విశిష్టకథల నిలయం ‘అవసరాల’
అవసరాల రామకృష్ణారావును రచయితగా కాంటే కూడా మంచి ఆలోచనలు కలిగిన మహోన్నత వ్యక్తిగానే ఆయన సన్నిహితులు గుర్తిస్తుంటారు. దాదాపు కేవలం పదిహేనేళ్ల వయసులో చందమామ కథతో మొదలుపెట్టి 80 ఏళ్ల వయసులో చందమామ కథతోనే జీవితం ముగించిన తెలుగు విశిష్ట కథా రచయిత అవసరాల రామకృష్ణారావు. బాల్యంలో అమ్మ చెప్పిన కథనే ఊకొట్టే భాషలోకి మార్చి ఆయన పంపిన ‘పొట్టిపిచిక’ కథ తొలి చందమామ పత్రికలో 1947 జూలై సంచికలో యధాతథంగా అచ్చయి ఆయన సాహితీ ప్రస్థానానికి తొలి బీజం వేసింది.
దాదాపు అరవైనాలుగు సంవత్సరాల తర్వాత ఆయన తన చందమామ జ్ఞాపకాలను పంపుతూ ‘పొట్టిపిచిక’ కథ రూపంలో తన బాల్యంలో తొంగి చూసిన ఆ తొలి కిరణపు రూపురేఖలే తన వృద్ధాప్యంలో కూడా కొనసాగడం మించిన ఆశ్చర్యం, ఆనందం ఇంకేముందని గర్వంగా చెప్పుకున్నారు. అలాంటి కృతజ్ఞత కలిగిన తెలుగు రచయిత బహుశా మరొకరు ఉండరేమో? “ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది లేషమే ఔగాక, పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా, పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది.
అదీ ‘పొట్టి పిచిక కథ’ అదే నా విజయసూత్రం అవుతుందని ఆనాడనుకోలేదు! వెయ్యి పైగా రచనలు చేసి, ఈనాటికీ తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న నాకు వేగుచుక్క ఆ కథే కదా! పక్షులతో జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని సరళంగా చెప్పవచ్చునని నేను నేర్చుకున్నది. చందమామ పత్రిక చలవవల్లనే. ‘గణిత విశారద’ అనే నవల రాసింది చందమామ పఠన స్పూర్థితోనే. సైజుతో పాటు చురుకుతునంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ నాలో మిగిలి ఉన్నాయని నా మీద నేను వేసుకునే సోకైన జోకు!
నా తొలి ప్రేమ ‘చందమామ.’ వాక్రూప వర్ణార్ణవం ఈ నాటికీ కథాసుధల్ని వెదజల్లుతూ హాయిగా జీవించగలిగే నా మనోధృతికి నాటి ‘చందమామే’ మదురస్మృతి!” అని అవసరాల గుర్తుచేసుకున్నారు అప్పట్లో. చందమామ కథ ఇచ్చిన ఊపుతో తాను రాసిన సుప్రసిద్ధ పిల్లల రచనల్లో ‘కేటూ డూప్లికేటూ,’ ‘మేథమేట్రిక్స్,’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ,’ ‘ఆంగ్రేజీ యమ ఈజీ’ వంటి అరడజను రచనలు భాగమని కూడా ఆయన ఘనంగా చెప్పుకునేవారు. ఈ కథా పురుషుడి మాన్య ప్రశంసతో చందమామ జన్మ సార్థకమైంది.
‘ప్రపంచం ఎంతగా మారినా సరే చందమామ కథ మారకూడదు’ అంటూ ప్రపంచం నలుమూలలనుంచీ చందమామ వీరాభిమానులు ఒకే మాటగా ఉంటూ చందమామ దశను దిశను మార్చే ప్రయత్నం జరపినప్పుడల్లా ఉత్తరాలతో, ఈమెయిల్స్‌తో కొడుతున్న ఆధునిక కాలంలో కూడా ‘ఏ పత్రికకైనా సరే మార్పులు తప్పవు, కాలానుగుణంగా మార్పును అంగీకరించవలసిందే’ అంటూ స్వల్ప పరిచయంతోటే ఆత్మీయంగా ఫోన్లో నుడివిన పలుకులు మర్చిపోవడం ఎలా సాధ్యం ఆ పత్రిక నిర్వాహకులకు?
పత్రిక మనుగడకు సంబంధించి, యాజమాన్య దృష్టి కోణంలో మార్పు సహజం అంటూ సమస్యను రెండు వైపుల నుంచీ అర్థం చేసుకుంటూ ఆయన చందమామలో మార్పులను ఆమోదించిన తీరుతో బహుశా చందమామ వీరాభిమానులకు ఎవరికీ మింగుడు పడకపోవచ్చు కూడా. అవసరాల రామకృష్ణారావు చందమామ కథతో 1947లో తన సాహిత్య రచనా జీవితం మొదలెట్టారు. 65 ఏళ్లపాటు నిర్విరామంగా రచనలు చేస్తూ వచ్చారు. తను పాటించే నీతికి విరుద్ధమనిపించినప్పుడు ప్రచురణకు పంపకుండా ఎన్ని రచనలను ఆయన ఆముద్రితంగా ఉంచేశారో లెక్క తెలీదు కాని జీవిత పర్యంతం వెయ్యి రచనలపైగా చేసినట్లు ఆయనే చెప్పుకున్నారు.
ఆయన రాసిన వాటిలో ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. హైదరాబాదులో దాసరి సుబ్రహ్మణ్యం ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయన చందమామేతర సీరియల్స్ ఆవిష్కరణ సందర్భంగా సిటీసెంట్రల్ లైబ్రరీ సమావేశమందిరంలో మిత్రులను కలుసుకున్నప్పుడు అందరి ముందూ ఒక మెరుపు మెరిసినట్లయింది. చాలా మంది చందమామ అభిమానులు, వీరాభిమానులు, చందమామ రచయితలు, పాఠకులు ఒక చోట చేరిన ఆ అరుదైన సన్నివేశంలో ఆయన 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంత చలాకీగా కనిపించారో?
సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయని ఈయన తనమీద తను సోకైన జోక్ వేసుకుంటారట. అది అక్షరాలా నిజం. ఆయన రూపాన్ని చూసినా, ఫోన్లో మాట్లాడినా గలగలగలమనే పిచ్చిక కువకువలనే తలపించే మూర్తిమత్వం. అవసరాల కథానికలలో చక్కటి వ్యంగ్యం తొంగిచూస్తుం టుంది. అందుకు పిలుపు ఎప్పుడొస్తుందో కూడా ఓ చక్కటి ఉదాహరణ. నేడు (డిసెంబర్ 21న) ఆయన జయంతి సందర్భంగా నివాళి.


