రైతులకు అండగా నిలవాలని టీపీసీసీ నిర్ణయం
- 74 Views
- wadminw
- October 4, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): పంట నష్టపోయిన రైతులకు అందాల్సిన 720 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీని వారికి ఇవ్వకుండా గుత్తేదారులకు మళ్లించటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. గాంధీభవన్లో మంగళవారం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశం గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతులు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రుణమాఫీ కోసం 37 లక్షల మంది రైతులు, 3 లక్షల మంది మహిళా రైతులతో దరఖాస్తులు నింపి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకపోవటం వల్ల విద్యావ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని… వీటి కోసం 14 లక్షల మంది విద్యార్థులతో దరఖాస్తు చేయించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య శ్రీ బకాయిలు, పంటలకు బోనస్ సహా ప్రభుత్వ హామీలపైనా ప్రజలతో దరఖాస్తుల ఉద్యమాన్ని చెపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 19న చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర, 20న పెద్దపల్లిలో రైతు గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీనియర్ నేతలు డీకే అరుణ, మధుయాష్కీ, మర్రి శశిధర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి, కోదండరెడ్డి, మల్లు రవితో పాటు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.


