వ్యవసాయ పంటలపై సర్వే ప్రారంభం
- 82 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
కర్నూలు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): పంటనష్టంపై అధికారులు మంగళవారం నుండి సర్వే ప్రారంభించారు. పంట నష్టం జరిగిన రైతులు సంబంధిత అధికారులతో సర్వే చేయించుకోవాలని రైతులకు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ సూచించారు. వ్యవసాయ శాఖ అధికారి, నీటి పారుదల అధికారులు బృందంగా ఏర్పడి ఆయా గ్రామాల్లో పంట నష్టంపై సర్వేలు ప్రారంభించారు. బూడిదపాడు, నాగులాపురం, పెంచికలపాడు గ్రామాల్లో సర్వే ప్రారంభమైంది. 26న గుడిపాడు, కానాపురం, మునుగాల, మల్లాపురం గ్రామాల్లో, 27న జూలకల్లు, చనుగొండ్ల, వైపురం, పొనకల్లు గ్రామాలను అధికారులు సందర్శించి సర్వే చేస్తారన్నారు. 28న గూడూరు, తదితర గ్రామాలను సందర్శిస్తారన్నారు.
మరోవైపు, రైతులను దళారుల బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వమే ముందుకొచ్చి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఖరీఫ్‌లో పండిన పెసలు, మినుములను కొనేందుకు మార్కెఫెడ్ ఆధ్వర్యంలో భారత ఆహార సంస్థ రంగంలోకి దిగింది. జిల్లాలో ఐదు కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించారు. పగిడ్యాల, నంద్యాల, శిరువెళ్ల మండలం రాజనగరం, ఆళ్లగడ్డ, బనగానపల్లిల్లో ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపుగా 13 వేల హెక్టార్లలో మినుములు, 3వేల హెక్టార్లలో పెసర పంటలను సాగు చేశారు.
మినుములు ఎకరాకు 4 క్వింటాళ్లు, పెసర పంట అదే స్థాయిలో దిగుబడి వచ్చింది. వీటి సాగుకు రైతులు ఎకరాకు రూ.10 నుంచి 12 వేల వరకు ఖర్చు చేశారు. దిగుబడి ఫర్వాలేదనే స్థాయిలో ఉన్నా దళారులు రంగ ప్రవేశం చేసి రైతులకు మంచి ధర అందకుండా చేశారు. గతంలో రూ.7వేలు పలికిన పెసలు నేడు రూ.4,500 వద్దే ఆగింది. మినుములు రూ.9వేలు ఉండగా తర్వాత రూ.6,800 నుంచి 7000 మధ్య నిలిచింది. దీంతో అన్నదాతల కష్టం దళారుల పాలైంది. వీరి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పెసలకు మద్దతు ధర రూ.5,225 నిర్ణయించగా, మినుములకు ఆన్లైన్ ధర ప్రకారం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది.
సోమవారం రూ.7,458 పలికింది. ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో జరిగే ఈ కొనుగోళ్లలో ధాన్యం నాణ్యత బాగుంటేనే పైన పేర్కొన్న ధరకు కొనుగోళ్లు ఉంటాయి. నాణ్యత బాగాలేదన్న సాకుతో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వెనుకంజవేసిన ఘటనలు గతంలోనూ రైతులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ ఒక్కో కొనుగోలు కేంద్రం పరిధిలో ఇద్దరు నిపుణులను నియమిస్తున్నారు. వీరు ధాన్యాన్ని పరిశీలించి నాణ్యత బాగుందని ధ్రువీకరించినప్పుడే కొనుగోలు చేస్తారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డట్లుగా ప్రభుత్వం కొనుగోలుకు చర్యలు తీసుకున్నా నిబంధనల పేరిట తమకు మంచి ధర అందకుండా పోతుందోమోనని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను రైతు బ్యాంకు ఖాతాలో వేయనున్నారు. ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతుందనే ఆందోళనా ఉంది.
రాజీనామాకు సిద్ధం: ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): ప్రత్యేకహోదా సాధించే వరకు తాము పోరాడుతామని కర్నూలు ఎంపి బుట్టా రేణుక అన్నారు. ప్రత్యేకహోదా సాధించుకునే దిశలో తాము ఎంపి పదవికి రాజీనామా చేస్తామన్నారు. మంగళవారం యువభేరీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీ రాజకీయప్రయోజనాల కోసం పాకులాడుతోందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రత్యేకహోదా సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ చూపిన బాటలో నడుస్తామని ఆమె హామీయిచ్చారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గుత్తిరోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన యువభేరిలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం యావత్తు ప్రత్యేక హోదా కోరుకుంటుంటే అధికార పార్టీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం అన్ని రకాలు అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఈ విషయంలో జగనన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పాటించడానికి సిద్దంగా ఉన్నాం. అవసరమైతే రాజీనామా వల్ల ప్రత్యేక హోదా వస్తుందని విశ్వసిస్తే, మీ భవిష్యత్ కోసం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బుట్టా రేణుక అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 880 అడుగులు
కర్నూలు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): శ్రీశైలం జలాశయం నీటిమట్టం 880 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిసామర్ధ్యం 188.1360 టిఎంసిల నమోదైంది. ఎగువ ఉన్న జూరాల, తుంగభద్ర నుంచి నీటి ప్రవాహం లేదు. జలవిద్యుత్ కేంద్రాల నుండి విద్యుత్ ఉత్పాదన లేకపోవడంతో దిగువన ఉన్న నాగుర్జునసాగర్కు నీరు విడుదల కావడం లేదు. జలాశయం వెనకభాగం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 6600 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీ నావాకు 2700 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
పోలీసుల వేధింపుల వల్ల రైతు ఆత్మహత్యాయత్నం
కర్నూలు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): పోలీసులు, దేవాదాయ శాఖ అధికారుల తీరుతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. కర్నూలు జిల్లా హళహర్వి మండలం పుర్లెహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంభులింగం వ్యవసాయదారుడు. ఈయన ఏళ్లుగా కొంత భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే, ఆ భూమి దేవాదాయ శాఖకు చెందినదంటూ అధికారులు నోటీసులు పంపారు. దీంతోపాటు పోలీసులు కూడా ప్రభుత్వ భూమిలో సాగు చేయరాదంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన శంభులింగం మంగళవారం తెల్లవారు జామున ఇంట్లోనే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే ఆలూరు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అయితే అధికార యంత్రాంగం ఒత్తిళ్ల వెనుక టీడీపీ నేతలు ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు ఆనుమానిస్తున్నారు.


