విమానయాన హబ్‌గా ఏపీ అభివృద్ధి: ఏపీ సీఎం
- 80 Views
- wadminw
- January 5, 2017
- యువత రాష్ట్రీయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విమానయాన హబ్‌గా మారుస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం విమానయాన సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కనెక్టివిటీకి సంబంధించి త్వరలో కేంద్రం బిడ్డింగ్‌కు ఆహ్వానిస్తుందన్నారు. విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్, తిరుపతి, కడపలకు కనెక్టివిటీని పెంచాలన్నారు. విజయవాడ విమానాశ్రయంలో డిసెంబర్ నాటికి కొత్త టెర్మినల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికులకు ఆకర్షణీయ ప్యాకేజీలిస్తే టూరిజం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హెలిటూరిజంపై విమాన యాన సంస్థలు దృష్టిసారించాలని సూచించారు. ఆ సంస్థలకు అనేక రాయితీలు ఇస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎయిరిండియా, ఎయిర్ ఏసియా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, ట్రూజెట్, స్పైస్‌జెట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీని విమానయాన హబ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని, అందుకు సహకరించాలని ఎయిర్ లైన్స్ ప్రతినిధులను కోరారు.
త్వరలో కేంద్రం కనెక్టివిటీ బిడ్డింగ్‌కు ఆహ్వానిస్తుందని, ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లు సహకరించాలని చంద్రబాబు కోరారు. డిసెంబర్ నాటికి విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ఏర్పాటవుతుందని, విజయవాడ-విశాఖ, విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-తిరుపతి, విజయవాడ-కడప కనెక్టివిటీ పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. హెలిటూరిజంపై ఎయిర్ లైన్స్ దృష్టి పెట్టాలని, ఆధ్యాత్మిక నగరాలను కలుపుతూ టెంపుల్ టూరిజం, తీర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ బీచ్ టూరిజం తరహాలో వివిధ ప్యాకేజీలతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గోదావరి జిల్లాలలో వ్యవసాయ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. విమానయాన సంస్థలకు అనేక రాయితీలిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చే పలు ప్రధాన శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కె. రవీంద్ర, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నందున ఈ శాఖలన్నీ ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల మేరకు పని చేసి ఆదాయాన్ని ఆర్జీంచి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. అదే సమయంలో ప్రజలపై భారం పడకుండా చూడాలని కూడా ముఖ్యమంత్రి అన్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు తమ తమ శాఖల పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని కోరారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా ప్రధానంగా సమీక్షించారు. సుమారు 42 శాతం ఆర్థిక లోటు ఉన్నందున దీన్ని భర్తీ చేసుకునే ప్రణాళికను కూడా సిద్ధం చేయాల్సి ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మరోవైపు, విభజనతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపు వస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీ ఆదాయం పెరిగింది. గత ఆరు నెలలకు రూ. 22,800 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే గడిచిన ఆరు నెలలకు ఆదాయ వృద్ధి 13.05 శాతంగా నమోదు అయింది. ఇందులో వాణిజ్య పన్నుల ఆదాయం 12.98 శాతం వృద్ధి చెందింది. రూ. 16,593 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ శాఖలో 8.35 శాతం వృద్ధి నమోదు అయింది. మొత్తంగా రూ. 2,051 కోట్ల ఆదాయం లభించింది. స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ శాఖకు, రూ. 254 కోట్ల ఆదాయం. ఇది గతానికంటే 12.30శాతం అధికం. రవాణా శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ శాఖ ఆదాయం 22.18శాతం వృద్ధి చెందింది. మొత్తంగా రూ. 1205కోట్లు రవాణాశాఖకు ఆదాయంగా వచ్చింది. మైనింగ్ శాఖ 17శాతం వృద్ధి రేటుతో రూ. 735 కోట్లు, ల్యాండ్ అండ్ రెవెన్యూకు 13.02 వృద్ధితో రూ. 131 కోట్ల ఆధాయం లభించింది. అయితే అటవీశాఖ ఆదాయం వృద్ధి రేటు మైనస్7.45కు తగ్గింది. ఈ శాఖకు రూ. 26 కోట్ల ఆదాయమే వచ్చింది. మొత్తంగా రాబడుల విషయంతో మరింతగా శ్రద్ధ వహించాలని ఆయా శాఖల అధికారులకు చంద్రబాబు సూచించారు.
బిల్లుల కోసం బెజవాడ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు ఆందోళన
అమరావతి, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): తమ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు మంగళవారం విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. సుమారు 19 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని గత రెండు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా చెల్లించలేదని కాంట్రాక్టర్లు ఆరోపించారు. దీనితో తామంతా ఆర్థికంగా నష్టపోవమే కాకుండా కొత్త పనులను చేపట్టలేకపోతున్నామని వారు అన్నారు. పాత బకాయిలు చెల్లించే వరకు కొత్త పనులను చేపట్టబోమని వారు తేల్చి చెప్పారు. అనంతరం కాంట్రాక్టర్లు మున్సిపల్ కమిషనర్ మీరపాండన్యన్కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రెండు నెలల్లో బకాయిలను చెల్లిస్తామని, ఈలోపు సహాయ నిరాకరణను చేపట్టవద్దంటూ కమిషనర్ వారిని కోరారు. ఇదిలావుండగా, మోపిదేవి మండల కేంద్రమైన మోపిదేవికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖుడు, జిల్లా ఆర్యవైశ్య వర్తక సంఘ కమిటీ సభ్యులు, దివిసీమ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులైన రామకృష్ణారావు(76) మంగళవారం మృతిచెందారు. ఆయన మృతిపట్ల దివిసీమ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాలవర్దన్ రావు, బందర్ డీఎస్పీ హరిరాజేంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. నేత్రాలను కుటుంబసభ్యుల ఆమోదం మేరకు చల్లపల్లి లయన్స్ క్లబ్ ద్వారా శంకర్ నేత్ర వైద్యశాల వైద్యులు సేకరించారు.


