విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
- 94 Views
- wadminw
- December 22, 2016
- రాష్ట్రీయం
పూజ షామియానా వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు ప్రాణాలు విడిచిన విషాద ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధి మెట్టుగూడలో చోటు చేసుకుంది. మెట్టుగూడలోని గోవిందపురానికి చెందిన కళ్యాణ్(18) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అయ్యప్పమాల ధరించాడు. అదే ప్రాంతానికి చెందిన శివకుమార్(21) ఓ షామియానాలు వేసే కేంద్రంలో పనిచేస్తూ తల్లిని పోషిస్తున్నాడు.
శివకుమార్ మిత్రులంతా అయ్యప్పమాలలు ధరించడంతో పాటు ఆయన బాబాయి కుమారుడు మాలధరించడంతో బుధవారం ఇంటివద్ద పడిపూజ నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. శివకుమార్, కళ్యాణ్ మిత్రులు కలిసి మండపం వేస్తున్నారు. మండపానికి రాడ్లను నిలిపేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు చేతిలోని రాడ్డు విద్యుత్తు తీగలకు తగిలింది. ఒక్కసారిగా విద్యుదాఘాతం ఏర్పడింది.
రాడ్డును తొలగించి ఇద్దరిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. మృతదేహాలను మార్చురికి తరలించారు. కళ్లముందే ఇద్దరు మిత్రులు మృత్యువాత పడడంతో వారి స్నేహితులంతా విషాదంతో కంటతడి పెట్టారు. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, నాయకులు మహేందర్యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఆగస్టులో కురిసిన గాలివానలకు ఈ ప్రాంతంలో ఓ చెట్టు కూలి హైటెన్షన్ విద్యుత్తు తీగల మీద పడింది. ఈ ఘటనలో అక్కడున్న ఓ విద్యుత్తు స్తంభం ఒరిగింది. ఆ స్తంభానికి కిందకు వేలాడుతున్న తీగలను సరిచేయాలని స్థానికులు విద్యుత్తుశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు అప్పుడే స్పందించి వేలాడే తీగలను సరిచేసి ఉంటే ప్రస్తుతం విద్యుదాఘాతానికి అవకాశం ఉండేది కాలని, అప్పుడు కిందకు వేలాడుతూ తీగలు అలాగే ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


