సత్ప్రవర్తనతో జీవితంలో ఎదుగుదల: ఎమ్మెల్సీ రాము
ఏలూరు, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే యువత ఆర్ధిక రంగంలో అభివృద్ధి సాధించి స్వశక్తిపై రాణించగలుగుతారని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి సభ్యుడు రాము సూర్యారావు చెప్పారు. స్ధానిక అశోక్ నగర్లోని అమలోద్భవి స్కూలు క్యాంపస్లో మంగళవారం ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యువతకు కంప్యూటరు శిక్షణానంతరం యువతకు ఆయన సర్టిఫికెట్లను అందజేసారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ నేటి యువత ఎక్కువుగా మద్యం, ఇతర చెడు వ్యసనాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఇటువంటి స్ధితిలో యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణిచ్చి అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ ఆర్ధిక అభివృద్ధి సాధించగలుగుతారని చెప్పారు.
ఇటీవల పలుమార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి వివిధ చేతివృత్తులతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అనేక వృత్తినైపుణ్యం పెంపొందించే విభాగాలలో యువతకు శిక్షణ అందించాలని కోరానని దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించి వృత్తివిద్యాకోర్స్లవైపు దృష్టి కేంద్రీకరించారని ఆయన చెప్పారు. ఇంట్లో ఖాళీగా కూర్చునే యువతులు కంప్యూటరులో శిక్షణ పొంది ఆనైపుణ్యంతో వివిధ కంపెనీలలో పనిచేస్తే కుటుంబానికి కొంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందని ఆదిశగా ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ 23 మంది యువతకు కంప్యూటరులో శిక్షణ అందించడం శుభపరిణామమని సూర్యారావు చెప్పారు.
లయన్స్ క్లబ్ కులమతాలకతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ మనిషిలోని మనోదౌర్భాల్యాన్ని దూరం చేయడానికి అనేక కార్యక్రమాలు అమలుచేస్తోందని ఆయన చెప్పారు. సమాజంలో స్త్రీ విద్యను మరింత ప్రోత్సహించాలని ముఖ్యంగా సాంకేతిక విద్యను యువతులకు అందిస్తే క్రమశిక్షణతో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోగలుగుతారని సూర్యారావు చెప్పారు. ఏలూరు లయన్స్ క్లబ్ రీజనల్ ఛైర్మన్ అక్కినేని వెంకటేశ్వరరావు సమావేశానికి అధ్యక్షత వహించారు. జోన్ ఛైర్మన్ అవినాష్ రాజ్ మాట్లాడుతూ సమాజంలో యువత పెడదారి పట్టకుండా విద్యానంతరం ఉపాధి కలిగించే వివిధ వృత్తుల్లో శిక్షణ అందిస్తే వారి జీవితాలు బాగుపడతాయనే ఉద్ధేశ్యంతో తమ క్లబ్ యువతకు కంప్యూటరులో శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 23 మంది యువతీ యువకులకు సూర్యారావు సర్టిఫికెట్లను అందజేసారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శేషుకుమార్, యం. రామకృష్ణారావు, ఏవియం. రావు, తదితరులు పాల్గొన్నారు.


