విపక్షాల విమర్శలు అర్ధరహితం: వెంకయ్య
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భవిష్యత్తు కోసమే ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దుపై విఫ్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ అంశంలో ఎలాంటి కుంభకోణం లేదని దేశహితం కోసం ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.
బుధవారంనాడు ఇక్కడ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు కుంభకోణం అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని వెంకయ్యనాయుడు అన్నారు. కుంభకోణాలు యూపీఏ పాలనలోనే జరిగాయని అన్నారు. విమర్శలు చేయవచ్చు పరవాలేదు. కాని ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలి. ప్రధాని తీసుకున్న నిర్ణయంలో కుంభకోణం ఉందనడం అర్ధరహితమని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలతో అప్పటి వైమానిక దళ మాజీ చీఫ్ త్యాగి అరెస్టు కావడమే నిదర్శనమని అన్నారు. అలాంటి అత్యున్నత స్థాయి అధికారి కుంభకోణంలో చిక్కుకుని అరెస్టు కావడం దేశ చరిత్రలో పునుపెన్నడు జరగలేదని అన్నారు. నల్లధనం కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అవినీతి నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు.
నల్లధనం బయటకి వస్తే మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపటాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదల ప్రజల బతుకులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకే డిజిటల్ మనీని ప్రోత్సమిస్తున్నామని వెంకయ్యనాయుడు అన్నారు. విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
కాని కుంటిసాకులు చూపుతూ చర్చకు తావు ఇవ్వకుండా విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లో పార్లమెంట్ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగినున్నందున ఇప్పటికైనా సభలో అన్ని అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనేక ప్రజా సమస్యలు చర్చించాల్సి ఉందని అన్నారు. విపక్షాలు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.


