రూ. 20 వేల కోట్లతో భాగ్యనగరాభివృద్ధి
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): హైదరాబాద్ నగర రూపు రేఖలు మార్చేందుకు రూ. 20 వేల కోట్ల రూపాయలు అవసరమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. జంట నగరాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జలమయమైన ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈయనతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి, మేయర్ బొంతు రాంమోమన్లు ఉన్నారు. కూకట్‌పల్లిలోని బండారి లేవుఅవుట్ ప్రాంతాన్ని మంత్రి గురువారం పరిశీలించారు. ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత నగరంలో 16 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.
ఏ నాడో నిర్మించిన డ్రైనేజి పైప్లైన్లను మరమత్తుకు రావడంతో నాలాలు పొంగిపోర్లుతున్నాయని అన్నారు. బండారి లే అవుట్ ప్రాంత ప్రజల ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. విద్యుత్, పురపాలక వాటర్ వర్క్, పోలీస్ శాఖలో సమన్వయంతో పని చేస్తున్నాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టు మంత్రి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇక నుంచి ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు జరపనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని అన్నారు. నగరాన్ని విశ్వనగరంగా మార్చే నిశ్చయంతో ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు.
అటవీ ప్రాంత రోడ్లకు కేంద్రం నిధులివ్వాలని వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): గోదావరి, ప్రాణహిత అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి రహదారి సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఐదు ప్రాంతాలకు రహదారి నిర్మాణం కోసం రూ.300 కోట్ల నిధులు ఆర్‌ఆర్‌పి కింద మంజూరు చేయాలని గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి, ప్రాణహిత నదులవెంట జాతీయ రహదారి నిర్మాణానికి రూ.1290 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని అనుమతులు పొందిన ఈ రహదారి నిర్మాణ పనులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసేందుకు చొరవ చూపాలని కోరారు. ఈ రెండు వినతులతో కూడిన పత్రాలను రాజ్‌నాథ్‌కు అందజేశారు. కేసీఆర్ వెంట ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు ఉన్నారు. కాళేశ్వరం నుంచి అర్జున్‌గుట్ట వరకు రహదారి, కాళేశ్వరం వద్ద కిలోమీటర్ పొడవైన వంతెన, రాచర్ల-వేమనపల్లి రహదారి, సోమిని-గూడెం, గూడెం-బాబానగర్ రహదారుల నిర్మాణానికి రూ.300 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అటవీ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు సాగించడానికి ఈ రహదారుల నిర్మాణం అత్యవసరమని చెప్పారు. భద్రాచలం సారపాం నుంచి ఆదిలాబాద్ జిల్లా కౌటాల వరకు గోదావరి, ప్రాణహిత వెంట జాతీయ రహదారి మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర త్వరగా వేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): భారీగా వర్షాలు కురుస్తున్నందున వైద్యశాఖ, డాక్టర్లు, సిబ్బందిని వైద్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అప్రమత్తం చేశారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని విధాలుగా వైద్యసేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని వైద్యశాలల్లో అవసరమైతే ఓపీ కౌంటర్లను పెంచాలని సూచించారు. అలాగే కౌంటర్ల వద్ద పనివేళలను పెంచాలన్నారు. ప్రతిరోజు సమయం ముగిసినప్పటికీ చివరి పేషంట్‌కు కూడా వైద్యం అందించాలన్నారు. మందుల కొరత లేదని, వైద్యశాలల వారీగా అవసరమైన మందులను వెంటనే తెప్పించుకోవాలని సూచించారు. వైద్యం అందకుండా ప్రజలు ఇబ్బందులు పడవద్దని, అందుకు వైద్యసిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. కాగా, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. క్రమంగా అల్పపీడనం బలపడుతోంది. ఈశాన్య రుతువపనాలు చురుకుగా కదులుతున్నాయి. కోస్తా తీరానికి అనుకుని అల్పపీడన ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా తీరంవెంబడి ఈశాన్య దిశనుంచి, అలాగే దక్షిణకోస్తా తీరంవెంబడి పశ్చిమ దిశనుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు సూచించారు. మూడు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు.


