వైకాపా సభ్యుల తీరు అభ్యంతరకరం: సీఎం
- 92 Views
- wadminw
- September 9, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): గత రెండు రోజులుగా అసెంబ్లీ జరిగిన తీరు గర్హనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సభాపతి పట్ల అగౌరవంగా ప్రవర్తించడం సరికాదని, విభజన సమయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో వైకాపా తీరు అభ్యంతకరమని, ఉన్మాద చర్యలకు పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో రెండో రోజు శుక్రవారం చంద్రబాబు మాట్లాడుతూ విభజన బిల్లు ఆమోదించినప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఏం చేశారని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైకాపా సభ్యులు సమయానుసారం రాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు.
అసెంబ్లీ సమయం వ్యక్తుల కారణంగా మారదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్ మైక్ ఇవ్వకపోయినా సంయమనంగా ఉన్నామని గుర్తు చేశారు. సాయం ఏ రూపంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్యాకేజీ బాగుందని, ఇదే అంతిమం కాదని తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రంతో సంత్సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి ప్రయోజనం అని చెప్పారు.
బంద్ విజయవంతం కోసం వైసీపీ సభను అడ్డుకుంటోందని విమర్శించారు. సభ సజావుగా సాగితేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని వైసీపీ గ్రహించాలని యనమల హితవు పలికారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షమైన వైకాపా సభ్యుల దాడి ఘటనపై సభాహక్కుల సంఘం శుక్రవారం స్పీకర్ కార్యాలయంలో సమావేశమైంది. సభలో వైకాపా సభ్యులు ప్రవర్తించిన తీరుపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైన తర్వాత ఉదయం స్పీకర్ పోడియంపై దాడిచేసిన వైకాపా సభ్యులు మైక్‌ను లాగేసి బీభత్సం సృష్టించారు. కాగితపు ప్రతులను స్పీకర్‌పై విసిరేశారు. మైక్ వైరును అసెంబ్లీ కార్యదర్శి మెడకు చుట్టేందుకు ప్రయత్నించారని తెదేపా సభ్యులు ఆరోపించారు.
తీవ్ర ఉద్రిక్తత మధ్య అసెంబ్లీ వాయిదా పడిన విషయం తెలిసిందే. మరోవైపు, రాష్ట్ర ప్రయోజనాలపై వైకాపాకు చిత్తశుద్ధి లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సభాపతిపై వైకాపా సభ్యులు వ్యవహరించిన తీరు అవమానకరమన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు శాసనసభను ఉపయోగించుకోకుండా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. ఉన్మాదులుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర సాయంపై సభలో చర్చిద్దామని ఎంత చెప్పినా వినట్లేదన్నారు. వైకాపా సభ్యులు అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారని ఆరోపించారు. ‘హోదా ఇవ్వలేదని కేంద్రాన్ని మేం అభినందించలేదు. కేంద్రం చేస్తున్న సాయంపైనే అభినందనలు తెలుపుతున్నాం’ అని స్పష్టం చేశారు.
మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు అవమానకరమన్నారు. ‘‘అవినీతి కేసులు వెంటాడుతున్నాయని జగన్‌కు భయం పట్టుకుంది. ఢిల్లీ వెళ్లి మాట్లాడే ధైర్యం లేక సభలో గందరగోళం సృష్టిస్తున్నారు’’ అని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులు తెచ్చుకునే సత్తా తెదేపాకు ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైకాపా సభ్యుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టిన వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. కాగితాలు చింపి స్పీకర్‌పై విసిరారు. టేబుల్‌పై ఉన్న స్పీకర్ మైక్‌ను తొలగించారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన మార్షల్స్‌ను నెట్టివేయడంతో తీవ్ర పెనుగులాట చోటు చేసుకుంది. దృశ్యాలు చిత్రీకరిస్తున్న కెమెరాను తొలగించేందుకు ప్రయత్నించారు. బల్లలపై నిల్చుని నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్ సభను తొలుత 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన సభలో వైకాపా సభ్యుల ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. వాయిదాల పర్వం కొనసాగినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే రెండో రోజు కూడా శాసనసభ వాయిదాపడింది. ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టిన వైకాపా సభ్యులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. అంతకముందు ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచే వైకాపా సభ్యులు దూకుడు పెంచారు.
ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాల్సిందేనంటూ ఆపార్టీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చిద్దామని సూచించారు. ముందు చర్చ ఆతర్వాత సీఎం ప్రకటన చేయాలని వైకాపా సభ్యులు పట్టుబట్టారు. దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ప్రత్యేక హోదాపై చర్చను కోరుతూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైకాపా సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మార్షల్స్, వైకాపా సభ్యులకు మధ్య తోపులాట జరిగింది.
పెనుగులాటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కిందపడిపోయారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని, మార్షల్స్‌పై చేయి చేసుకోవద్దని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఉద్రిక్తంగా మారడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు. వైకాపా సభ్యుల తీరును మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. పరిస్థితి మార్షల్స్ చేతులు కూడా దాటిపోయిన సమయంలో వైకాపా సభ్యుల వ్యవహరించిన తీరుపై సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘సభలో దౌర్జన్యం చేయడం మంచి పద్దతి కాదు. మార్షల్స్, స్పీకర్ స్థానంపై దాడి చేయడం సబబు కాదు. స్పీకర్ స్థానాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. సభా మర్యాదలకు భంగం కలిగించడమేనా సభ్యతా? శాసనసభ గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. వైకాపా సభ్యుల ఆందోళన మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం నాటికి వాయిదా పడింది. అప్పటికే రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో వైకాపా సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సభాపతి కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


