వెదురు కషాయంతో చీడపీడలు దూరం
తిరుపతి, సెప్టెంబర్ 4 (న్యూస్‌టైమ్): వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి, చీడపీడల నుంచి కాపాడుకోవడానికి వెదురు కషాయం ఎంతో ఉపయోగపడుతుందని వ్యవసాయ సహాయ సంచాలకులు శివకుమార్ తెలిపారు. పుంగనూరు వ్యవసాయ కార్యాలయంలో ఆయన రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. లేత వెదురు మోసులను రుబ్బి అందులో బెల్లం పాకం, నిమ్మకాయ రసం, ఆవు మూత్రం కలిపి మూడు గంటలకుపైగా ఉడికించి, చల్లార్చి వడిగట్టిన కషాయాన్ని పైర్లపై పిచికారి చేస్తే తెగుళ్లు నశించడమే కాకుండా నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ ఏడీ సుబ్బమ్మ, ఏఓలు గీతాకుమారి, జ్యోతమ్మ, పరమేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చిత్తూరు జిల్లా సోమల సీడీపీఓ హస్మబీ పేర్కొన్నారు. మండల పరిధి కందూరు అంగన్వాడీ కేంద్రంలో గురువారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఆరోగ్య ప్రేరణాధికారి రఫీ కూరగాయలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించారు. ఏయే పదార్థాల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో అవగాహన కల్పించారు కార్యక్రమంలో వైద్యసిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగా, బోయకొండ గంగమ్మ ఆలయ ఛైర్మన్ పదవి బీసీలకే కేటాయించాలని బీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్రనాథ్ డిమాండు చేశారు. కొండ ముఖద్వారం వద్ద ఆయన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆలయంలో అవినీతికి అంతులేకుండా పోయిందని, అమ్మవారి మహిమలను నలుమూలలా చాటి చెప్పాల్సిన పాలవర్గ సభ్యులు, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అవినీతిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండు చేరారు. ఆలయానికి మొదటిసారి బీసీ నాయకుడు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అమ్మవారి ప్రతిష్టను పెంచారని గుర్తుచేశారు.
అనంతరం బీసీలందరూ కలిసి ర్యాలీ నిర్వహించారు. బీసీ నాయకులు కాగతి గంగరాజు, పులిచెర్ల, సదుం, పుంగనూరు, రొంపిచెర్ల మండలాల బీసీ అధ్యక్షులు నారాయణస్వామి, ఎస్వీ రమణ, కృష్ణయ్య, చాంద్‌బాష, జేవీ నాగరాజు తదిరులు పాల్గొన్నారు. మరోవైపు, యువత సామాజిక సేవకు నడుంబిగించాలని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంసీ వెంకట్రామ అన్నారు. మండలంలోని చదళ్ల గ్రామంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత సమాజ సేవను జీవితంలో ఒక భాగంగా ఎంచుకోవాలన్నారు.
ప్రధానోపాధ్యాయురాలు సరస్వతమ్మ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను విద్యార్థులు దత్తత తీసుకుని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కోరారు. సర్పంచి చంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తమ గ్రామంలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ్య పనులు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త మలిగి రాఘవరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


