రెచ్చిపోతున్న లిక్కర్ మాఫియా!?
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన మద్యం తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారుతోంది. అమ్మకాలను పెంచేందుకు అబ్కారీ శాఖ దాడులు నామమాత్రం చేయడంతో అక్రమ మద్యం వ్యాపారం కూడా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మరోవైపు, గ్రామాల్లో గుడుంబాను అరికట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పాలసీపై ఆబ్కారీ శాఖ తీవ్ర మదనపడుతోంది. నూతన పాలసీ ప్రకారం మండలం ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లా స్థాయి మద్యం పాలసీకే లిక్కర్ మాఫియా అరాచకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో మండలం యూనిట్‌గా అమలు చేస్తే వారి ఆగడాలకు అడ్డూ అదుపూ ఉండదేమోనని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. అంతేకాదు లిక్కర్ మాఫియా పూర్తి గుత్తాధిపత్యంతో మరింత బలపడే ప్రమాదం ఉందంటున్నారు. రాజకీయ నాయకులను, అధికారులను తమ వైపు తిప్పుకొని ధరలను ఇష్టారీతిన పెంచే ప్రమాదం లేకపోలేదని పేర్కొంటున్నారు. అదే విధంగా గ్రామాల్లో కల్తీ మద్యం ఏరులై పారినా అదుపు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు.
మొత్తం మీద ఈ విధానం వల్ల ఎక్సైజ్‌శాఖ మరింత అభాసు పాలయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ హయాంలో ‘వారుని-వాహిని’ ద్వారా సారా అమ్మకాలను సొంతం చేసుకున్న వ్యక్తులు గ్రామాల్లో వారి ఏజెంట్లను నియమించుకొని అమ్మకాలు సాగించేవారు. అయితే అక్రమ సారా సరఫరా అవుతుందంటూ సదరు వ్యక్తుల తాలుకు మనుషులు ‘ప్రైవేట్ సైన్యం’గా ఏర్పడి గ్రామాలతో పాటు తండాలలో విధ్వంసం సృష్టించేవారు. మళ్లీ అలాంటి ముప్పు వాటిల్లుతుందేమోనని ఆబ్కారీ శాఖ అందోళన చెందుతోంది. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో కాకపోయినా బెల్ట్ షాపుల రూపంలో మద్యం ఏరులైపారుతోంది. బెల్టు దుకాణాలను నియంత్రించలేకపోతున్న అబ్కారీ అధికారులు చివరికి పొరుగు రాష్ట్రాల నుంచి ఇటువైపు తరలిస్తున్న అక్రమ మద్యాన్నీ అడ్డుకోలేకపోతున్నారన్న విమర్శ ఉంది.
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కర్ణాటకకు సరిహద్దుగా ఉండడంతో కర్ణాటకలో తయారవుతున్న నకిలీ మద్యం సులభంగా మండలానికి చేరుతోంది. రాష్ట్రంలో తయారవుతున్న మద్యం కంటే కర్ణాటకలో తయారవుతున్న నకిలీ చీప్ లిక్కర్ ధర తక్కువగా ఉండడంతో దాని దిగుమతికే మద్యం వ్యాపారులు ఇష్టపడుతున్నారు. దానికి తోడు రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొనడంతో పలు గ్రామాల్లోని మద్యం బెల్టుషాపుల నిర్వాహకులు కర్ణాటక మద్యం అమ్మకాలను పెంచి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. కర్ణాటక నుంచి రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కర్ణాటక మద్యం గ్రామాల్లో ఏరులైపారుతోంది. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా మత్తు పదార్థాలు, మద్యం రవాణా కాకుండా కొడికొండ చెక్‌పోస్టులో 44వ జాతీయ రహదారిపై ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. గతంలో రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పుడు ఈ చెక్‌పోస్టులో పని చేసే పోలీసులకు చేతినిండా పని ఉండేది. నిషేధం ఎత్తేసిన తర్వాత సిబ్బందికి పని లేకపోయింది. అప్పటి నుంచి అరకొర సిబ్బందితో ఎక్సైజ్ పోలీస్ చెక్‌పోస్టు నడుస్తోంది. జాతీయ రహదారి విస్తరణ కావడంతో అతి వేగంగా వచ్చే వాహనాలను ఆపడం ఎక్సైజ్ పోలీసులకు కష్టంగా ఉంది.
