శ్రీకాకుళం సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): శ్రీకాకుళం నగరంలో గల 36 వార్డుల్లో పూర్తిస్థాయిలో సీసీ, తారు రహదారులు, కాలువలు వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర ప్రణాళిక తయారు చేసి నివేదిక అందిస్తే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని నగర పాలక సంస్థ అధికారులను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోగా ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, వాటి ప్రగతి, రానున్న రోజుల్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై నగర పాలక సంస్థ, మెప్మా, హౌసింగ్, వుడా అధికారులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరిటాల సునీతతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వార్డుల్లో ఏ ఒక్కచోట రహదారులు, కాలువలు లేవని ప్రజల నుంచి ఫిర్యాదులు రానివిధంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. నగరపాలక సంస్థ ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డుల్లో అవసరమైన చోట కొత్తగా విద్యుత్తు స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆరుబయట మలవిసర్జన జరిగే ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించి నీటి సౌకర్యం కల్పించి నిర్వాహణ సక్రమంగా చేపట్టేలా చూడాలన్నారు. ఆయా ప్రాంతాల్లో దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో ప్రతి కుటుంబానికి వ్యక్తిగత కుళాయిలు మంజూరు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, అందుకు సంబంధించి అవసరమైన పనులు చేపట్టాలని ఆదేశించారు. మెప్మా ద్వారా స్వయంశక్తి సంఘాల మహిళకు అందిస్తున్న రుణాలు, ప్రభుత్వ సాయం ప్రజలకు తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి అందించేలా చూడాలన్నారు.
పాలకొల్లు మాదిరిగా ప్రజల భాగస్వామ్యంతో కాలనీల్లో ఒకే విధానంలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుని వాటిపై నిర్వాహకుల పేర్లు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.ఎ.శోభను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో వివిధ నిధులతో చేపడుతున్న పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. టెండర్లు పూర్తయిన, పరిపాలనా ఆమోదం పొందిన పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజూ వ్యాహ్యాళికి వెళ్లే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల రహదారిలో ప్రతి రోజూ ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలుపుదల చేయాలని ఎస్పీ జె.బ్రహ్మారెడ్డిని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి, ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్ పి.ఎ.శోభ, తదితరులు పాల్గొన్నారు.
వాహనాల నిశిత పరిశీలన: టీడీసీ శ్రీదేవి
శ్రీకాకుళం, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): వాహనాల నిశిత పరిశీలన ద్వారా అక్రమాలను అడ్డుకోవచ్చని రవాణా శాఖ ఉప కమిషనర్ సీహెచ్.శ్రీదేవి అన్నారు. జిల్లా రవాణాశాఖ లక్ష్యం రూ. 89 కోట్లు కాగా ఇందులో ఇచ్ఛాపురం వాటానే రూ. 38 కోట్లు అయితే ఇప్పటి వరకూ రూ. 35 కోట్లు చేరారు. మిగిలిన లక్ష్యాన్ని సత్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఇచ్ఛాపురంలోని మోటర్ వెహికల్ (ఎం.వి) కార్యాలయంలో అందరు ఎంవీ, సహాయ ఎం.వి.అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం ప్రగతిపై ఆర్టీవో రామకృష్ణతో కలిసి సమీక్షించారు. వాహనాల నిశిత పరిశీలన ద్వారా అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. అనంతరం చెక్పోస్టులోనూ, ఇచ్ఛాపురం ఎం.వి.కార్యాలయంలోనూ దస్త్రాలను పరిశీలించారు. ఆన్లైన్ విధానం వల్ల ద్విచక్ర వాహనాల నమోదులు తగ్గాయని, ఇతర వాహనాలు వస్తున్నాయని ఎం.వి.అధికారి టి.హరిప్రసాద్ తెలిపారు.
జిల్లా కేంద్రంలో ఐఐఐటీ క్యాంపు కార్యాలయం
శ్రీకాకుళం, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): జిల్లా కేంద్రంలో ఐఐఐటీ కోసం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్యుకెటి) ఉపకులపతి డాక్టర్ పి.వి.రామచంద్రరాజు తెలిపారు. జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి జిల్లాలో తరగతులను నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. 300 ఎకరాల్లో స్థలం అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం స్థలాన్ని చూసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 21వ శతాబ్ధపు గురుకులం, రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించామన్నారు. జిల్లా యంత్రాంగం ఎక్కడ స్థలాన్ని కేటాయిస్తే ఆ ప్రాంతంలో నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ఆరేళ్ల కోర్సుకు రూ. 1,500 కోట్లు అవసరమని చెప్పారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, ఒంగోలుకు ట్రిపుల్ ఐటీలను మంజూరు చేశారని, ఈ ఏడాదికి సంబంధించి ఒక్కో కేంద్ర పరిధిలో 1,000 మంది విద్యార్థులను రెండు చోట్ల చేర్చుకొని తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికి మరో వెయ్యి మంది చొప్పున జాయిన్ అయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే స్థలం అవసరం పడిందన్నారు. జిల్లాలో పర్యవేక్షణ కోసం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇన్ఛార్జిగా ప్రొఫెసర్ పి.అప్పలనాయుడును నియమించినట్లు, ఆయన ఇక్కడ సమన్వయం చేస్తారన్నారు. ఉపకులపతి వెంట ఐఐఐటీ డైరెక్టర్ ప్రొ.వెంకయ్య, జిల్లా ఇన్ఛార్జి డైరెక్టర్ పి.అప్పలనాయుడు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫిసర్ గుంట తులసీరావులు ఉన్నారు.


