విపత్తు సమయంలో నిర్లక్ష్యం తగదు: సీఎం చంద్రబాబు
- 78 Views
- wadminw
- September 23, 2016
- రాష్ట్రీయం
విజయవాడ, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం కంట్రోల్ రూమ్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో శ్రద్ధ వహించాలని, సకాలంలో సమాచార మార్పిడి జరగాలని అన్నారు. గల్లంతైన వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు పంపుతున్నట్లు చెప్పారు. గన్నవరం విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే సత్తెనపల్లి, రాజుపాలెం, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో సిబ్బందిని రంగంలోకి దించామన్నారు.
రెస్క్యూ ఆపరేషన్లను సకాలంలో సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. పుష్కరాలలో పంటలు కాపాడటంలో చూపిన చొరవ విపత్తులో కూడా చూపాలని సీఎం ఆకాంక్షించారు. రహదారులపై కూలిన చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని, గండ్లు పూడ్చాలని అన్నారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలన్నారు. ఆయా గ్రామాలు, పట్టణాలలో విద్యుత్‌ను పునరుద్ధరించాలన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో కమాండ్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవో, డిఎస్పీ తదితర డివిజన్ స్థాయి అధికారులు అక్కడినుంచే గ్రామ, మండలస్థాయి సిబ్బంది పనులను పర్యవేక్షించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. విపత్తు సమయంలో నిర్లక్ష్యం తగదన్నారు.
వరద బాధిత సహాయ చర్యలలో స్వచ్చంద సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను కాపాడితే వారి సేవలను జీవితాంతం మరిచిపోరన్నారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు హుస్సేన్‌సాగర్ వరదల్లో చేపట్టిన సహాయక చర్యలను గుర్తుచేశారు. జలాశయాల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. నీటి విడుదలపై దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలనీ సీఎం సూచించారు. గేట్లు తనిఖీచేసి నీటిలి విడుదల చేయాలన్నారు. ఒక్క చెరువుకు కూడా గండి పడడానికి వీల్లేదన్నారు. ముందస్తు అంచనాల తయారీలో మరింత శ్రద్ధ వహించాలన్నారు. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు.
‘‘వరదల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాలి. సహాయచర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలి. పుష్కరాలు నిర్వహణ, పంటలు కాపాడటంలో చూపిన గుడ్ గవర్నెన్స్ ప్రస్తుత విపత్తులోనూ అధికారులు చూపాలి. వీలైనంతగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. జలాశయాల్లో వరదనీరు పోటెత్తడంతో నీటి విడుదలపై లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. చెరువులకు గండ్లు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను ఆదేశించారు. మరోవైపు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావుకు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోన్ చేశారు. పులిచింతలకు 2.50లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తోందని, పులించితల వరదతో రెండు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది ఉంటుందని వివరించారు. సమన్వయంతో నీటిని కాపాడుకుందామని, ఎవరికీ ఇబ్బంది లేకుండా సంయుక్తంగా పర్యవేక్షిద్దామని హరీశ్‌రావుకు ఉమా చెప్పినట్లు సమాచారం. వరదల వల్ల నల్గొండ జిల్లాకు ముంపు ఏర్పడే ప్రమాదం ఉందని, అధికారులను అప్రమత్తం చేయాలని కోరారు.
ఆటో బోల్తా: పలువురికి గాయాలు
విజయవాడ, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): విసన్నపేట మండలంలోని చంట్రుపట్ల వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విసన్నపేట ఎస్సీవాడకు చెందిన పది మంది ఆటోలో ఒక శుభకార్యం నిమిత్తం తెల్లదేవరపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతొ తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో విసన్నపేటకు చెందిన భాగ్యమ్మ, శాంతమ్మ, భారతి, ఆటో డ్రైవర్ మ్యాథ్యూస్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వీరిని నూజివీడు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సౌభాగ్యం, సరస్వతి, నాగేంద్రమ్మ, అనసూయ, సామ్రాజ్యంకు విసన్నపేట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, పురుగుల మందుతాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కంచికచెర్ల వ్యవసాయమార్కెట్ ఆవరణలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు మండలంలోని గొట్టిముక్కల గ్రామానికి చెందిన తాడెపునేని జానకిరామయ్య(25)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఇంఛార్జి ఎస్సై అవినాష్ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఇదిలావుండగా, స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రధాన పంటకాల్వలో గల్లంతైన సంఘటన అవనిగడ్డ మండలం లంకమ్మమాన్యం సమీపంలో జరిగింది. వసతిగృహంలో ఉండి చదువుకుంటున్న నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కవ్వలి పాండు(14), ముసునూరు మండలం గోపవరం నుంచి వచ్చిన బుళ్ల చంద్(13) సాయంత్రం స్థానిక లంకమ్మమాన్యం వద్ద దక్షిణ ప్రధాన పంటకాల్వలో దివి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరు స్థానిక సెవెంత్ డే ఎడ్వింటిస్టు పాఠశాలలో చదువుకుంటూ, ఆపాఠశాల వసతి గృహంలోనే ఉంటున్నారు. