సంక్షేమ రంగంలో మనమే నంబర్‌వన్: కేసీఆర్
- 68 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): సంక్షేమ రంగంలో రూ.30వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతూ నంబర్‌వన్‌గా నిలిచామని ముఖ్యమంత్రి కేసిఆర్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు కావడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. బుధవారం కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం తొలిసారిగా ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రావాలన్నారు. సమాజంలో నెలకొన్న అపసవ్య పరిస్థితులను అరికట్టడం అసాధ్యం కాదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత సమర్ధవంతంగా చేరాలన్న ఉద్దేశంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని అభిప్రాయపడ్డారు. పరిపాలనను వికేంద్రీకరించామని వాటి ఫలితాలు ప్రజలకు అందాలంటే అధికార యంత్రాంగం మరింత క్రియాశీలకంగా పనిచేయాలని అన్నారు. ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు చేపట్టినా సమాజంలో ఇంకా ఎక్కడో అసంతృప్తి ఉందన్నారు.
దీన్ని అధిగమించేందుకు లోపం ఎక్కడుందో గుర్తించాలన్నారు. ప్రజలకు ఏమి అవసరమో తెలుసుకోవాలని సూచించారు. అసంతృప్తి పరిధి దాటితే కొన్ని శక్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. కేవలం డబ్బులతోనే అన్ని పనులు కావు, మంచి పాలసీలు, పథకాలు రావాలి, అవి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని చెప్పారు. కుటుంబాలను విచ్చిన్నం చేసే దురాచారాలను రూపుమాపడంలో విజయవంతమయ్యామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగాలని కలెక్టర్లకు సూచించారు.
టిఎస్ ఐపాస్ చట్టం తేవడం వల్ల పారిశ్రామిక విధానం అద్భుతంగా వచ్చింది. టిఎస్ ఐపాస్‌తో 2500 పరిశ్రమలు వచ్చాయి. హరితహారం ద్వారా గ్రీన్ కవర్ పెంచుకుంటున్నాం. పేకాట అరికట్టగలిగాం, గుడుంబాను నిర్మూలించగలుగుతున్నాం. గుడుంబా తయారీ మానేసిన మహిళలకు ఉపాధి చూపించాలని కలెక్టర్లకు, మంత్రులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం మనపైనా ఉందని, క్యాష్‌లెస్ లావాదేవీలపై మనం దృష్టి సారించాలని తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రజలకు వివరించాలని పదేపదే చెప్పారు.
కలెక్టర్లు పోటీపడి కార్యక్రమాలను చేపట్టాలని నిర్దేశించారు. త్వరలోనే టీ వ్యాలెట్ అందుబాటులోకి వస్తుంది. అన్నింటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఆసుపత్రులు, వసతిగృహాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


