వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు
- 70 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో రైళ్లను వెనక్కి పంపించారు. రైలులోని ప్రయాణికులు బస్సుల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. అలాగే పలు రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
వివిధ రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. గుంటూరు – మాచర్ల – గుంటూరు ప్యాసింజర్, నడికుడి – మాచర్ల – నడికుడి ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దుచేయడంతో పాటు సికింద్రాబాద్ – గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్ – తిరుపతి – ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేశారు. అదే విధంగా రేపల్లె – సికింద్రాబాద్ – రేపల్లె ప్యాసింజర్‌ను కూడా రద్దుచేశారు. తిరువనంతపురం – హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా దారి మళ్లించారు. అదే విధంగా తిరువనంతపురం – గోరఖ్‌పూర్ రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌ను, హైదరాబాద్ – తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించారు.
మరో మూడురోజులూ వర్షాలు తప్పవు!
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం సాయంత్రం ఇక్కడ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోనూ మరో మూడురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మంగళ, బుధవారాల్లో తెలంగాణపై విరుచుకుపడిన వరుణుడు గురువారం ఆంధ్రప్రదేశ్‌పై కన్నెర్ర చేశాడు. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని వూటుకూరు వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు, స్థానికులు తాడు సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తడంతో బస్సు మధ్యలో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు తొలుత హెలికాప్టర్ సాయంతో బాధితులను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. అయితే స్థానికుల సాయంతో తాడు ద్వారా వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
జీహెచ్ఎంసీ వద్ద యూత్ కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): నగరంలోని రహదారులు అధ్వాన్నంగా ఉన్నా ప్రభుత్వం, జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేపట్టారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పార్టీ జెండాలు చేపట్టారు. అధ్వాన్నంగా ఉన్న రహదారుల ఫోటోలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్న నగరంలో భారీ వర్షం కురిసి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమైనా కేటీఆర్ పరిశీలించలేదని విమర్శించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. అక్కడై బైఠాయించి ఆందోళన చేస్తుండగా పోలీసులు బలవంతంగా వారిని అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు నగరం ఇంకా తేరుకోకముందే మళ్ళీ వర్షం ప్రతాపం చూపెడుతోంది. ఇప్పటికే నగరంలోని అనేక కాలనీలు, బస్తీలు, వరదనీటిలోనే నానుతున్నాయి. ముంపు ప్రజలు నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వర్షం మొదలు కావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, జిహెచ్ఎంసి అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ బాధితులకు అవి ఏమాత్రం సరిపోవడం లేదన్నారు.


