రుజువుకాని చిత్తశుద్ధి
- 86 Views
- wadminw
- January 28, 2017
- Home Slider జాతీయం
తాము చేస్తున్న పనిపట్ల చిత్తశుద్ధి లేకపోతే ఏమవుతుంది? అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. చివరకు ఎలాంటి ఫలితమిస్తుందో తెలియదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. రైతుల రుణాల మాఫీ విషయంలో ఇప్పటికీ అస్పష్టత తొలగలేదు. సందిగ్ధత వీడలేదు. ప్రభుత్వ చిత్తశుద్ధి రుజువు కాలేదు. కమిటీలు వేసి, సమీక్షలు చేసి, రకరకాల లెక్కలు వేసి, అనేక రకాలు వడపోతలు పోసి, నానా రకాల గందరగోళాలు సృష్టించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇక తప్పదన్నట్టు రుణమాఫీ అర్హుల జాబితాలు ప్రకటించింది.
తొలి విడతలో 40. 43 లక్షల మందితోనూ, రెండో విడతలో 42.23 లక్షల మందితోనూ జాబితాలొచ్చాయి. కానీ ఏం లాభం? తొలివిడతలోనే అర్హత సాధించిన రైతులకు ఇప్పటికీ రుణవిముక్తి లభించలేదు. అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారమే తొలివిడతలోనే పదిశాతం పైగా ఫిర్యాదులొచ్చాయి. తొలి విడతలో నాలుగు లక్షల ఖాతాలపై ఫిర్యాదులందాయి. జాబితాలో తమ పేర్లు లేవనీ, తక్కువ మాఫీ చేశారనీ, తప్పుడు సర్వే నెంబర్లు రాశారనీ, వేర్వేరు కుటుంబాల్లోనివారిని కూడా ఒకే కుటుంబంలో చూపించారంటూ కొన్ని లక్షల మంది ఘొల్లుమన్నారు. తొలివిడత జాబితాలో రుణమాఫీ అర్హత పొందినవారి అప్పులు ఇప్పటికీ మాఫీ కాలేదు.
వాయిదాకు 20 వేల రూపాయల చొప్పున లక్ష రూపాయల అప్పును అయిదు వాయిదాల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన్నప్పుడే ఇదేదో గండికొట్టే వ్యవహారమని చాలామంది సంశయించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే రైతుల రుణభారం మరింత పెరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇప్పుడు అలాంటి భయాలనే నిజం చేసేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. తొలి జాబితాలో రుణమాఫీ అర్హత సాధించిన రైతులకు అధికారుల, బ్యాంకర్ల దగ్గర చిత్రవిచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి.
భూమికి సంబంధించిన హక్కు పత్రాలు, పాస్‌పుస్తకాలు పరిశీలించిన తర్వాతే అప్పులిచ్చిన బ్యాంక్‌లు ఇప్పుడు మళ్లీ వాటిని పట్టుకురమ్మంటూ మెలిక పెడుతున్నాయి. ఆధార్ నెంబర్ కంపల్సరీ చేశారు. ఇవన్నీ సమర్పించినా తమ రుణాలు మాఫీ చేసినట్టు నిర్ధారించకపోవడం రైతులను బాధిస్తోంది. బకాయిలు తక్షణమే తీర్చాలంటూ రుణమాఫీ అర్హత పొందిన రైతులకు కూడా బ్యాంక్‌ల నుంచి నోటీసులొస్తున్నాయి. ఈ నోటీసులు అందుకున్న రైతులు టెన్షన్ పడుతున్నారు. తొలి విడత రుణమాఫీలో కౌలు రైతులకు మొండి చెయ్యే చూపించారు.
మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కౌలు రైతుల రుణాలుంటాయని అంచనా వేసిన అధికారులు వాటి మాఫీ గురించి పట్టించుకోలేదు. యజమాని నుంచి కౌలు ఒప్పంద పత్రాలు, వీఆర్వోల నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకురావాలంటూ షరతులు పెట్టడంతో కౌలు రైతులు అన్యాయమైపోయారు. దీంతో రుణమాఫీ వల్ల వారికి నయాపైసా లబ్ధి చేకూరలేదు. మరోవైపు కౌలు కిచ్చిన భూమి మీద అప్పులు చేసిన యజమానులే చాలాచోట్ల రుణమాఫీ లబ్ధిదారులుగా అవతరించారు. రుణమాఫీని చిత్తశుద్ధితో అమలు చేయకుండా, లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం సాగించిన ప్రయత్నాలే ఇంతటి గందరగోళానికి కారణమయ్యాయి.
