విద్యారంగానికి రూ. 28 వేల కోట్లు: మంత్రి పీతల
- 86 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో విద్యారంగానికి 28 వేల కోట్లరూపాయలు కేటాయించి ప్రతీ ఒక్కరికీ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి పీతల సుజాత చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఏలూరు శనివారపుపేటరోడ్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీచర్‌గా సమర్ధవంతంగా పనిచేసి రాష్ట్ర మంత్రి పదవిని చేపట్టిన పీతల సుజాతను డిఇఓ మధుసూధనరావు ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులను సత్కరించడం సమాజ బాధ్యతగా భావిస్తున్నామని పీతల సుజాత టీచర్‌గా ఎంతోకష్టపడి పనిచేసి ఉపాధ్యాయలోకానికే మంచి పేరు సంపాదించారని రాష్ట్రమంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వశాఖను నిర్వర్తిస్తూ ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు ఏరంగంలోనైనా రాణిస్తారనడానికి సుజాతే నిదర్శనమని మధుసూధనరావు చెప్పారు.
ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ వినాయకచవితి సందర్భంగా 5వ తేదీ సెలవుదినం కావడంతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 7వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పాఠాలు చెప్పాలనే ఆతృత తనలో ఉన్నదని త్వరలోనే పలు పాఠశాలలను ఆకస్మిక తనీఖీ చేసి పాఠాలు భోధిస్తానని సుజాత చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కష్టపడి పనిచేస్తున్నదని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతీ పాఠశాలలోనూ మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో 11 వేల 355 తరగతి గదుల్లో విద్యార్ధినీ విద్యార్ధులకోసం ప్రత్యేక ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించామని ఇప్పటికే పదివేల తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్ సౌకర్యం కల్పించామని త్వరలోనే అన్నీ తరగతి గదుల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్ధినీ విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తామని సుజాత చెప్పారు.
ప్రతీపాఠశాలలోనూ రక్షితమంచినీటి సౌకర్యం, ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పదికోట్లరూపాయల వ్యయంతో 634 కిచెన్ షెడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని ప్రతీ పాఠశాలలోనూ కిచెన్ గార్డెన్లు ఏర్పాటుచేసి పండిన కూరగాయలను మధ్యాహ్న భోజన పధకంలో వినియోగించి పిల్లలకు పోషకాహారం అందించే ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని సుజాత చెప్పారు. ఒకటి నుండి పదవతరగతి వరకూ చదువుతోపాటు విద్యార్ధులకు నచ్చిన క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందించే క్రీడాప్రణాళికను కూడా అమలు చేస్తున్నామని దీనివలన విద్యార్దినీ విద్యార్ధుల్లో క్రీడానైపుణ్యంతోపాటు ఆరోగ్యవంతమైన జీవనం సాగించగలుగుతారని పీతల సుజాత చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూమొక్కల పెంపకాన్ని ఒక బాధ్యతగా చేపట్టాలని అనుక్షణం ఆరోగ్యవంతంగా జీవించాలంటే మనమంతా పచ్చని మొక్కల మధ్య జీవించేవిధంగా పెద్ద ఎత్తున వాటి సంరక్షణా బాధ్యత చేపట్టాలని కోరారు.
