రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
చిత్తూరు జిల్లా చిలమత్తూరు మండల పోలీసు స్టేషన్ పరిధిలోని కనుమ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. పాత చమలపల్లి గ్రామానికి చెందిన రామచంద్ర, పూజిత (7) ఇరువురు అనంతపురం జిల్లా హిందూపూర్‌లో తమ సొంత పనులు ముగించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో పూజిత అక్కడిక్కడే మృతి చెందగా రామచంద్రకు కాలు విరిగింది. అతన్ని బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. కాగా, యాదమరి మండలం భూమిరెడ్డిపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని నుంజార్ల ప్రాజెక్టులో ఓ యువకుడు గల్లంతయ్యాడు.
ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో వచ్చి నీటిలో మునిగిపోయాడు. జీడీనెల్లూరు మండలం పాతపాళ్యం గ్రామానికి చెందిన 12మంది యువకులు ఆదివారం మధ్యాహ్నం నుంజార్ల ప్రాజెక్టుకు వచ్చారు. నీటిలో దిగి ఈత కోడుతుండగా మునస్వామి కుమారుడు యుగంధర్(20) నీటిలో మునిగిపోయాడు. ఇతని కోసం సహచరులు ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో విషయాన్ని పరిసర గ్రామస్థులకు తెలిపారు. విషయం పోలీసులకు తెలియడంలో అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.
దీంతో చిత్తూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రాజెక్టుకు చేరుకొని రబ్బరు బోటు సాయంతో ప్రాజెక్టులో యుగంధర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో వెనుతిరిగారు. సోమవారం వినాయక చవితి సెలవు దినం అయినప్పటికీ పోలీసులు గాలింపు కొనసాగించారు. ఆచూకీ లభించకపోవడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


