రెచ్చిపోతున్న కల్తీ మద్యం మాఫియా
- 154 Views
- wadminw
- September 3, 2016
- రాష్ట్రీయం
* అమాయక ఆదివాసీలే లక్ష్యంవగా అమ్మకాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ మద్యం మాఫీయా చెలరేగిపోతోంది. మద్యానికి అలవాటు పడ్డవారి బతుకులతో చెలగాటమాడుతోంది. మద్యం అమ్మకాలు పెరగడంతో కాసుల కక్కుర్తి కోసం వ్యాపారులు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. కల్తీ మద్యాన్ని ఖరీదైన బాటిళ్లలో పోసి అదే ధరకు విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం తయారు చేయడంలో అక్రమార్కులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చన్న కక్కుర్తితో దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.
మద్యం సీసా మూతలు తొలగించి..అందులోని మద్యాన్ని సగం తీసి నీళ్లు కలుపుతున్నారు. ఆ తర్వాత నిషాలో తేడా రాకుండా స్పిరిట్ కలుపుతున్నారు. మరికొందరు నాసి రకం మద్యం కలిపి మందుబాబుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు చిక్కకుండా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. హానికరమైన స్పిరిట్, నీళ్లు కలిపి దందా చేస్తున్నారు. కొన్నేళ్లుగా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకే పరిమితమైన ఈ బాగోతం జిల్లాలోనూ ఊపందుకుంది. కాగజ్‌నగర్‌లో భారీగా పట్టుబడ్డ కల్తీ మద్యం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
కాపువాడలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు కల్తీరాయుళ్ల గుట్టురట్టు చేశారు. 15 వేల ఖాళీ బాటిళ్లు, 15 వేల మూతలు, స్టిక్కర్లు, భారీ మొత్తంలో స్పిరిట్ బాటిళ్లు, కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం మాఫియాకు వైన్ షాపుల యజమానులు, ఎక్సైజ్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. వీరి అండతోనే భారీ మొత్తంలో కల్తీ మద్యాన్ని తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి సంపాదన రోజుకు 4 లక్షల పైమాటేనట. కల్తీ సరుకును 400 నుంచి 600 పైగా బాటిళ్లు తయారు చేస్తున్నారట.
ఈ దందాకు పెద్దగా మిషనరీ అవసరం కాకపోవడం, తక్కువ సిబ్బందితో పనిపూర్తి కావడంతో జిల్లాలో కల్తీ మద్యం దందా వేళ్లూనుకుంటుంది. కాగజ్‌నగర్‌లో తయారైన మద్యాన్ని సిర్పూర్, కౌటాల, బెజ్జురు, దహెగాం, ఆసిఫాబాద్, వాంకిడి ప్రాంతాల్లోని వైన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ మద్యం మాఫియాపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కొరడా ఝుళిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


