లిఫ్ట్ ప్రమాదంలో హోంమంత్రికి స్వల్పగాయాలు
- 82 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పెనుప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయనతో పాటు ఉన్న మరికొందరికి గాయాలై కాళ్లు విరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ మంత్రికి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వుండటంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
మధ్యాహ్నం 1 గంటకు రోజువారీ దినచర్యకు ఆటంకం లేదని డిశ్చార్జ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. చినరాజప్ప తన నియోజకవర్గానికి చెందిన పెద్దాపురం సమీపంలోని నెక్కంటి సీఫుడ్స్‌లో కార్మికులు గ్యాస్ లీకై అస్వస్థతకు గురవ్వడంతో కాకినాడ నూకాలమ్మ గుడివద్ద ఉన్న లక్ష్మీ సంజీవని ఆసుపత్రిలో చేరారు. మూడవ అంతస్తులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు 9.45 నిముషాలకు రాజప్ప ఆస్పత్రికి చేరుకుని లిఫ్ట్ ద్వారా మూడవ అంతస్తుకు వెళ్లి బాధితుల్ని పరామర్శించి తిరిగి రావడానికి లిఫ్ట్ ఎక్కాక రెండవ ఫ్లోర్‌కు చేరుకునే సరికి ఒక్కసారిగా లిఫ్ట్‌వైరు తెగి పడిపోవడంతో పెద్ద శబ్ధం వచ్చింది.
రాజప్పతో పాటు మొత్తం ఈ లిఫ్ట్‌లో మరికొంత మంది ఉన్నారు. వీరిలో స్నేహ టీవీ రిపోర్టర్ మదన్‌కుమార్, కెమేరామెన్ హసన్, టూటౌన్ బ్లూక్యాట్ విభాగం కానిస్టేబుల్ ఎన్.రాంబాబు, దివంగత మాజీ టిడిపి జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు అన్నగారి కొండుకు పర్వత సురేష్, కిర్లంపూడి మండలం, రామచంద్రపురం ఎంపిటిసి తుమ్మల రామకృష్ణలు లిఫ్ట్‌లో ఉన్నారు. అధికలోడు వల్ల లిఫ్ట్‌వైర్ తెగి పడిందని తెలుస్తోంది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోగానే హుటాహుటిన పోలీస్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది సైతం మంత్రిని కాపాడేందుకు పరుగులు పెట్టారు.
వెంటనే అదే ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనలో మంత్రికి స్వల్పగాయాలు కాగా కానిస్టేబుల్ రాంబాబుకు, స్నేహ టివి కెమేరా మెన్ హసన్‌కు కాళ్లు విరగడంతో కట్లు వేసినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. హోం మంత్రితో సహా మిగిలిన వారంతా స్వల్ప గాయాలతో బయటపడటం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇదిలా వుండగా హోం మంత్రి మూడవ ఫ్లోర్ నుంచి కిందికి దిగేటప్పుడు బటన్ నొక్కకుండానే దిగిపోయినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటుండగా మరికొందరు రెండవ ఫ్లోర్ నుంచి పడిపోయినట్టు చెబుతున్నారు. ఈ ఆస్పత్రి ఉన్న దాదాపు దశాబ్దానికి పైబడి నిర్మించింది కావడం, పలు రకాల షాపులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్న ఈ భవనాన్ని మొత్తంగా యాజమాన్యం తీసుకుని ఆధునికీకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.
ఈ ఆస్పత్రిని ఆధునికీకరించిన తర్వాత ప్రారంభమై ఏడాది కూడా పూర్తి కాలేదంటున్నారు. కానీ ఇదే ఆస్పత్రిలో గతంలో లిఫ్ట్ ప్రమాదంలో ఒకరు చనిపోయినట్టు, గత రెండు రోజుల క్రితం ఇదే లిఫ్ట్ ఇలానే పడిపోవడంతో ఒక వ్యక్తి ఆస్పత్రిపాలైనట్టు చెబుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆసుపత్రి యాజమాన్యం లిఫ్ట్ బాగోగుల విషయమై అశ్రద్ధ వహించిందంటున్నారు. కాగా జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ సంఘటనా స్థలికి వెంటనే చేరుకుని పరిస్థితి పరిశీలించి హోం మంత్రితో పాటు బాధితుల్ని సైతం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంఘటన జరిగిన తీరు వివరించారు.
ఈ సందర్భంగా యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా చికిత్స పొందుతున్న రాజప్పను నియోజకవర్గంలోని జె.తిమ్మాపురం ఎంపిటిసి కర్రి సత్యనారాయణ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ సత్యనారాయణమూర్తి దంపతులు, నగర దేశం నాయకులు గ్రంధి బాబ్జి, మాధవపట్నం సర్పంచ్ పిల్లి కృష్ణమోహన్, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నున్న దొరబాబు తదితరులు పరామర్శించారు. హోం మంత్రిని పరామర్శించేందుకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తరలివస్తున్నారు.


