వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
- 93 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 6 (న్యూస్టైమ్): సీపీఎం బహిరంగ సభను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా సభకు మద్దతు తెలిపారన్న కారణాలతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పలువురు సీపీఎం నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దివీస్ భూసేకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ బహిరంగసభకు వైఎస్ఆర్సీపీ, సీపీఐ, కొన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బహిరంగసభను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం పంపాదిపేట, తాటాకుపాలెం, కొత్తపాకుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది.
రైతులు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించారని సర్కారు చెబుతున్నా అందులో వాస్తవం లేదని, రైతులు ఈ భూసేకరణపై అయిష్టత చూపుతున్నారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పంపాజిపేట గ్రామం వద్ద నిర్మిస్తున్న దివీస్ ల్యాబొరేటరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు వెళుతున్న వామపక్షాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం బహిరంగసభకు వెళుతుండగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి. మధు, జిల్లా నేతలు, కార్యకర్తలను కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద పోలీసులు అరెస్టుచేసి అన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. తుని ఎమ్మెల్యే రాజా కూడా బహిరంగసభకు వెళుతున్నారని భావించిన వారు ఆయన కారును అడ్డుకున్నారు. అయితే తాను హైదరాబాద్ వెళుతున్నానని రాజా చెప్పడంతో రాజమండ్రి వరకూ పోలీసులు ఎస్కార్ట్గా వెళ్లి వదిలివచ్చారు. మొత్తానికి, దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించేందుకు సన్నద్ధం కాగా దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు సభకు హాజరైన వారిని అరెస్టు చేశారు. కాసేపటి తర్వాత మరికొంత మంది గ్రామస్థులు భారీగా రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వీరిని చెదరగొట్టి వీరిలో కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.


