రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
- 75 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి సమీపంలో మంగళవారం బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. కత్తిపూడి నుంచి తుని వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న సన్యాసయ్య(40) బస్సును అధిగమించే క్రమంలో ప్రమాదవశాత్తు బస్సును ఢీకొన్నాడు. దీంతో ఇతనికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు 108 వాహనంలో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, రోడ్డుపై యువకుడి మృతదేహం అనుమానాస్పదంగా పడిఉన్న సంఘటన రాజమహేంద్రవరం మోరంపూడి ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక బాపూజీనగర్‌కు చెందిన కోసూరి నాగసాయి(18) తాపీపని చేస్తుంటాడు. సోమవారం పనిలోకి వెళ్లలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన మధుసూదనరావు అనే విద్యార్థి సైకిల్‌పై ఎక్కి మోరంపూడి సెంటరులో దిగాడు. అనంతరం ఆ విద్యార్థి కంప్యూటర్ క్లాసుకు వెళ్లిపోయాడు.
అక్కడ దిగిన నాగసాయి మద్యం దుకాణానికి వెళ్లాడని అనంతరం నామవరం వైపు నడిచి వెళ్లాడని స్థానికులు చెప్పినట్లు ఎస్సై తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో మోరంపూడి ఎస్బీహెచ్ సమీపంలో సోఫాఫ్యాక్టరీ ఎదురుగా నాగసాయి మృతదేహం పడి ఉండటం స్థానికులు గుర్తించి బొమ్మూరు పోలీసులకు సమాచారం అందించారు. అతడి శరీరంపై చిన్నగాయం, టైరు గుర్తులు ఉన్నాయి. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు రోడ్డు ప్రమాదంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.
నడిచి వెళుతున్న అతడిని ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి, పైనుంచి వెళ్లి ఉంటుందని, మృతిచెందిన అతడిని రోడ్డు పక్కన పెట్టి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 1 గంట వరకూ ఇంటివద్దే ఉండి బయటకు వెళ్లి మృత్యువాతపడిన కుమారుడి మృతదేహం వద్ద అతని తల్లి రోదించడం స్థానికులను కలిచివేసింది. ఘటనా స్థలం వద్దకు పెద్దసంఖ్యలో జనంచేరారు.


