రెయిన్ గన్లతో రైతుల్లో ఆనందం
- 103 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెయిన్ గన్ పథకంతో రైతులకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. సామర్లకోట మండలం జి. మేడపాడులో మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పతో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో వర్మీ కంపోస్టు యూనిట్‌ను పరిశీలించారు. కమ్యూనిటీ భవనాలు, పంచాయతీ కార్యాలయం, రోడ్లకు వారు శంకుస్థాపన లు చేశారు. సొసైటీ భవనం గోదాములను ప్రారంభించారు. సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజప్ప అధ్యక్షత వహించగా కేఈ కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
రెయిన్ గన్‌తో గంటకు 10 ఎకరాలు తడుస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తితో జిల్లాలో రైతులకు నీటిఎద్దడి ఏర్పడిన సమయంలో ఏలేరు ప్రాజెక్టుకు పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. వెబ్ ల్యాండ్‌లోని సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత తహసీల్దార్లపై ఉందని, జాప్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మేడపాడును ఓడీఎఫ్ గ్రామం ప్రకటించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాయలసీమ జిల్లాలో మేడపాడును ఆదర్శంగా తీసుకొని పని చేస్తామని తెలిపారు. చినరాజప్ప మాట్లాడుతూ పేదల కోసం వెయ్యి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ముత్యం రాజబ్బాయి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఎంపీపీ గొడత మార్తి, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి
కాకినాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. భర్త గాబు కూటబ్బాయి, కుమారుడు అయ్యప్పస్వామి, కుమార్తె నాగమణి, పంచాయతీ కార్యదర్శి ఆర్ఎస్.కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఇంటి పరిసరాలలో ఉన్న విద్యుత్తు స్తంభం పడిపోయి తీగలు కిందకు వేలాడాయి. అయితే అర్ధరాత్రి సమయంలో కాలకృత్యాల నిమిత్తం బయటకు వచ్చిన గాబు వరలక్ష్మి(30) విద్యుత్ తీగలను గమనించలేదు. దీనితో విద్యుత్‌తీగలు తగులుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కాగా, అంతర్వేది పల్లిపాలెం వశిష్టా రేవులో గుర్తితెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. సఖినేటిపల్లి ఏఎస్సై ప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి 35 ఏళ్ల వయసు ఉంటుందని, గుర్తిపట్టడానికి వీలుగా లేకుండా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పర్యాటక ప్రాంతాలలో మౌళిక సదుపాయాలు
హోప్ ఐల్యాండ్‌లో మొక్కల పెంపకానికి చర్యలు
కోరంగి నుండి హోప్ ఐలాండ్‌కు టూరిజం బోటులు
కాకినాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): జిల్లాలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా, గుర్తించిన పర్యాటక ప్రాంతలలో మౌళిక సదుపాయాలు కల్పించడానికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. మంగళవారంనాడు కాకినాడ కలెక్టరేట్ లో జిల్లాలో పర్యటక ప్రాంతాల అభివృధ్ధిపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలుగా 71 ప్రాంతాలు గుర్తించడం జరిగిందని, వీటిలో ప్రధానమైన ప్రాంతాలలో ఆయా శాఖలు, రోడ్లు, విద్యుఛ్చక్తి, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ వంటి సదుపాయాలు కల్పించడం ద్వారా పర్యాటక అభివృధ్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతంలో మౌళిక సదుపాయాలకు అవసరమైన నిధులను వెంటనే అంచనాలు వేయాలని, వీటికి కావలసిన