ఉపాధ్యాయులు విద్యారంగంలో వస్తున్న నూతన విధానాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని భావిభారతపౌరులను తీర్చిదిద్దాలని పోటీతత్వంతో విద్యాభోధన సాగించి కార్పోరేట్ విద్యాసంస్ధలకు ధీటుగా ప్రభుత్వపాఠశాలలను తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత చేపట్టాలని ఉపాధ్యాయులను కోరారు. పదవతరగతిలోపు విద్యార్ధినీ విద్యార్ధులకు వివిధ వృత్తుల్లో కూడా నైపుణ్యం సాధించేలా 120 వృత్తుల్లో విద్యతోపాటు వృత్తివిద్యాకోర్సుల్లో కూడా ప్రత్యేక శిక్షణ అందిస్తామని చదువు అనంతరం ప్రభుత్వోద్యోగం కోసం ఎదురుచూడకుండా స్వశక్తిపై జీవించే స్ధాయికి విద్యార్ధినీ విద్యార్ధులను తీర్చిదిద్దుతామని సుజాత చెప్పారు. మారుమూల ప్రదేశాల్లోని పాఠశాలలకు రహదారి సౌకర్యం కల్పించి ఆప్రాంతంలోని పేదలకోసం పాఠశాలలను నిర్వహిస్తున్నామని ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సుజాత కోరారు. త్వరలో బాలికలకు పాఠశాలలకు రావడానికి వీలుగా సైకిళ్లను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేయనున్నారని సుజాత చెప్పారు. ఈ సమావేశంలో కామవరపుకోట జడ్పిటిసి గంటా సుధీర్ బాబు, జంగారెడ్డిగూడెం యంపిడిఓ సుజాత, తెలుగుదేశం పార్టినాయకులు చినబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
చెరువులో మునిగి యువకుడి మృతి
ఏలూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): గేదెను కడిగేందుకు చెరువులో దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మరణించిన సంఘటన మంగళవారం ఉప్పలపాడు పంచాయతీలో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గోపాల్‌నగర్ కాలనీకి చెందిన ఎస్.రవి (21) అనే యువకుడు గేదెను కడిగేందుకు గ్రామంలోని అలివేలుకుంట చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మునిగి అసువులు బాశాడు. వీఆర్వో ఎం.ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా, తాడేపల్లిగూడెం మండలం దండగర్ర ఊర చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. దండగర్ర గ్రామానికి చెందిన అంజుర్తి రత్తయ్య (48) అనే వ్యక్తి వేకువజామున బహిర్భూమికి వెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఊరచెరువులో మృతదేహం తేలియాడటాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుని కుమారుడు సూర్యం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహిర్భూమికి వెళ్లి రత్తయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటాడని ఎస్సై పేర్కొన్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
శాంతారాం సేవల్ని కొనియాడిన మంత్రి సుజాత
ఏలూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): విధినిర్వాహణలో అంకితభావం, అనుక్షణం అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంచి అధికారిగా పేరుపొందిన కామవరపుకోట యంపిడిఓ కె. శాంతారాం ఆకస్మిక మరణం తననెంతో బాధకు గురి చేసిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి పీతల సుజాత చెప్పారు. స్ధానిక జేవిఆర్ నగర్లో ఉంటున్న శాంతారాం కుటుంబ సభ్యులను మంత్రి మంగళవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా శాంతారాం చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రమోషన్‌పై కృష్ణాజిల్లా నుండి వచ్చిన శాంతారాం కొద్దినెలల్లోనే అందరిమన్ననలు పొందగలిగారని అటువంటి మంచి అధికారి ఆకస్మికంగా గుండెపోటుకు గురై అకాల మరణం చెందడం చాలా బాధగా ఉందని భౌతికంగా కుటుంబానికి శాంతారాంను తీసుకురాలేకపోయినా ఆకుటుంబానికి అన్నీవిధాల అండగా ఉంటానని పీతల సుజాత చెప్పారు. ఎప్పుడూ కూడా పల్లెప్రాంతాలలో మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు ప్రజలకు అభివృద్ధిఫలాలు అందాలనే ఆతృతతో శాంతారాం నిరంతరం కష్టపడి పనిచేసేవారని అటువంటి మంచి అధికారి గుండెపోటుతో మరణించడం బాధాకరమని పీతల సుజాత చెప్పారు. మంత్రి వెంట తహశీల్ధార్లు సత్యనారాయణరాజు, సోమశేఖర్, సత్యనారాయణ, మైఖేల్ రాజు, యంపిడిఓ శ్రీదేవి, జడ్పిటిసి గంటా సుధీర్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బారావు, చినబాబు తదితరులు పాల్గొన్నారు.


