వాడవాడలా వినాయక చవితి సందడి
వక్రతుండ మహాకాయ అంటూ ఏ పని మొదలు పెట్టినా మొట్ట మొదట పూజించేది విఘ్నేశ్వరుడినే. తాము చేయబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలని బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్లు, లడ్డూలు నైవేద్యంగా పెట్టి ప్రత్యేక పూజలు చేస్తాం. ఈ సారి కూడా వినాయక నవరాత్రులకు ఊరూ వాడా సమాయత్తమైంది. ఎక్కడ చూసినా వీధుల్లో మండపాలు వెలిసి విగ్రహాలు కొలువు తీరుతున్నాయి. వీధి వీధిలో యువత ఉత్సవాల ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు. పల్లె పట్నం తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి కళ సంతరించుకుంది. ఎక్కడ చూసినా వీధి వీధుల్లో మండపాలు వెలిసి అందులో వినాయకుడి విగ్రహాలు కొలువుతీరుతున్నాయి.
భారీ ఎత్తున యువకులు ఏర్పాట్లలో నిమగ్నమై విగ్రహాలు ప్రతిష్టిస్తున్న సందడే కనబడుతోంది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అంతా కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే వాడాలని విస్తృత ప్రచారం చేపట్టిన నేపథ్యంలో ఈసారి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు స్వస్తి చెప్పి మట్టి విగ్రహాల ఏర్పాటుకు భక్తులు మొగ్గుచూపుతున్నారు. విశాఖపట్నంలో వినాయకచవితి ఉత్సవాలకు అంతా సిద్ధమవుతున్నారు. నగరంలో ఎక్కడ చూ సినా చిన్న చిన్న మట్టి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. అటు తెలంగాణలో ఓరుగల్లు నగరం వినాయక చవితి వేడుకలకు ముస్తాబవుతోంది. నగరంలో ఎక్కడ చూసినా వినాయక మండపాలు వెలిసి సందడి వాతావరణం నెలకొంది. భక్తులను ఆకట్టుకునేలా విభిన్న ఆకృతులతో భారీ సెట్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఏదేమైనా ఈసారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని యువత కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మట్టి వినాయకులను ప్రతిష్టంచడానికే భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు మక్కువ చూపుతున్నారు. వరంగల్, హన్మకొండ ప్రధాన రహదారిలో సిద్ధంగా ఉంచిన విగ్రహాలను కొనేందుకు భారీ ఎత్తున వివిధ గ్రామాల నుంచి భక్తులు వస్తున్నారు. ఈ యేడు వినాయక చవితికి అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నప్పటికీ ధరల విషయంలో మాత్రం భక్తులు మిశ్రమ స్పందన వెల్లడవుతోంది. విగ్రహాలు తక్కువ ధరలకే లభిస్తున్నప్పటికీ పూలు, పండ్లు, పూజా సామాగ్రి ధరలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. కొన్ని చౌకగా ఉన్నప్పటికీ మరికొన్ని వస్తువులు మాత్రం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పండుగ సమయంలో ధరలు పెరగడం కామనే కదా అంటున్నారు వినియోగదారులు.
వినాయక చవితి సందర్భంగా అటు పోలీసులు సైతం భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లకు సన్నద్ధమయ్యారు. ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉత్సవ కమిటీలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి సోమవారం నుంచి ఎక్కడ చూసినా గణపతి బప్పా మోరియా అంటూ ఊరూ వాడా మారుమోగబోతోంది. వినాయక చవితి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేడుకలను సోమవారం భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. దేశమంతటా భక్తులు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్త్రి శ్రద్దలతో వ్రతాలు నిర్వహిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా, కాణిపాకం విఘ్నేశ్వర ఆలయంలో 21 రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
వినాయక చవితి సందర్భంగా ఉదయం 4 గంటలనుండి భక్తులని స్వామి దర్శనానికి అనుమతించారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ మహా గణపతి ఉత్సవాలని, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.స్.ఎల్. నరసింహన్ దంపతులు తొలి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి జరగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. మరోవైపు, చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ భారీ స్థాయిలో పూర్తయ్యాయి.
భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 5న వినాయక చవితి, 6న హంసవాహనం, 7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం, 24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నిత్యం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రభుత్వం తరపున స్వామివారికి సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మరోవైపు స్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవానం నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవానం ఉదయం ధ్వజారోహనంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. కాగా, ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి గవర్నర్ నరసింహన్ దంపతులు తొలిపూజ చేశారు. రాజ్‌భవన్ నుంచి మండపం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అర్చకుల వేద మంతోచ్ఛరణల మధ్య వినాయకుడికి తొలిపూజ నిర్వహించారు.
మహాగణపతిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఖైరతాబాద్ పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని గవర్నర్ నరసింహన్ అన్నారు. మహాగణపతికి తాను తొలిపూజ చేయడం ఇది వరుసగా ఆరో ఏడాది అని తెలిపారు. వినాయకుడిని పూజించడం వల్ల అందరి విఘ్నాలు తొలగిపోతాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు నల్గొండ పద్మశాలి సంఘం తరఫున మహాగణపతికి 75 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు. కండువాను నలభై రోజుల పాటు భక్తిశ్రద్ధలతో తయారుచేసినట్లు పద్మశాలీ సంఘం సభ్యులు యాదగిరి, లింగయ్య తెలిపారు. ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది.
వినాయక చవితి సందర్భంగా వందలాది మంది భక్తులు మహాగణపతిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. తొలిరోజున సోమవారం ఉదయం పద్మశాలి సంఘం గణపతికి 75 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 9-10 గంటల మధ్య గవర్నర్ నరసింహన్ దంపతులు గణేశుడికి తొలిపూజ నిర్వహించనున్నారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ తయారుచేసిన 500 కిలోల లడ్డు గణేశుడి వద్దకు చేరుస్తారు. కాగా, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మట్టితోనే 416 దేవతామూర్తుల ప్రతిమలను 41ఏళ్లుగా సర్‌సిల్క్ విశ్రాంత కార్మికుడు ఇప్పలపల్లి సదానందం తయారు చేశారు. కొన్నేళ్ల క్రితమే పర్యావరణ పరిరక్షణలో భాగంగా సహజంగా లభించే మట్టి, ఎండిన గడ్డి, తట్టుబొంతలతో దేవతామూర్తులను తయారు చేస్తున్నారు.
కాగజ్‌నగర్ సర్‌సిల్క్ కాలనీకి చెందిన సదానందం సర్‌సిల్క్ మిల్లులో కార్మికుడిగా పని చేశారు. 1964లో పట్టణంలోని సర్‌సిల్క్ ఎల్బీఎస్ మార్కెట్లో ప్రతిష్ఠించిన గణనాథుడిని మట్టితోనే తయారు చేసి, ఆవిష్కరించారు. అప్పటి నుంచి నేటి వరకు ఏటా గణపతి, సీతారాములమూర్తులు, దుర్గాదేవి, కాళీకామాత, తదితర దేవతామూర్తులను సైతం ఆయన మట్టితోనే తయారు చేస్తుంటారు. అయితే సదానందం తయారు చేసిన దేవతామూర్తులు ప్రత్యేక అలంకరణగా ఉండటంతో కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, ఆసిఫాబాద్, మంచిర్యాలతోపాటు వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల వారు ఇక్కడి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ముందస్తుగానే దేవతామూర్తుల ప్రతిమలను తయారు చేయాల్సిందిగా ఆర్డరుపై ఇస్తారు. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ కార్యాలయంలో ప్రతిష్ఠాపించనున్న ‘హరితహారం గణనాథుడు’ నమూనాలో తయారు చేశారు.
తుదిమెరుగులు దిద్దుకుంటుంది. గణనాథుడు రెండు మొక్కలను పట్టుకున్నట్టుగా దాదాపు 10ఫీట్లు ప్రతిమను తయారు చేశారు. పూర్తిగా మట్టితోపాటు ఎండుగడ్డి, తట్టుబొంతలతోనే నెలరోజులపాటు తయారు చేశారు. కొన్నేళ్లుగా మట్టితోనే ప్రతిమలను తయారు చేస్తున్నా. అప్పట్లోనే కెమికల్స్, రంగులు లేకుండా ప్రతిమలను తయారు చేశాం. కళాకారులకు సైతం తాను మట్టితోనే ప్రతిమలు తయారు చేసే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో పర్యావరణ, జల కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే మట్టితో తయారు చేసిన మట్టి గణనాథులను వాడలంటున్నారు సదానందం.


