రెండు రోజుల్లో జిల్లాకు నగదు: కలెక్టర్ వెల్లడి
శ్రీకాకుళం, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): జిల్లాకు మరో రెండు రోజుల్లో నగదు వస్తుందని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. ఇప్పటికే జిల్లాకు రూ. 113.50 కోట్లు వచ్చాయన్నారు. ఈ మేరకు ఆయన తన ఛాంబర్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాబార్డు సహకారంతో జిల్లాలో వ్యాపారులకు బ్యాంకుల ద్వారా ఉచితంగా స్వైపింగ్ యంత్రాలను అందజేస్తామన్నారు. రానున్న రోజుల్లో నగదు రహితంగానే మొత్తం లావాదేవీలు జరగాలన్నారు.
నాబార్డు 75 గ్రామాలను దత్తత తీసుకుందని, ఆయా గ్రామాల్లో ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మద్యం దుకాణాల్లో ఇప్పటికే స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేశామని, రేషన్ దుకాణాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జనవరి నాటికి నగదు రహిత లావాదేవీలు పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు చేపడతామన్నారు. పింఛన్లకు నగదు సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చిన్న నోట్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు.
రూ. 500, రూ. 100, రూ. 50 నోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్తు బిల్లులకు స్వైపింగ్ యంత్రాలను ఇచ్చామని, జిల్లాలో 50 కేంద్రాల్లో వీటి ద్వారానే బిల్లులు వసూలవుతున్నాయని ఆయనన్నారు. ఈ సమావేశంలో ఎల్డీఎం పి.వెంకటేశ్వరరావు, నాబార్డు ఏజీఎం వాసుదేవన్, ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ బి.రాధాకృష్ణారావు, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మేరీ సగాయా తదితరులు పాల్గొన్నారు.


