సంక్రాంతి ‘సినీ పందెంకోళ్లు’
- 73 Views
- wadminw
- January 8, 2017
- Home Slider సినిమా
సంక్రాంతి సినిమాల ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనేలేదు. చిన్న హీరో దగ్గర నుంచి సీనియర్ నటుల వరకూ అందరి ఆశా సంక్రాంతి విజయాలపై ఉంటుంది. ఇదే క్రమంగా ఈ ఏడాది కూడా పలు పెద్ద హీరోల చిత్రాలు బరిలోకి దూకనున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు ఈ సంక్రాంతి బరిలో నిలవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు అంటేనే కోళ్ళ పందేలు, ఎడ్ల పందేలు ఇవి కాకుండా ఇంకో పందెం కూడా వుంది. అదే సినిమా పందెం. ప్రతి సంక్రాంతికి కూడా అగ్రహీరోల సినిమాలు విడుదలవుతుంటాయి.
వీటిలో ఒకరివి హిట్ కావడం, ఇంకొకరివి ఫట్ మనడం కామనే! తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర హీరోల విభాగంలో ఇప్పుడు మూడో తరం వుంది. ఈ తరానికి తెలిసిన మొదటి తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలు, రెండో తరానికి సంబంధించి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్! ఇప్పుడు మూడో తరం వాళ్లొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, నాగచైతన్య, రానా వంటి వాళ్లు. పదేళ్ల క్రితం వరకు కూడా తెలుగు చలనచిత్ర రంగంలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ వుండేది.
సంక్రాంతి పడ్డక్కి ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఖచ్చితంగా విడుదలయ్యేవి! అభిమానుల మధ్య పోటీ కూడా తీవ్రంగా ఉండేది. చాలాకాలం తర్వాత సంక్రాంతికి ఆ ఇద్దరి హీరోల సినిమాలు తెలుగు తెరపైకి రాబోతున్నాయి. వీళ్లిద్దరు కూడా చాలా కాలం నుండి సినిమాలు తగ్గించారు. రాజకీయాల్లో వేగం పెంచారు. కాకపోతే తమ పేరిట ఒక రికార్డు కోసం చెరొక సినిమా చేశారు. చిరంజీవి నటించిన 150వ చిత్రంగా ‘ఖైదీ నెం.150’ ఈ నెల 11న తెర కెక్కబోతుంటే, నందమూరి బాలకృష్ణ హీరోగా తన 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఈనెల 12న వెండి తెరపైకి రానుంది.
ఈ ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒక్కరోజు తేడాలో విడుదలవుతుండడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. థియేటర్లకు సైతం పోటీ నెలకొంది. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’ సినిమాను ఖైదీ నెం.150 పేరుతో రీమేక్ చేయగా, అమరావతి రాజధానిగా దేశం మొత్తాన్ని ఏలిన శాతకర్ణి రాజు చరిత్ర నేపథ్యంలో గౌతమిపుత్ర శాతకర్ణిని బాలకృష్ణ హీరోగా రూపొందించారు. బాలకృష్ణ సినిమా ఆడియోను తిరుపతిలో విడుదల చేయగా, చిరంజీవి సినిమా ట్రైలర్ విడుదలకు మాత్రం రాజకీయ ఆటంకాలొచ్చాయి.
ఈ సినిమా ఆడియోను విజయవాడలో విడుదల చేయాలనుకున్నప్పటికి, ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో గుంటూరు జిల్లా చినకాకాణి వద్ద వున్న హాయ్‌ల్యాండ్‌కు మార్చారు. ఈ రెండు సినిమాల ఆడియో విడుదలలోనే రాజకీయ సెగ మొదలైంది. ఇక సినిమాలు విడుదలయ్యాక ఆ సెగ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.


