శేషాచలం కొండల్లో మళ్లీ అగ్ని ప్రమాదం
- 75 Views
- wadminw
- October 26, 2016
- రాష్ట్రీయం
చిత్తూరు, అక్టోబర్ 26 (న్యూస్టైమ్): శేషాచలం అటవీ ప్రాంతంలో మళ్లీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. గోగర్భం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసి పడ్డాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.
తిరుమల అతిథిగృహంలో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు, అక్టోబర్ 26 (న్యూస్టైమ్): తిరుమల సప్తగిరి అతిథిగృహంలోని 23వ నెంబర్ గదిలో మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చు. బుధవారం అతిథి గృహ సిబ్బంది గమనించడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయాన్ని సిబ్బంది పోలీసులకు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలావుండగా, 50యేళ్ల వయసున్న ఓ మహిళపై, 35 యేళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకొంది. ఉదయం పొలంలోకి వెళ్తున్న మహిళను అదే గ్రామానికి చెందిన బోయ నగేష్(35) అడ్డగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పొలంలోకి వెళ్లే రోడ్డులో ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు పేర్కొంది. సంఘటన జరిగిన వెంటనే ఆమె గ్రామంలోకి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలుపగా బంధువులతో కలసి వారు గుమ్మఘట్ట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎస్.ఐ. హైదర్వలీ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగేష్ ఇంతకుముందే కొన్ని కేసుల్లో నిందుతుడని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆరునెలల క్రితం నాటుతుపాకీతో అడవిలో సంచరిస్తుండగా అతనిపై కేసు నమోదు చేశారు.
నేడు కోదండరామస్వామి ఆలయంలో
కోయిల్ ఆళ్వార్
చిత్తూరు, అక్టోబర్ 26 (న్యూస్టైమ్): తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో అక్టోబరు 30వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
మరోవైపు, శ్రీకోదండరామాలయంలో అక్టోబరు 30వ తేదీ ఆదివారం అమావాస్య, దీపావళి సందర్భంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆస్థానం నిర్వహించనున్నారు. అమావాస్య సందర్భంగా ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా జరగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.
దీపావళి సందర్భంగా అక్టోబరు 30వ తేదీ రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే హనుమంత వాహనసేవను తితిదే రద్దు చేసింది.


