వైట్‌హౌస్ కీలక పదవుల్లో ప్రవాస భారతీయుల పాగా!
- 86 Views
- wadminw
- January 15, 2017
- అంతర్జాతీయం
వాషింగ్టన్: అమెరికా పరిపాలనా కేంద్రమైన శ్వేతసౌథంలోని అనేక కీలక పదవుల్లో భారతీయులు పాగా వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష కార్యాలయంలో ఈ యేడాది ఏకంగా 50 మంది ఇండో – అమెరికన్లు వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో డజనుకు పైగా అధికారులు కీలక పదవుల్లో కొనసాగుతుండటం గమనార్హం. ప్రపంచంలోనే అత్యున్నత భవనంగా వైట్‌హౌస్‌ను పేర్కొంటారు. అగ్రరాజ్యానికి సంబంధించి పూర్తి పాలనా కార్యక్రమాలన్నీ ఇక్కడ నుంచి కొనసాగుతాయి.
కిందిస్థాయి స్వీపర్ నుంచి మొదలుకొని అధ్యక్షుడి వరకూ వేలాది మంది ఉద్యోగులు ఈ భవనం నుంచే దేశ పాలనా వ్యవహారాలను నిర్వహిస్తారు. వైట్‌హౌస్‌లో ఉద్యోగం చేస్తున్నారంటే అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా భావిస్తారు. అలాంటి వైట్‌హౌస్‌లో భారతీయుల హవా కొనసాగుతోంది. అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య 30 లక్షలు. అయినా వైట్‌హౌస్‌లోని కీలక విభాగాల్లో భారతీయులకు గతంలో ప్రాధాన్యత లభించేది కాదు. ఈ ఏడాది పరిస్థితి మారింది. ప్రవాస భారతీయులు వైట్‌హౌస్‌లో రికార్డు స్థాయిలో స్థానం సంపాదించారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భారతీయులపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని కొందరంటుండగా, ప్రవాస భారతీయుల ప్రతిభను ఈనాటికైనా అమెరికన్ అధికారులు గుర్తించారని మరికొందరు అంటున్నారు. ఓ జాతీయ వార్తా సంస్థ సేకరించిన జాబితా ప్రకారం వైట్‌హౌస్‌లో రికార్డు స్థాయిలో ప్రవాస భారతీయులు 50 మందికి పైగా ఉన్నారు. వైట్‌హౌస్ ప్రధాన బాధ్యతల్లో ఐదుగురు ప్రవాస భారతీయులను సెనేట్ నియమించింది. మొత్తం మీద డజనుకు పైగా ఇండో-అమెరికన్లు వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంది.


