వైఎస్ మరణంతో ఆగిన ప్రాజెక్టు: కొణతాల
విజయనగరం, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): దివంగతనేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపన చేశారనీ, ఆయన మరణంతో ఆ పనులు నిలిచిపోయాయని మాజీ మంత్రి కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని తోటపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు నిర్వాహణను ఆయన ఉత్తరాంధ్ర జలసాధన సమితి సభ్యులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత నేత నాడే రూ.50కోట్లు మంజూరుచేయడంతో పాటు పనుల పర్యవేక్షణకు విశాఖలో చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటుచేశారని చెప్పారు.
తరువాత వచ్చిన పాలకులు ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించారన్నారు. టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దీనిని పూర్తిచేస్తామని పేర్కొన్నా నేడు పట్టించుకోలేదని విమర్శించారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులను పరిశీలించి, రైతులనుండి సంతకాల సేకరణ చేపట్టిన అనంతరం విశాఖపట్నంలో రైతులు, మేధావులతో సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.
విశాఖలో రైల్వే జోన్ కోరుతూ లోక్‌సత్తా ధర్నా
విజయనగరం, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): విశాఖ రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సత్తా జిల్లా శాఖ శుక్రవారం ఆందోళనకు దిగింది. స్థానిక రైల్వేస్టేషన్ ఎదుట కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు. గతంలో ప్రకటించిన విధంగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు రైల్వేమంత్రి సురేష్‌ప్రభు తక్షణమే ప్రకటన చేయాలని వీరు డిమాండ్ చేశారు. ధర్నా శిబిరంలో లోక్‌సత్తా నేత భీశెట్టి అప్పారావు బాబ్జీ మాట్లాడుతూ తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. శిబిరం వద్ద రైల్వే పోలీసులు మొహరించారు. విశాఖకు రైల్వేజోన్ ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని శంగవరపుకోట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నెక్కల నాయుడుబాబు డిమాండ్ చేశారు. ఎస్ కోట మండల పార్టీకార్యాలయం నుంచి రైల్వేస్టేషన్వరకు పార్టీకార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి పీడబ్ల్యూడీ రైల్వే కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం స్టేషన్మాష్టర్ ఎం.సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాయుడుబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్కహామీనీ అమలు చేయడంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ విఫలమయ్యారని విమర్శించారు. ఓటుకుకోట్లు కేసుకు భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుచేయాలని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని తమనాయకుడు జగన్మోహన్రెడ్డి మొదటినుంచి పోరాటాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజాప్రతినిధులలో చైతన్యానికి సత్తెనపల్లికి బృందం
విజయనగరం, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓడిఎఫ్ గ్రామాల పరిశీలనకు ప్రజాప్రతినిధులను జిల్లా యంత్రాంగం పంపిస్తుంది. ఇందుకోసం ఈ నెల 10న జిల్లా పరిషత్ నుంచి బస్సు బయలుదేరుతుంది. ప్రజాప్రతినిధులలో అవగాహన పెంపొందించేందుకు గాను జిల్లా యంత్రాంగం ఈ ఏర్పాట్లు చేసింది. తద్వారానైనా జిల్లాలో మరుగుదొడ్లు నిర్మాణాలు వేగవంతం అవుతాయన్నది భావన. ఇందులో భాగంగా జిల్లాలోని గుర్ల మండలం జమ్ముపేట, దేవునికణపాక, బలిజిపేట మండలం పనుకువలస, భోగాపురం మండల రావాడ, లింగాలవలస, చీపురుపల్లి మండలం ఇటకర్నపల్లి, కర్లాం, గొల్లపపాలపెం, డెంకాడ మండలం డి.కొల్లాం, గొలగాం, పినతాడివలస, గరివిడి మండలం కోనూరు, శివరాం, గురుగుబిల్లి మండలం గొట్టివలస, జియ్యమ్మవలస మండలం బి.జె.పురం, కొమరాడ మండలం దేవుకొండ, మెరకముడిదాం మండలం చెల్లాపురం, కురుపాం మండలం ఆర్కె భాయి, నెల్లిమర్ల మండలం పూతికపేట, కొండవెలగాడ, కొత్తపేట, పార్వతీపురం మండలం కవితభద్ర, పూసపాటిరేగ మండలం నడిపిల్లి, సీతానగరం మండలం రామవరం, బక్కుపేట, విజయనగరం మండలం కోరుకొండపాలెం, పినవేమలి గ్రామాల సర్పంచులకు వర్తమానాలు పంపారు. చీపురుపల్లి గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఇ వెంకటరావుతో పాటు జె.ఇ రమేష్, బాడంగి, రామభద్రాపురం, జియ్యమ్మవలస, ఎల్.కోట, భోగాపురం ఆర్‌డబ్ల్యుఎస్ జెఇలను, గుర్ల, విజయనగరం, బలిజిపేట, గరుగుబిల్లి, నెల్లిమర్ల, ఎంపిడివోలను తీసుకువెళ్లనున్నారు. దీని ద్వారానైనా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ఊపందుకొంటాయని ఆశిస్తున్నారు.


