శ్రీవారి సేవలో పీవీ సింధు
తిరుపతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం ఉదయం ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధూ దర్శించుకున్నారు. బ్యాండ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి ఆమె తిరుమల చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సింధు, ఆమె కుటుంబ సభ్యులు సహా కోచ్ గోపీచంద్ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తల్లిదండ్రులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న సింధూకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతంరం సింధు స్వామి వారికి తులాభారంగా 68 కేజీల బెల్లాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం సింధు, గోపిచంద్ కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
కాగా, శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి వారు తిరుచ్చి వాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించారు. వారపు ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారికి ఫల, పుష్ప సుగంధ పన్నీటి ద్రవ్యాలతో అభిషేక సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కల్యాణమండంపంలోకి వేంచేపు చేసి, వైఖానస ఆగమోక్తంగా కన్నుల పండువగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చి వాహనంపై ఆశీనులై నాలుగుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈసందర్భంగా భక్తులు దేవేరులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనుంజయ, ఇన్స్పెక్టర్లు దినకర రాజు, కష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, శ్రీవారికి తలనీలాలు సమర్పించేందుకు భక్తుల సౌకర్యం కోసం కొత్త హాలును టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రారంభించారు. ప్రధాన కల్యాణకట్టలో మొత్తం నాలుగు హాళ్లు ఉన్నాయి. ఇందులో ప్రయోగాత్మకంగా ఈ హాలు ఆధునికీకరించారు.
అదనంగా ఆరు టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ చదలవాడ మాట్లాడుతూ తలనీలాలు సమర్పించేందుకు సామాన్య భక్తులు ఎక్కువ సమయం క్యూలో వేచి ఉండకుండా ఉండేందుకు ఈ కొత్త హాలు ఉపయోగపడుతుందన్నారు. భక్తుల కోసం కాఫీ, టీ కూడా ఉచితంగా అందిస్తారన్నారు. టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ కొత్త హాలు, కొత్త టోకెన్ కౌంటర్లు అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండే అవకాశం ఉండదన్నారు.
అలాగే పూర్తి స్థాయి పారిశుద్ధ్యం వల్ల తలనీలాలు తీసుకునే భక్తులు, వృత్తిని కొనసాగించే క్షురకులకు ఆరోగ్య సమస్యలు రావన్నారు. దశలవారీగా మరో మూడు హాళ్లను కూడా పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఢిల్లీలోని ఏపీ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు,టీటీడీ న్యాయాధికారి వెంకటరమణ, చీఫ్ ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, వీఎస్వో రవీంద్రారెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శర్మిష్ట, డెప్యూటీ ఈవో వెంకటయ్య పాల్గొన్నారు.


