వర్సిటీ రూపురేఖలు మారుస్తాం: వీసీ
అమరావతి, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వచ్చే ఏడాదిలోగా సమూల మార్పులు చేసి రూపురేఖలు మారుస్తామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం డైక్మెన్ ఆడిటోరియంలో 39, 40వ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ 40 ఏళ్లలో ఇక్కడ చదివిన వారు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఖ్యాతి గడించారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ నాగేశ్వరరావులు ఇక్కడ విద్యార్థులేనని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయానికి లేని వనరులు ఇక్కడ ఉన్నాయన్నారు. వర్సిటీకి ప్రపంచ ర్యాకింగ్‌లో స్థానం, ఐఎస్ఓ గుర్తింపు పత్రం రావడం ఎంతో సంతోషంగా ఉందని…..ఈ ఘనత వెనుక అధ్యాపకులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది కృషి చేశారన్నారు. విద్యావిధానంలో అంతర్జాతీయ స్థాయి వసతులు, ఆహ్లాదకర వాతావరణం తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఇక్కడే చదువుకోవాలి అనుకునేలా మార్పులు చేస్తామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో అవార్డులందుకున్న అధ్యాపకులను ఉపకులపతి సత్కరించారు. వీరితోపాటు ఉత్తమ అధ్యాపకులు, ఉత్తమ పరిశోధకులకు అవార్డులు ప్రదానం చేశారు. వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న ఆచార్యులను సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన 22మందికి ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ సాంబశివరావు, రిజిస్ట్రార్ జాన్‌పాల్ పాల్గొన్నారు. కాగా, మాజేటి ముత్యాలు (సేవారంగం), డాక్టర్ డీఎన్‌రావు (యోగా), విన్సెంట్ పాల్ (సామాజిక సేవారంగం), విజయ్‌కాంత్ (సంగీతం), డాక్టర్ వెంకటేశ్వర్లు(సాహిత్యం), రంగనాయకి, (నృత్యం), ఆచార్య రమణారావు తరఫున ఆయన భార్య అందుకున్నారు (వృక్షశాస్త్రం), బండారు శ్రీనివాసరావు (వ్యవసాయం), జాన్(సాహిత్యం), గుమ్మడి రాధాకృష్ణమూర్తి(సేవా రంగం), విజయభాస్కరరావు (ఫొటో జర్నలిజం), వీఎస్ఎస్ ప్రసాద్ (వ్యవసాయం), బాలాత్రిపుర సుందరి (నృత్యం), డాక్టర్ రాజు అయ్యర్(వైద్యరంగం), డాక్టర్ సాంబశివరావు (విద్యారంగం), సత్యనారాయణ రెడ్డి(కళారంగం) పట్టాభిరాం (సాహిత్యం), గాలి సుబ్బారావు (సామాజిక సేవారంగం),నాగ రాజ్యలక్ష్మి (సాహిత్యం) కృష్ణంరాజు(మిమిక్రీ) కృష్ణా సుబ్బారావు(శిల్పకళ)వసంత కుమారి(సేవారంగం).
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం
అమరావతి, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): రోజువలె కైకలూరులో పని చేసుకుని మోటారు సైకిల్‌పై ఇంటికి వెళుతున్న తండ్రీ కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.మండవల్లి మండలం భైరవపట్నానికి చెందిన మదాని అమర్, కొడుకు ఉమామహేశ్వరరావుతో కలిసి శుక్రవారం కైకలూరులో వడ్రంగి పనులు ముగించుకుని మోటారు సైకిల్‌పై ఇంటికి వెలుతుండగా కైకలూరులోని ఓరియంటల్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఆకివీడు నుంచి గుడివాడ వైపు వెళ్లే లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో కుమారుడు ఉమామహేశ్వరరావు(22) సంఘటన స్థలంలోనే మృతి చెందగా, తండ్రి అమర్‌ను స్థానికులు ఆటోలో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. వైద్యులు ప్రాథమ చికిత్స అనంతరం 108లో ఏలూరు తరలిస్తుండగా మృతి చెందాడు. కొన్ని గంటల్లోనే తండ్రీ కొడుకులు ఇద్దరు విగతజీవులవడాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రమాద సంఘటనపై పట్టణ ఎస్సై షబ్బీర్‌అహ్మద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జక్కంపూడి ప్రాంత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పునరుద్ధరణ
అమరావతి, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): విజయవాడ గ్రామీణ మండలం జక్కంపూడి ప్రాంతంలో గతంలో వివిధ సర్వే నంబర్లలో నిలుపుదల చేసిన రిజిస్ట్రేషను ప్రక్రియను తిరిగి చేపట్టనున్నట్టు కలెక్టరు బాబు.ఎ తెలిపారు. నగరంలోని తమ విడిది కార్యాలయంలో సెక్షన్ 22పై రెవెన్యూ, రిజిస్ట్రేషను శాఖల అధికారులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కలెక్టరు మాట్లాడారు. జక్కంపూడి ప్రాంతంలోని సర్వే నంబర్లు 157, 161 నుంచి 170 (162 మినహా), 175 నుంచి 181, 182పి, 183, 184 సర్వే నంబర్లలో భూములను రిజిస్ట్రేషను చేయించేందుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అక్టోబరు 4వ తేదీన అధికార బృందంతో జక్కంపూడి ప్రాంతంలో పర్యటిస్తామని కలెక్టరు తెలిపారు. జక్కంపూడి రైతుల అభివృద్ధి కమిటీ సభ్యులు సూచించిన అంశాలపై కలెక్టరు సానుకూలంగా స్పందించారు. భూ సమీకరణకు జక్కంపూడిలో తొలిసారిగా భూములు ఇచ్చింది తామేనని రైతులు తెలిపారు. కలెక్టరు మాటాడుతూ విజయవాడ నగర పరిధిలోని 655 ఎకరాల రిజిస్ట్రేషను ప్రక్రియకు జిల్లా యంత్రాంగం చర్యలు పూర్తి చేసినట్టు తెలిపారు. నగర పాలక సంస్థ, రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ తదితర శాఖలకు చెందిన సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లకు అనుకూలమైన వ్యక్తులకు అనుమతుల ఇవ్వడం జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ గంధం చంద్రుడు, ఉపకలెక్టరు సృజన, డీఆర్వో రంగయ్య, రిజిస్ట్రేషను శాఖ అధికారులు బాలకృష్ణ, శ్రీనివాసరావు, శివరాం, విజయవాడ నగర, గ్రామీణ తహసీల్దార్లు ఆర్.శివరావు, మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