దీనికి తోడు అవసరమైన సిబ్బంది స్టేషన్లో లేకపోవడంతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేయలేపోతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న అక్రమ మద్యం వ్యాపారులు కర్ణాటకు నుంచి భారీ ఎత్తున మద్యం తెచ్చి అమ్ముకుంటున్నారు. నిబంధనల ప్రకారం పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి వస్తోంది. స్టేషన్లో 15 మంది కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా ఆరుగురు మాత్రమే ఉన్నారు. వేగంగా వచ్చే వాహనాలను ఆపడం పోలీసులకు కష్టంగా ఉంది. పగటి సమయంలో అడపాదడపా తనిఖీ చేసినా రాత్రి పూట చేతులెత్తేస్తున్నారు. కర్ణాటక మద్యం రాత్రి సమయంలో మండలంలోకి వస్తోందని స్థానికులు అంటున్నారు. ఇక, తెలంగాణలోని నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏరులైపారుతున్న గుడుంబా లెక్కతేలింది. నాటుసారా జోలికి ఎవరూ వె ళ్లకుండా దాని స్థానంలో గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి కొద్ది రోజులుగా రాష్ట్రస్థాయిలో జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. అయితే గుడుంబా అమ్మకాలు జరిగే ప్రాంతాలు గుర్తించిన తర్వాతే ఎన్ని గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలకు అనుమతివ్వాలనే అంశం ఆధారపడి ఉంది.
దీంతో ఇటీవల జిల్లా ఎక్సైజ్‌శాఖ నాటుసారా అమ్మకాలు జోరుగా సాగే ప్రాంతాలను జల్లెడ పట్టింది. జిల్లా వ్యాప్తంగా 1178 గ్రామ పంచాయతీలు ఉండగా నాటుసారా తయారయ్యే గ్రామాలు 483 ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రామాలను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ‘ఏ’ కేటగిరిలో నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలు, తండాలు 260 ఉండగా సారా అత్యధికంగా అమ్ముడయ్యే గ్రామాలు, తండాలు కలిపి 483 ఉన్నాయి. ఈ గ్రామాల్లో నాటుసారా తయారీ అరికట్టడంతోపాటు, మద్యం వ్యాపారులు అక్రమంగా నడుపుతున్న బెల్టుదుకాణాల భరతం పట్టేందుకు ‘పీడీ యాక్ట్’ ప్రయోగించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గడిచిన నాలుగు మాసాల్లో పోలీస్‌శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాలు, తండాల్లో మెరుపుదాడులు చేస్తున్నారు. గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలు తెరవాలంటే ముందుగా నాటుసారా తయారీ నిరోధించాలి. దీనిలో భాగంగానే జూలైలో ఖరారు కావాల్సిన మద్య పాలసీ మూడు నెలల వరకు వాయిదా వేశారు.
వచ్చే నెలాఖరు నాటికి మూడు మాసాల గడువు పూర్తవుతుంది. అప్పటిలోగా బెల్లం అమ్మకాలు, నాటుసారా తయారీ, బెల్టుదుకాణాలను నామరూపం లేకుండా చేయాలని పోలీస్, ఎక్సైజ్ శాఖలకు ఆదేశాలు వచ్చాయి. గతానికి భిన్నంగా ప్రభుత్వం పోలీస్ శాఖకు సర్వాధికారాలు కట్టబెట్టింది. పోలీస్‌శాఖ దాడిచేసి పట్టుకున్న కేసులను గతంలో ఎక్సైజ్ శాఖకు అప్పగించడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాకుండా పోలీస్ శాఖకు కేసులు నమోదు చేసే అధికారాన్ని కల్పించారు. దీంతో పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా మెరుపు దాడులు చేస్తుండటంతో దానికి దీటుగానే ఎక్సైజ్ శాఖ సైతం నాటుసారా తయారీదారులపై కొరఢా ఝళిపిస్తోంది. వరుసగా మూడు, నాలుగు కేసులు నమోదైన వ్యక్తులు లేదా బెల్లం వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నారు.
సారా తయారీ, విక్రయాలకు అడ్డుకట్టవేయడంలో విఫలమైతే సంబంధిత ఎక్సైజ్, పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయమని సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీంతో నాలుగు మాసాలుగా ఈ రెండు శాఖలు కూడా కంటి మీద కునుకు లేకుండా గ్రామాల్లో, తండాల్లో తరచూ దాడులు చేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాటుసారా 25,023 లీటర్లు పట్టుకుంటే ఈ ఏడాది అదేరోజుల్లో 30,046 లీటర్ల సారాను సీజ్ చేశారు. గతేడాది అరెస్టయిన వ్యక్తులు 1338 మంది కాగా ఈ ఏడాది 1501 మందిని అరెస్టు చేశారు. నల్లబెల్ల అమ్మకాలు మాత్రం గతేడాది 15,915 కిలోలు సీజ్ చేయగా ఈ ఏడాది కేవలం 5,875 కిలోల బెల్లాన్ని మాత్రమే సీజ్ చేశారు. ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఈ దాడులు ఓ రికార్డు సాధిస్తాయని అధికారులు చెప్పడం గమనార్హం.


