రైలు టికెట్ దొరకని ప్రయాణీకుల సంఖ్య రోజకు 10 లక్షలట!?
రైలు టికెట్ దొరకక ప్రతిరోజూ పది లక్షల మంది రైలు ప్రయాణాలకు దూరమవుతున్నారు. ఇటీవల రైల్యాత్రి.ఇన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దూర ప్రయాణాల రైళ్ళలో గిరాకీ-సరఫరా అంతరం అధికంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అంటే ఒక నిర్దిష్ట రైలులో అందుబాటులో ఉన్న సీట్లకంటే కూడా అందులో ప్రయాణించాలంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే ఈ విధంగా ఉన్న అంతరాన్ని ఇప్పటి వరకూ పెద్దగా లెక్కించలేదు.
ఈ విధమైన అంతరాన్ని లెక్కించేందుకు ఈ ఏడాది జనవరి నుంచి రైల్యాత్రి దేశవ్యాప్తంగా రైలు టికెట్ బుకింగ్ ధోరణలను పరిశీలిస్తూ వచ్చింది. దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించిన అంశాలిలా ఉన్నాయి. సుమారు రోజుకు 12 లక్షల మంది తమ రైలు ప్రయాణాలకు టికెట్ పొందలేకపోతున్నారు. వీరంతా కూడా వెయిలింగ్ లిస్టులో టికెట్లు కన్ఫర్మ్ కాకుండా ఉండేవారే. దూర ప్రయాణాల రైళ్ళ ప్రయాణికులతో పోలిస్తే వీరు సుమారు 13శాతంగా చెప్పవచ్చు.
రద్దీ సీజన్లలో ఇది 19శాతం వరకు కూడా ఉంటుంది. 3100 రైల్స్టేషన్లలో 2800 రైళ్ళ కోసం చూస్తున్న 30 లక్షల మంది ప్రయాణీకులు వెల్లడించిన ట్రావెల్ ప్లాన్లను విశ్లేషించేందుకు రైల్యాత్రికు చెందిన డేటా లిస్టులు మేథమేటిక్ మోడల్స్‌ను వినియోగించారు. ఈ సందర్భంగా రైల్యాత్రి సీఈవో మనీష్ రాఠి మాట్లాడుతూ, రైలు ప్రయాణాల్లో గిరాకీ-సరఫరా అంతరం ఉన్నట్లు మనకందరికీ తెలుసు. ఇంకా ఎంత డిమాండ్ ఉందనే లెక్కలు మన కళ్ళు తెరిపించేవిగా ఉన్నాయని అన్నారు.
ఎలాంటి నిరోధకాలు లేనివిధంగా పౌరులు ప్రయాణించగలగడం ఒకదశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలకం. ఎన్నో రకాల రవాణా సాధనాలు అందుబాటులో ఉన్నా దూర ప్రయాణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేది రైళ్ళకే. మరిన్ని రైళ్ళను జోడించడం ఒక చక్కటి పరిష్కారంగా అనిపిస్తుంది గానీ అలాచేస్తే రోజూ మరిన్ని వందలాది రైళ్ళు తిరగాల్సి వస్తుంది.
ఇప్పటికే అధిక భారాన్ని మోస్తున్న నెట్‌వర్క్‌ను చూస్తే సమీప భవిష్యత్‌లో కొత్తగా రైళ్ళను ప్రవేశపెట్టే అవకాశం ఎంతో కష్టమని రాఠీ అన్నారు. రైలు ప్రయాణికులు ఎక్కడ ఎప్పుడు సాధ్యమైతే అక్కడ, అప్పుడు మల్టీ మోడల్ ట్రావెల్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇలా చేసేందుకు రైలు ప్రయాణికులను దూరప్రయాణాల బస్సులు, టాక్సీలు వంటివాటికి అనుసంధానించడం ద్వారా ఈ సాధికారికతను సాధించేందుకు రైల్యాత్రి కృషి చేస్తోందని రాఠీ అన్నారు.


