లలిత కళా అకాడమీల పునరుద్దరణకు చర్యలు: మండలి
- 80 Views
- wadminw
- December 21, 2016
- రాష్ట్రీయం
తెలుగు సాహిత్యం, కళలకు పూర్వ వైభవం తెచ్చేందుకు సంగీత నాటక, సాహిత్య, లలిత కళా అకాడమీలను ప్రభుత్వం పునరుద్దరించనుందని రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలియజేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక గాంధీభవన్ సమీపంలోని దంటు కళాక్షేత్రం ఆడిటోరియంలో నిర్వహించిన ది యంగ్‌మెన్ హాపీ క్లబ్ శతవసంతోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగాను, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డి.విజయభాస్కర్ విశిష్ట అతిధులుగాను హాజరైయ్యారు.
ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సాహిత్యం, కళల ప్రయోజనం సమాజ హితమేనని, కన్యాశుల్కం, వరవిక్రయం వంటి నాటకాలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయన్నారు. సమాజాన్ని పీడిస్తున్న రుగ్మతలను రూపు మాపడంలో తెలుగు నాటకరంగం కీలక పాత్ర పోషించిందని, స్వాతంత్ర్య సమరంలోను, సంఘ సంస్కరణ ఉద్యమాల్లోను పాల్గొన్న నేతలు ఎందరో నాటకాన్నే ఆయుధంగా ఎంచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఉన్నత విలువలు మిగిలిన కళారూపాల్లో అంతరించిపోతున్నా, నాటక రంగం ఇప్పటీకీ కొనసాగిస్తోందన్నారు.
నూరు వసంతాల వేడుక జరుపుకుంటున్న ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ నాటక సమాజాన్ని అభినందిస్తూ, ఇందుకు తమ శక్తియుక్తులతో మూడుతరాలుగా కృషి చేస్తున్న దంటు వారి కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. నాటకరంగాన్ని పోషించిన రాచరికాలు అంతరించి నందున ప్రజలు, ప్రజాప్రభుత్వాలే వాటిని కాపాడి సజీవంగా నిలుపు కోవాల్సి ఉందన్నారు. ప్రజాదరణ నాటకాన్ని బ్రతికిస్తుందని, ప్రజలు నాటకాలను ఆస్వాదించి, ఆదరించాలని కోరారు. ముఖ్యంగా యువతలో నాటకరంగం పట్ల మక్కువ పెంచాల్సి ఉందని, ఇందుకు త్వరలోనే కాకినాడలో యంగ్మెన్స్ హాపీ క్లబ్ ఆద్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహిస్తామన్నారు.
సంస్కృతి కళల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత నిస్తోందని, తెలుగు సాహితి, కళల పూర్వ వైభవాన్ని, ప్రాభవాన్ని పునరుద్దరించేందుకు గతంలో రద్దయిన సాహిత్య, సంగీతనాటక, లలితకళా అకాడమీలు పురనరుద్దరిం చాలని తన నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించ మని, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వీటిని తిరిగి ఏర్పాటు చేయనుందని తెలియజేశారు.
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డి.విజయభాస్కర్ మాట్లాడుతూ సామాజిక, వ్యక్తిగత విలువలను కాపాడే నాటకరంగాన్ని కాపాడుకోవల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. తెలుగు నాటక రచయితలు, నటులు మరే ఇతర భాషా రచయితలు, నటులకు తీసిపోరని, అయితే నాటకాలను నేటి తరం ఆలోచనలు, అభిరుచుల కనుగుణంగా నిర్వహించే దర్శక పటిమను పెంపొందించాల్సిఉందన్నారు. నాటక రంగ అభివృద్దికి ఏ వినూత్న సూచనలు వచ్చినా ప్రోత్సహిస్తామన్నారు.
తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ నూరేళ్ల వేడుకలు జరుపుకుంటున్న ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ నాటక రంగ సేవలను కొనసాగిస్తూ మరిన్ని శతవసంతోత్సవాలు జరుపుకోవాలని కాక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల, సినీ నటి కృష్ణవేణి, రంగస్థల నటులు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రికి క్లబ్ శతవసంతోత్సవ గౌరవ పురస్కారాలను, క్లబ్ ఆస్థాన నటీమణులు జి.రత్నకుమారి, బాదం సుబ్బలక్ష్మికి గౌరవ పురస్కారాలను అతిధులు అందజేశారు. అలాగే క్లబ్ శతవసంతోత్సవ పోస్టల్ స్టాంపును కూడా ఆవిష్కరించారు.
వేడుకల సందర్భంగా నాటక రంగం అంశంగా కళాశాల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సభకు క్లబ్ అధ్యక్షలు దంటు సూర్యారావు అధ్యక్షత వహించగా, నాటకరంగ ప్రముఖులు గొల్లపూడి మారుతీరావు, మొదలి నాగభూషణ శర్మ, పతివాడ సూర్యనారాయణ, సి.ఎస్.రావు, కె.శాంతరావు, ఆకెళ్ల సూర్యనారాయణ, క్లబ్ కార్యదర్శి ఒవిఎన్ వరప్రసాదరావు, పి.దయానందబాబు, వాసా సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


