వెంటాడుతున్న రక్తహీనత!
పాపం పసివాళ్లు! 80 శాతం మంది చిన్నారుల్లో రక్తహీనత ప్రాణాలు తోడేస్తున్న ‘సికిల్ సెల్ అనీమియా’! మన్యంలో, మైదానంలో మోగుతున్న మృత్యు ఘంటికలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉత్తరాంధ్ర మన్యానికే కేంద్ర బిందువుగా విరాజిల్లే పాడేరులోని పాత పాడేరు ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు భవానీ, సింహాచలం ఇద్దరూ రక్తహీనతతో బాధపడుతూ ఆ మధ్య మృతిచెందారు. పదో తరగతి చదువుతున్న శరణ్య గత మూడేళ్లుగా సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతోంది. ఈమెకు ప్రతి ఆరు నెలలకోసారి రక్తం మారుస్తున్నారు.
పాడేరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఈమె పరిస్థితి దయనీయంగా ఉంది. మన్యంలో ఏటా 0-12 నెలల లోపు చిన్నారులు 33.38 శాతం మంది శిశువులు మృతి చెందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు మన్యంలో 414 మంది శిశువులు చనిపోతే గత ఐదేళ్లలో 1,669 మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో సికిల్‌సెల్ అనీమియాతో 62 మంది బాధపడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. గత నెల రోజుల వ్యవధిలో రక్తహీనత, ఇతర రుగ్మతలతో పది మంది విద్యార్థులు మృతిచెందారు.
హుకుంపేట మండలం మజ్జివలసలో ఆరోతరగతి చదువుతున్న శంకరరావు (11) ఒక్కసారిగా రక్తం కక్కుకని చనిపోతే పెదబయలు మండలం తురకలవలస ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మణికుమారి, గోమంగి మినీ గురుకులంలో ఒకటో తరగతి చదువుతున్న భావాని, సూకూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ప్రవీణ్ కుమార్, ఉప్ప ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రాధ, జోలాపుట్టు ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న పోతురాజు అనారోగ్యంతోనే మృతిచెందారు.
ఎంపీపీ, ఇతర యాజమాన్యాల విద్యాలయాల్లో చదువుతున్న మరో నలుగురు విద్యార్థులూ మృత్యువాతపడ్డారు. కొయ్యూరు మండలం పెదమాకవరం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న డొంకాడ రాములమ్మ రక్తహీనతతో బాధపడుతూ గతేడాది మృతి చెందింది. ఇదే పాఠశాలకు చెందిన వనగల లక్ష్మికి ఇటీవల రెండుసార్లు రక్తం ఎక్కించారు. తినడానికి తిండి లేదు. కడుపు నిండా తిండిపెట్టే స్థోమత తల్లిదండ్రులకు లేదు.
రూ. కోట్లు కుమ్మరించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నా ఆ ఫలాలు చిన్నారులకు చేరడం లేదు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనానికీ భారీ బడ్జెట్ కేటాయిస్తున్నా ఈ ప్రక్రియా సవ్యంగా సాగడంలేదు. జిల్లాలో అధిక శాతం చిన్నారుల్లో రక్తహీనతకు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. సంస్కరణలు తెరపైకి తెస్తున్నా క్షేత్రంలో పర్యవేక్షణల లోపం అక్రమాలకు వూతమిస్తోంది. పరిస్థితిని గతి తప్పేలా చేస్తోంది. ఈ క్రమంలో రక్తపిశాచి నిండు ప్రాణాలను పీల్చి పిప్పిచేస్తోంది.
బాల్యానికి గ్రహణం మన్యంలో రక్తహీనతకు తోడు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు సకాలంలో అందకపోవడంతో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్నారు. సికిల్‌సెల్ అనీమియాతో మన్యంలో పదుల సంఖ్యలో బాధపడుతున్నారు. ఇటీవల ఐటీడీఏ, వైద్యారోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మన్యంలో 74,721 మంది చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేలింది. హిమోగ్లోబిన్ పరీక్షల్లో 7,654 మంది విద్యార్థుల్లో రక్తహీనత అధికంగా ఉన్నట్లు తేలింది.
వీరందరినీ రెడ్ కార్డు కేటగిరీలో చేర్చారు. 34,706 మంది చిన్నారుల్లో రక్తహీనత మధ్యస్థంగా ఉన్నట్లు నిర్ణయించి పసుపు కార్డు కేటగిరిలో ఉంచారు. 29,401 మందిలో రక్తహీనత సాధారణ స్థితిలో ఉన్నట్లు గుర్తించి పచ్చ కార్డును కేటగిరీగా నిర్ణయించారు. జి.మాడుగుల మండలంలో విద్యార్థుల రక్తహీనత పరీక్షల ప్రకియ నామమాత్రంగా జరిగింది. మండలంలోని 191 పాఠశాలలో 6,027 మంది విద్యార్థులుంటే 5,476 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు. పెదబయలు మండలంలో సరైన పౌష్ఠికాహారం అందక రక్తహీనతతో బాధపడుతున్న పిల్లకు 50 శాతం వరకు ఉన్నారు.
పెదబయలు పీహెచ్సీ పరిధిలోని 99 పాఠశాలలుంటే కేవలం 34 పాఠశాలల్లోని 3,200 మందికి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి 915 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేల్చారు. కొయ్యూరు మండలంలోని రావణాపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుర్ల చంటి, సరివెల్లి రాణిలకు హెచ్‌బీ శాతం తక్కువగా ఉండటంతో ఈనెల 2న విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించి అక్కడ రక్తం ఎక్కించారు. 436 మంది విద్యార్థినుల్లో 18 మందికి హెచ్‌బీ పరీక్షలు చేయాల్సి ఉంది. 123 మందికి ఆరోగ్య కార్డులు జారీ చెయ్యాల్సి ఉంది.
ఇక, మైదాన ప్రాంతమైన అనకాపల్లిలోని జీవీఎంసీ బాలికోన్నత పాఠశాలలోని 25 మంది విద్యార్థులకు తాజాగా రక్త పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ డీఎండీహెచ్వో డాక్టర్ శేషుబాబు, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ స్వాతి, ఐడీసీడీఎస్ సీడీపీవో రత్నకుమారి, ఎన్టీఆర్ వైద్యాలయం ఆసుపత్రి రక్తపరీక్ష నిపుణులు శంకర్రావుల ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్తపరీక్షలు జరిపి హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించారు. అనకాపల్లిలోని బాలికోన్నత పాఠశాలలో 25 మంది విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే ఎవరికీ సరైన మోతాదులో హిమోగ్లోబిన్ శాతం లేనట్లు తేలింది. బాలికలకు సాధారణంగా హిమోగ్లోబిన్ శాతం 11.6 నుంచి 16 గ్రాముల ఉండాలి.
బాలురకు 12 నుంచి 18 గ్రాముల వరకూ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఉండాలి. కానీ 10 శాతంలోపే హెచ్‌బీ శాతం ఉంది. ఇద్దరు విద్యార్థినులకు 8 గ్రాములు ఉన్నట్లు పరీక్షలో తేలింది. కశింకోటలోని బాల సదనంలో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్, ఐసీడీఎస్సీడీపీవో కుమారి పర్యవేక్షణలో కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బి.రాజశేఖర్ ఆధ్వర్యంలో హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించారు. వీరిలో 11 మంది విద్యార్థినుల్లో రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఏడు గ్రాముల కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నవారికి ప్రత్యేక పౌష్ఠికాహారంతోపాటు, ఐరన్ మాత్రలు రెండుపూటలా ఇవ్వాలని వైద్యాధికారి సూచించారు.