ప్రభుత్వం ఆడిన దాగుడు మూతల కారణంగా లక్షలాది రైతులు ఇప్పటికే ఒక సీజన్లో బ్యాంక్ రుణాలు దొరక్క అవస్థపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే రైతులు మరో సీజన్ కూడా నష్టపోవాల్సి వస్తుంది. అది రైతులకీ, ప్రభుత్వానికీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకీ మంచిది కాదు. మరోవైపు, ఎపి రాజధాని నిర్మాణ అంశం కూడా వివాదాస్పదంగా మారి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తయారైంది. రాజధాని నిర్మాణ అంశం కేవలం ప్రభుత్వానికి సంబంధించినది మాత్రమే కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించడం లేదన్న విమర్శ విపక్షాల నుంచి ఉంది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రజలందరి ఆమోదం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేథావులు సైతం సూచించారు.
రాజధాని నిర్మాణ ప్రాంతంలోని రైతుల్లో రెండు వాదనాలున్నాయి. రేగడి భూములున్న రైతులు భూసేకరణకు అనుకూలంగా ఉండగా జరీ భూములున్న రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సారవంతమైన భూములు, ఆదాయం వచ్చే భూములను ఇవ్వడానికి రైతులు సుముఖంగా లేరు. రాజధాని నిర్మించడంలో తప్పు లేదు. కానీ అందరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పు. రైతులను సమన్వయ పరిచే స్థితిలో ప్రభుత్వం లేదు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయాన్ని నిషేధించడం దారుణం.
జరీ భూముల్లో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం పట్ల రైతులు అసంతృప్తిగా ఉన్నారు. కౌలు రైతులు, కూలీలు, చేతి వృత్తిదారులు, వ్యవసాయి కూలీలు భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భూసమీకరణను వ్యతిరేకించిన ప్రాంతంలో పంటలు దహనం అయ్యాయి. ఈ ఘటన వెనుకాల ఉన్న వారిని ప్రభుత్వం పట్టుకోవాలి. కృష్ణా నది ఒడ్డునే రాజధానిని నిర్మించాలనే తలంపుతో ప్రభుత్వం ఉంది. దీంతోనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కృష్ణా నది పరిసర ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్డడంతో నది కాలుష్యం అవుతుంది.
తీరం వెంబడే నగరాన్ని నిర్మిచండంతో నగరంలోని స్టార్ హోటళ్లు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పధార్థాలతో నది కలుషితమయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌లోని హేస్సేన్ సాగర్ పరిస్థితి కూడా అలాగే మారింది. విదేశాల పరిస్థితి వేరు. మన దేశ, రాష్ట్ర పరిస్థితులు వేరు. విదేశాల్లో నగరాల ఒడ్డున నగరాలున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అలాగే నిర్మిస్తామనడం సరికాదు. నగరం ఎక్కడైనా నిర్మించొచ్చు. కానీ వ్యవసాయం అంతటా చేయలేము. సారవంతమైన భూములను సృష్టించ లేము. వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి.
భూసేకరణ అవసరం లేదు. కృష్ణా నది ఒడ్డునే రాజధానిని నిర్మించాలనే తలంపుతో ప్రభుత్వం ఉంది కాబట్టే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. రాజధానిని ఒకటే సారి నిర్మిస్తారు… మళ్లీ మళ్లీ నిర్మిచరు. రాజధాని నిర్మాణ అంశం రాష్ట్ర ప్రజలందరి వ్యవహారం.. కేవలం ప్రభుత్వ వ్యవహారం కాదు. ప్రభుత్వం మేధావి వర్గం అభిప్రాయాలను తీసుకోకపోవడం బాధాకరం. ప్రజల అభిప్రాయాలను తీసుకోవడంలో ప్రభుత్వం అనాసక్తి చూపడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. శాసనమండలిలో గౌవర ప్రదంగా ఉన్న ఎమ్మెల్సీల అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సి ఉంది.