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఎవ్వరితో చెప్పకుండా వీరిద్దరూ మరో ముగ్గురు విద్యార్థులు గుడ్డేటి విక్కి మోహన్, విశ్వనాధపల్లి రాజేష్, వడుగు కులశేఖర్లతో కలసి లంకమ్మమాన్యం సమీపంలోని పంటకాల్వలో స్నానానికి బయలుదేరారు. మిగిలిన ముగ్గురు ఒడ్డున ఉండగా వీరు ఇద్దరూ ర్యాంపు మీదుగా దిగి కొద్దిసేపు నీటిలో ఆడుతూ, లోపలకు వెళ్లే ప్రయత్నంలో ఇద్దరూ ఒకేసారి నీటి ప్రవాహవేగానికి కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న రాజేష్ కాపాడే ప్రయత్నం చేసినా దొరకలేదని చెప్పారు. అరగంట తర్వాత జడ్పిటీసీ సభ్యుడు వెంకటేశ్వరరావు ద్వారా విషయం తెలిసిన ప్రిన్సిపల్ ఆదామ్, రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, అక్కడకు చేరుకున్నారు. తహసీల్దార్ బి.ఆశయ్య వెంటవచ్చిన విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అప్పటికే చీకటి పడిపోవడంతో వెతికే ప్రయత్నం చేయలేదు. కాల్వలో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో తగ్గించే ప్రయత్నం చేయలేదని, పిల్లలు కొట్టుకుపోకుండా ఉండటానికి కనీసం వలకట్లు కూడా ఏర్పాటుచేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఏపీలోనూ తప్పని కుండపోత
భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం
విజయవాడ, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం అర్థరాత్రి నుంచి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. పిడుగురాళ్ల వద్ద రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలుమ రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో చెరువుకి గండి పడింది. గ్రామంలోకి భారీగా వరదనీరు చేరడంతో 300 పైగా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సత్తెనపల్లికి 5కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ముప్పాళ్ల మండలంలో గురువారం వేకువజాము 3గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, భారీ వర్షంతో పాటు వాగులు పొంగి పట్టాలపైకి నీరుచేరడంతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ-పిడుగు రాళ్ల మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్ నడికుడిలో నిలిపివేశారు. పిడుగు రాళ్ల మండలం అనుపాలెం సమీపంలో మాచర్ల-భీమవరం ప్యాసింజర్ రైలును, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల-రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్‌పై వర్షపునీరు చేరడంతో రెడ్డిగూడెం వద్ద పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా సుమారు 6 గంటలపాటు కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు పట్టణంలోని బసవమ్మవాగు వద్ద నిలిచిపోయాయి. రాజపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. సత్తెనపల్లి నుంచి నరసరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రహదారులు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. సత్తెనపల్లిలో కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని నాగన్నకుంట, సుందరయ్యనగర్, వెంకటపతికాలనీ, యానాదికాలనీ, కొత్తపేట ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సత్తెనపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారుల తెలిపారు. భారీ వర్షానికి గుంటూరు జిల్లా నరసరావుపేట జలమయమైంది. సమీపంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పట్టణంలోని కత్తచెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో సత్తెనపల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బీసీ కాలనీ జలమయమైంది. గుంటూరు రోడ్డులో స్వర్గపురి వద్ద నాలుగు అగడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రహదారిపై నీటిని మళ్లించేందుకు డివైడర్లను పగులగొట్టారు. మరోవైపు ఎల్లమంద గ్రామం వద్ద ఏడుమంగళ వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగు పరీవాహక ప్రాంతమైన బుడగజంగాల కాలనీ, ఎలుకలు కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీ ల్లోకి నీరు చేరింది. కేసానిపల్లి గ్రామం వద్ద ఎస్ఆర్కేటీ కాలనీలో కూడా భారీగా వర్షపు నీరు చేరింది. రాయిపాడు, లక్ష్మీనారాయణపురంలోకి భారీగా వరద నీరు రావడంతో అనేక ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లింగంకుంట్ల గ్రామంలోని మంచినీటి చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ జలమయమైంది. సహయక చర్యల్లో భాగంగా బాధితులకు పదివేల పులిహోర ప్యాకెట్లు, 50వేల మంచినీటి ప్యాకెట్లను అందించనున్నట్లు ఆర్డీవో జి.రవీంద్ర తెలిపారు. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, డీఎస్పీ నాగేశ్వరరావు తదితరులు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దాచేపల్లి వద్ద నాగులేరులో లారీ కొట్టుకుపోయింది.


