వంతెనపై నుంచి రైల్వేట్రాక్ మీద పడిన లారీ
రాజమహేంద్రవరం, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి రైల్ కం రోడ్డు (ఆర్సీఆర్) వంతెనపై నుంచి మంగళవారం ఉదయం లారీ అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడింది. విజ్జేశ్వరం నుంచి కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం వస్తున్న లారీ వంతెన మలుపు వద్ద ఆగివున్న మరో ఇసుక లారీని ఢీకొట్టి పై నుంచి రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటనతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైల్వే ట్రాక్‌పై పడిన లారీని తొలగించారు.
విద్యుత్ సరఫరా పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్, క్లీనర్‌కు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హౌరా-విశాఖ-విజయవాడ-చెన్నై ప్రధాన రైల్వే లైనుపై నిత్యం వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇసుక లారీ ట్రాక్‌పై పడిన ఉదయం 5.30గంటల సమయంలో విశాఖ-విజయవాడ రైలు వెళ్లింది. రైలుపై లారీ పడి ఉంటే పెను ప్రమాదం సంభవించేది. అలాగే లారీ పడిన ట్రాక్ వద్దే అండర్ పాస్ ఉంది. దాని మీద పడినా రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రమాదం జరిగేది.
మరోవైపు, ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన రోడ్-కమ్-రైలు వంతెన ఆత్మహత్యలకు అడ్డాగా మారింది. చిన్న చిన్న కుటుంబ తగాదాలు, సమస్యలతో క్షణికావేశానికి లోనై వంతెన పైనుండి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం పరిపాటిగామారింది. గత ఏడాది వరుసగా జరిగిన ఆత్మహత్యల నేపథ్యంలో స్పందించిన రాజమండ్రి అర్బన్ ఎస్పీ ఉమాపతి వంతెనపై పోలీసు పహరా ఏర్పాటుచేశారు. నిత్యం ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ వంతెనపై గస్తీ తిరుగుతూ ఆనుమానాస్పదంగా కనిపించిన వారిని స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్ ఇప్పించి, పంపిస్తున్నారు. ఇదే తరహాలో బుధవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నలుగురిని పోలీసులు సకాలంలో గుర్తించి, రక్షించారు. ఈఏడాది ఇప్పటి వరకు 25 మంది గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
గత ఏడాది చివరినెలల్లో సుమారు 17 మంది గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే వంతెనపై గస్తీ కాస్తున్న వారిని పోలీసులు రక్షించారు. రోడ్డుకంరైలు వంతెన రాజమండ్రి టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. రోడ్డుకంరైలు వంతెనపై ఆత్మహత్యాయత్నాలకు సంబంధించి టూటౌన్లో ప్రత్యేకంగా ఒక ఫైల్‌నే నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ స్టేషన్ పరిధిలో అన్నీ గోదావరిలో అనుమానాస్పద మరణాల కేసులే నమోదయ్యేవి. రాజమండ్రిలోని మిగిలిన అన్ని స్టేషన్ల కన్నా ఈ స్టేషన్లో కేసుల సంఖ్య తక్కువ. అయితే గోదావరిలో తేలే మృతదేహాల కేసులు మాత్రం ఎక్కువగా ఉండేవి.
ఎస్పీ ఆదేశాలతో పహరా ఏర్పాటుచేయడంతో గోదావరిలో శవాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత బుధవారం ఉదయం రాజమండ్రి శాటిలైట్సిటీకి చెందిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి వంతెనపైకి వచ్చింది. ఇది గమనించిన గస్తీ పోలీసులు వారిని రక్షించారు. భర్త అప్పన్న మద్యం సేవించి, పనిలోకి వెళ్లకపోవడమేకాక తనను కూడా పనికి వెళ్లనివ్వకపోవడంతో కుటుంబ పరిస్థితిపై మనస్తాపానికి గురైన చిన్నపల్లి పోలమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.
ఐదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారునితో కలిసి రోడ్-కమ్-రైలు వంతెనపైకి వచ్చిన ఆమెను గుర్తించిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఆమెకు, భర్తకు కౌనె్సలింగ్ నిర్వహించారు. అలాగే తండ్రి మందలించాడని బుధవారం ఆత్మహత్య చేసుకోవాలని వంతెనపైకి వచ్చిన రాజమండ్రి గుండువారి వీధికి చెందిన 20 ఏళ్ల యువతిని కూడా పోలీసులు రక్షించారు. రోడ్డుకంరైలు వంతెనపై రాజమండ్రి పోలీసులు నిర్వహిస్తున్న పాత్రపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమ వారిని కాపాడిన పోలీసులను కుటుంబ సభ్యులు మనసారా అభినందిస్తున్నారు.
రాజమండ్రి చెన్నై-కలకత్తా ప్రధాన రైలు మార్గంలో వచ్చే ప్రధాన రైలుస్టేషను. గోదావరి మీద ఉన్న రైలు వంతెన వల్ల రాజమండ్రి భారతదేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రికి రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి. మెదటిది గోదావరి రైలు స్టేషను. రెండవది రాజమండ్రి రైలు స్టేషను. గోదావరి నది మీద మెదటి రైలు వంతెన (హేవలాక్ వంతెన) 1900 నిర్మించబడినప్పుడు గోదావరి రైలు స్టేషను నిర్మించారు. తరువాతి కాలంలో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల రెండో రైల్వే లైను సౌలభ్యం కోసం రైలు రోడ్డు వంతెన నిర్మాణం జరిగింది. 19890-1995 సంవత్సరాల మధ్య మూడవ రైలు వంతెన నిర్మాణం జరిగింది.


