నలను తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ప్రధానంగా మలబద్దకం, గ్యాస్, అసిడిటీ సమస్యలు దూరమవుతాయి. మొక్కజొన్నల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఉపయోగపడే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్కజొన్నల్లో అధికంగానే ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండడం వల్ల మొక్క జొన్న గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. వారి కడుపులోని బిడ్డకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. కాబట్టి మొక్కజొన్నలను గర్భిణీలు తింటే పుట్టబోయే పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాము డిప్రెషన్లో ఉన్నామనే నిజాన్ని గుర్తిస్తే, డిప్రెషన్‌ను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఆ వెనువెంటనే, దాన్ని అధిగమించగలిగే శక్తులు మనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ తర్వాత క్రమానుగతంగా దాన్నించి బయటపడే ప్రయత్నాలు చేయాలి. డిప్రెషన్ నుంచి బయటపడటానికి వాకింగ్ బాగా తోడ్పడుతుంది. వాకింగ్‌లో మనో వ్యధనుంచి విముక్తం చేసే లక్షణాలు ఉన్నాయి.
వాకింగ్‌లో లభించే తాజా గాలి, శరీరాన్ని ఉత్తేజితం చేయడమే కాకుండా, మెదడుకు బాగా ఆక్సిజన్ అందడంతో ఆలోచనలు ఒక స్పష్టరూపం ధరిస్తాయి. ఏదైనా పెంపుడు జంతువును కూడా తోడు చేసుకోగలిగితే అది మరింత మేలు చేస్తుంది. డిప్రెషన్ నుంచి బయటపడేలా చేసే ఆహార పదార్థాలు కూడా ఈ విషయంలో తోడ్పడతాయి. ముఖ్యంగా అరటి పండ్లు, ముడి ధాన్యాలు, చేపలు, బ్రౌన్ రైస్, పాలకూర బాగా సహకరిస్తాయి.
సంకీర్ణ కార్బోహైడ్రేట్లు ఉండే ధాన్యాల్లో మెదడును చైతన్య పరిచే సెరటోనిన్ సమృద్ధిగా ఉంటుంది. వీటితో పాటు బి- విటమిన్, ఫోలిక్ యాసిడ్ అదనగా తీసుకోవడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. బి-విటమిన్ లోపిస్తే డిప్రెషన్ మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది అందువల్ల బి- విటమిన్ లభించే గుడ్లు, ఆకుకూరలు బాగా తీసుకోవాలి.


