వంశధార 60ఆర్ఎల్ కాలువకు గండి
- 70 Views
- wadminw
- September 23, 2016
- రాష్ట్రీయం
శ్రీకాకుళం, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): జిల్లాలోని నందిగాం, వజ్రపుకొత్తూరు మండలాలను కలుపుకుని ఉన్న వంశధార 60ఆర్ఎల్ కాలువ పీవిపురం వద్ద ఎడమ గట్టుపై గండి పడడంతో వంశధార నీరు పొలాలను ముంచెత్తింది. రైతులు గండిని పూడ్చే పనులు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో సమీపంలోని కణితివూరు-పీవిపురం మద్య దోణి వద్ద దిగువ భూములకు నీరు వెళ్లేందుకు రైతులు తాత్కాలికంగా నీరు పారే మార్గం ఏర్పాటు చేసుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న దిగువ భూములకు నీరు వెళ్లేందుకు పైపు ఏర్పాటు చేయక పోవడంతో నీటి ఉద్ధృతి పెరిగి సుమారు 7 మీటర్ల మేర గండి ఏర్పడింది. దీంతో ఇక్కడ పొలాలపై నీరు ముంచెత్తడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు.
మరో వైపు సీతాపురం రైతులు తమకు నీరు రావడంలేదంటూ గండి పడిన ప్రాంతానికి చేరుకొని తాత్కాలికంగా గండిని పూడ్చేందుకు సమాయత్తమయ్యారు. గండి పడిన ప్రాంతాన్ని వంశధార డీఈ బి.అప్పలనాయుడు, జేఈ శోభన్‌బాబు పరిశీలించి స్థానిక రైతులు అనధికారికంగా కాలువను తవ్వడంతో నీటి ఉద్ధృతికి అది పెరిగి గండి ఏర్పడిందన్నారు. తాత్కాలికంగా గండి పూడ్చే పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం తీసుకుంటామని చెప్పారు. గండి పడిన చోట కాలువకు ఇరువైపుల చెరో 10మీటర్లు చెప్పున గోడ నిర్మించి గండిపడేందుకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. ఇందులో రైతులు బి.మోహనరావు, బి.కామరాజు, పి.చంద్రయ్య, డిల్లీరావు తదితరులు ఉన్నారు.
పాడిపశువుల కొనుగోలుకు రూ. 20 కోట్లు మంజూరు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఆర్థికాభివృద్ధికి అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు. జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో ఎల్.ఎన్.పేట మండలం, పాతపట్నం నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయని వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పాడి పశువుల కొనుగోలు నిమిత్తం రూ. 20 కోట్లను మంజూరు చేశామని పశుసంవర్ధక శాఖ అధికారులను లబ్ధిదారులను ఎంపికచేసి పశువుల కొనుగోలు త్వరితగతిన చేపట్టాలన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా వ్యక్తిగత ఆదాయం పెంపొందించేందుకు చర్యలు చేపట్టి రైతులు ఆర్ధికాభివృద్ధి సాధించేలా చూడాలన్నారు. మత్స్యశాఖ ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి 10 వేల చెరువుల్లో చేపపిల్లలను అందించామన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ పి.రజనీకాంతరావు, సీపీవో ఎం.శివరాంనాయకర్, ఐటీడీఏ పీవో జె.వెంకటరావు, యువజన సర్వీసుల శాఖ (సెట్‌శ్రీ) సీఈవో వి.వి.ఆర్.ఎస్.మూర్తి, పంచాయతీ అధికారి కోటేశ్వరరావు, డీఎంహెచ్‌వో ఎస్.తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
మెరుగ్గా తపాలా బ్యాంకింగ్ సేవలు: నాగాదిత్యకుమార్
శ్రీకాకుళం, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): బ్యాంకింగ్ వ్యవస్థలకు అలవాటుపడిన ప్రజలను ఆకట్టుకునేలా తపాలా శాఖ సేవలను మెరుగుపరుస్తున్నామని, అన్ని ప్రధాన, ఉప, శాఖా తపాలా కార్యాలయాలకు లక్ష్యాలను నిర్ణయించి, పొదుపు ఖాతాల సంఖ్యను పెంచుతున్నామని జిల్లా తపాలాశాఖ సూపరింటెండెంట్ డబ్ల్యూ.నాగాదిత్య కుమార్ అన్నారు. జిల్లాలోని ఇచ్ఛాపురంలో గల ఉప తపాలా శాఖ కార్యాలయ పరిశీలనకు చేరుకున్న సందర్భంగా ఆయన ఆయా మండలంలో ఉన్న 14 శాఖా కార్యాలయాల సిబ్బంది, ఉప తపాలా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఆరు లక్షల పొదుపు ఖాతాలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అన్ని కార్యాలయాలలోనూ నెలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. అందుకు ప్రజలను చైతన్యపరిచి, వారికి అవగాహన కల్పించడం ద్వారా లక్ష్యాలను చేరుకోవచ్చునని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని చెల్లింపులు భవిష్యత్తులో తపాలా ద్వారానే ఉంటాయని, ఆ విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కేవలం రూ. 50తో ఖాతా ప్రారంభించవచ్చునన్నారు. ఈ మేరకు ఆన్లైన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నామని వివరించారు. ఇచ్ఛాపురం, పలాస ఉప కార్యాలయాలలో తపాలా ఏటీఎంలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఖాతా ఉండేలా తపాలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. 2017 సెప్టెంబరు నాటికి లక్ష్యాలను పూర్తిగా చేరుకోవాలన్నారు. సోంపేట ఉప తపాలా కార్యాలయ పరిధిలోని మెట్టూరు కార్యాలయంలో 3,160 ఖాతాలను ప్రారంభించడం శుభపరిణామమని ఎస్.పి. పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ పర్యవేక్షకాధికారి శ్యామ్‌సుందర్, ఉప తపాలా కార్యాలయ పోస్టుమాస్టర్ బి.శ్రీనివాసరావు, ఎన్.కామేశ్వరరావు, జయసింహ తదితరులు పాల్గొన్నారు.