నిధులు, ఆయా శాఖల నిధుల నుండిగానీ, ఇతర నిధుల నుండి ఖర్చు చేస్తామన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలుగా, ప్రముఖ దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, మ్యూజియంలు, ప్రకృతి సిధ్ధమైన వనరులు, రిజర్వాయర్లు, బీచ్‌లు,వాటర్‌ఫాల్స్ , నదుల సంగమం, గ్రామీణ పర్యాటక ప్రాంతాలు, నర్సరీలు, రిసార్ట్లు మొదలగు ప్రాంతాలు గుర్తించారని, ఈ ప్రాంతాలలో మౌళిక సదుపాయాలకు చర్యలు చేపడుతున్నాయని కలక్టర్ తెలిపారు. వీటిలో భాగంగా , పంచాయతీరాజ్ శాఖ నుండి సీసీ రోడ్లు, డ్వామా నుండి గ్రావెల్‌రోడ్లు, మొక్కల పెంపకం, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా మంచినీరు, టాయిలెట్స్,విద్యుత్ శాఖ నుండి లైటింగ్మొదలకు సౌకర్యాలు కల్పిస్తారన్నారు. ఈ పనులలో భాగంగా పర్యాటకులకు అనువైన గ్రీన్ టాయిలెట్స్‌ను ప్రోత్సహించాలని, ఈ మేరకు ఇతర పర్యాటక ప్రాంతాలను అధ్యయనం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ టాయిలెట్స్ నిర్మాణానికి అవసరమైతే సి.యస్.ఆర్.నిధులు వినియోగించేలా కార్పొరేట్ సంస్ధలు సహకారాన్ని కూడా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కోరంగ నుండి హోప్ ఐలాండ్‌కు టూరిజం బోట్స్ నడపేలా చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులకు కలెక్టర్ సూచించారు. దీని మూలంగా ప్రకృతీశిధ్ధమైన వనరులను పర్యటకులు తిలకించే అవకాశం లభిస్తుందని, ఈ మేరకు అవసరమైన కోరంగి అభయరణ్యం వద్ద డ్రెజ్జింగ్ పనులు చేపట్టాలన్నారు. అదే విధంగా హోప్ ఐలాండ్‌లోని అనువుగా ఉన్న 90 హెక్టార్లలో పెద్దఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని, దీని కోసం ఒక ప్రణాళిక రూపొందించాలని అభయరణ్య డిఎఫ్ఓ ప్రభాకర్‌కు ఫోన్లో సూచించారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాలు విద్యార్ధులు, మత్సకారులను కూడా భాగస్వామ్యులను చేయాలన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యటక సర్కూట్‌గా కోరంగి అభరణ్యం, హోప్ ఐలాండ్ మీదుగా కాకినాడ వచ్చేలా రూపొందించాలన్నారు. జిల్లాలో పర్యటక ప్రాంతమైన ఆదుర్రులో 1.20 కోట్లతో అప్రోచ్ రోడ్డు , గట్ల పటిష్టత, భవన నిర్మాణాల కొనసాగుతున్నాయని, ఈ ప్రాంతానికి పాసర్లపూడి నుండి అప్పనపల్లి వరకూ హౌజ్ బోట్ ప్రతిపాదన కూడా ఉందని కలక్టర్ తెలిపారు. పాపికొండలకు పర్యటకులను తీసుకువచ్చే బోట్లకు తప్పనిసరిగా రెండు ఇంజన్లు, నీటి లోతులు తెలిపే పరికరాలు, బీమా ఉండాలని, ఇటువంటి సౌకర్యాలు కలిగిన బోట్లను మాత్రమే అనుమతించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా కడియం నర్సరీలకు రోడ్ల నిర్మాణం, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లాలోని ఏజెన్సీలోని రంపా వాటర్ ఫాల్స్ వద్ద కమ్యూనిటీ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయాలని గ్రామీణ నిటీ సరఫరా శాఖ అధికారులను కలక్టర్ కోరారు. భూపతిపాలెం రిజర్వాయర్ గట్ల పై ఉపాధిహామీ పధకం ద్వారా మొక్కలను పెంచాలని, మారేడుమిల్లిలో సోలార్ విద్యుత్ ద్వారా ఎల్ఇడి బల్బ్‌లు ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ ను కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ మ్యూజియాన్ని ఆధునీకరించాలని జలవరరుల శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలోపర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ భీమశంకరం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ రాజేశ్వరరావు, వి.శ్రీనివాస్, ఇఇ టూరిజం, పి.వెంకటాచలం, టూరిజం అధికారి తదితరులు పాల్గొన్నారు.


