విద్యార్థులే వర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్లు: వీసీ
- 79 Views
- wadminw
- September 9, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 9 (న్యూస్టైమ్): విద్యార్థులే విశ్వవిద్యాలయానికి బ్రాండ్ అబాసిడర్లుగా నిలుస్తారని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వైవిఎస్మూర్తి ఆడిటోరింయంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతోపాటు కళలలో విద్యార్థులు రాణించాలన్నారు.రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో చేరడం జరుగుతోందన్నారు. వర్సిటీలోని నిపుణులైన బోధన సిబ్బంది, మౌళిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య పి.విజయ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ మేధస్సును పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. ఇంక్యుబేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకుంటూ యువ పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ప్రభుత్వం యువతకు అవసరమైన అన్ని వసతులు కల్పనకు సిద్దంగా ఉందన్నారు.
విద్యార్థులు తమ పరిధి, పరిమితులు తెలుసుకుని నడచుకోవాలన్నారు. పాలక మండలి సభ్యులు ఆచార్య జి.శశిభూషణ రావు మాట్లాడుతూ విద్యార్థులు అత్యుత్తమ నైతిక విలువలతో నడచుకోవాలన్నారు. ఇంజీనరింగ్ కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.ఎస్ ప్రసాద బాబు మాట్లాడుతూ విద్యార్థుల మేధస్సు, సాంసృతిక, కళా ప్రతిభను ప్రస్పుటం చేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతులు, ఆచార్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుళ సాంసృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. పాశ్యాత్య, సినీ గేయాలకు విద్యార్థులు ఉత్సాహంగా నాట్యం చేశారు.


