లోకేష్‌కు మంత్రి పదవి
- 86 Views
- wadminw
- September 14, 2016
- రాష్ట్రీయం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే దసరా నాటికి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు క్యాబినెట్లో చెలామణీ అయినా మంత్రుల్లో ఎంత మంది ఇక ముందు కూడా కొనసాగుతారన్నది తేలాల్సి ఉంది. భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడతారనుకున్న వాళ్లతో మంత్రివర్గానికి కొత్త ఊపు తెచ్చే పనిలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకునే వారిని సీఎం ఇప్పటికే ఖరారుచేసేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, యువనేత, తన తనయుడు లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఐటీ శాఖతో పాటు మరికొన్ని కీలక బాధ్యతలను లోకేష్‌కు అప్పజెప్పనున్నారని సమాచారం. అందుకు సీనియర్ నేతలు సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది.
లోకేశ్ రాకతో కొంతమంది సీనియర్లకు చెక్ పెట్టి యువనేత వర్గంగా పేరుగాంచిన వారికి కొత్త బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరికి ఎసరు? ఎవరికి కొసరు? అన్నది స్పష్టంగా తెలియరానప్పటికీ భారీ మార్పులు మాత్రం తప్పేలా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త మంత్రివర్గంలోకి తీసుకునే వారిలో కొందరు సీనియర్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగుతున్న సత్తెనపల్లి ఎమ్మెల్యే డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావుకు మంత్రి పదవి ఇవ్వనున్నారు.
స్పీకర్ స్థానంలో పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేందర్‌ను నియమించనున్నట్టు సమాచారం. మంత్రి రావెల కిశోర్ బాబు స్థానంలో వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబును తీసుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. కొల్లు రవీంద్ర స్థానంలో జగ్గయ్యపేట శాసనసభ సభ్యుడు శ్రీరాం రాజగోపాల్‌ని మంత్రివర్గంలోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణకు సిఆర్డీఏ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించి ఆయన స్థానంలో కొత్తవారిని తీసుకోనున్నారు.
మంత్రివర్గంలో ఇప్పటి వరకు దూసుకెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు, నిమ్మకాయల చినరాజప్ప శాఖల్లో పలు మార్పులు జరుగనున్నాయట. వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన విజయనగరం శాసనసభ్యుడు సుజయకృష్ణ రంగారావు, కర్నూలు నుంచి భూమా నాగిరెడ్డి, తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ వంటి వారికి కొత్త మంత్రుల జాబితాలో చోటు లభించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి 20 మందితో ఉన్న మంత్రివర్గాన్ని 26కు పెంచే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి, కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం వ్యవహారం, కాపు రిజర్వేషన్ల అంశం చిలికిచిలికి గాలివానలా మారుతుండటంతో జ్యోతుల నెహ్రూకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ముద్రగడకు చెక్ పెట్టే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత క్యాబినెట్లో కీలక మార్పులు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంత మందిపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్లుగా మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు, నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని రెండేళ్లుగా మంత్రులకు సూచిస్తున్నా పనితీరులో మార్పులేదని సీఎం వర్గాల భోగట్టా. దీంతో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కుల, మతాల ప్రతిపాదికన తప్పించి వారి స్థానంలో అదే సామాజిక వర్గం వారికి చోటు కల్పించేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుత మంత్రుల్లో ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, శిద్దా రాఘవరావు, డాక్టర్ కమిడి మృణాళిని, పీతాల సుజాతతోపాటు సబ్జెక్టుపై పట్టులేని మరోఇద్దరు పనితీరుపై తొలి నుంచి సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి హామీపైనే టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు క్యాబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. భారీ పెట్టుబడుల ఆకర్షణకు లోకేశ్‌కు ఐటీశాఖ బాధ్యతలతోపాటు సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడుకి మంత్రివర్గం, అన్నిశాఖలను సమీక్షించే అధికారం కట్టబెట్టి జాతీయ రాజకీయాలపై చంద్రబాబు దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ దఫా జరిగే మంత్రివర్గ విస్తరణ వచ్చే ఎన్నికలు, కుల, మత ప్రతిపాదికన చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.


