సన్నగిల్లిన ‘రియల్’ బూమ్!
- 112 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
గుంటూరు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): రాజధాని ప్రాంతంలో రియల్టర్లు, డెవలపర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రాజధాని వచ్చినా వ్యాపారం పుంజుకోకపోగా, కనీసం పెట్టుబ డులు కూడా వచ్చే పరిస్థితి కనిపించటంలేదు. వేసిన వెంచర్స్‌లో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మిద్దామనుకున్నా, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు అందుకు ప్రతిబంధ కాలుగా తయారయ్యాయి. దీంతో రియల్టర్లు, డెవలపర్స్ పరిస్థితి ఇపుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. వ్యాపారాలు లేకపోవటంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అనేక మంది రియల్టర్లు నష్టానికే ప్లాట్లను విక్రయించేస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత రాజ ధాని ఎక్కడా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయవాడ, నూజివీడు, గుంటూరు, మంగళగిరి, నందిగామ ప్రాంతాలలో రాజధాని వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరగటంతో రియల్టర్లు ఉరుకులు, పరుగులు పెట్టారు. రాజధాని ప్రాంతంలో భూములకు మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందస్తు గానే పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేశారు. రాజధాని భూమ్‌తో అప్పట్లో ధరలు కూడా ఆకాశాన్నంటాయి. కృష్ణాజిల్లాలో నూజివీడు, గన్నవరం, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ సమీపంలోని నున్న, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడేపల్లి అమరావతి ప్రాంతాలలో రియల్టర్లు భూములను కొనుగోలు చేశారు. ఎకరా భూమి కనీసం రూ.కోటి నుంచి ఐదారు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.
కొంతమంది డెవపర్స్ అపార్ట్మెంట్లు, గ్రూపు హౌస్‌ల నిర్మాణం కోసం స్థలాలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం రాజధానిని తుళ్లూరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని చెప్పటంతో తొలుత ఆ ప్రాంతంలోనూ భూముల ధరలు కోట్లు పలికాయి. ఆ తర్వాత అమరావతి కేంద్రంగా రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కృష్ణాజిల్లాలో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అవసరం కోసం భూములను అమ్ముదామనుకున్నా, సరైన ధర లేకపోవటం, కొనేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో నూజివీడు, నున్న, ఆగిరిపల్లి, గన్నవరం, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ భూమ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు ఇపుడు లబోదిబో మంటున్నారు. రాజధాని ప్రాంత ప్రాధికారసంస్థ (సీఆర్డీఏ) పరిధిలోని గ్రామాలకు 500 మీటర్ల పరిధిలోనే కొత్తగా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఫలితంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో పెద్ద మొత్తంలో భవన నిర్మాణాల అనుమతులు నిలిచిపోయినట్లు తెలిసింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వెంచర్లు వేస్తే, అందులో భవన నిర్మాణాలకు సీఆర్డీఏ నిబంధనలు ఆటకంగా మారాయి. వెంచర్స్‌లో ప్లాట్లను అమ్మితే పెద్ద మొత్తంలో మిగులుతుందని ఆశించిన వ్యాపారులకు అసలుకే ఎసరు వచ్చింది. వ్యాపారం కోసం వడ్డీకి అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టిన వారు అనేక మంది ఉన్నారు. ఒకవైపు తెచ్చిన అప్పుకు వడ్డీ పెరుగుతుందేగానీ, ప్లాట్ల ధర మాత్రం పెరగటంలేదు. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి సీఆర్డీఏ నుంచి విధిగా అనుమతులు పొందాల్సి ఉంది. సహజంగా రియల్ ఎస్టేట్ వెంచర్లన్నీ గ్రామాలకు రెండు మూడు కిలో మీటర్ల దూరంలోనే ఉంటాయి. అసలే పెట్టిన పెట్టుబడులు రాక నానా బాధలు పడుతుంటే, కొత్తగా ఈ నిబంధనలేంటని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల నిర్మిస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు అద్దెకు ఇచ్చుకోవచ్చని అనేక మంది ఆశ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కొత్త నిబంధనలు తమకు గొడ్డలిపెట్టుగా తయారయ్యాయని పలువురు వాపోతున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు వ్యాపారులు ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతున్నారు. గతంలో గజం ధర రూ.10 వేల నుంచి రూ.12 వేలు పలికిన ప్లాట్ల ధరలు ఇపుడు మూడున్నర వేల నుంచి ఐదారు వేలకు పడిపోయింది. కంచికచర్ల, నందిగామ ప్రాంతాలలో రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకే వంద గజాల ప్లాట్లు ఇస్తామంటూ వ్యాపారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం ప్రాంతాలలో గజం ధర నాలుగైదు వేలుగా ఉంది. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్లాట్ కొనుగోలు చేస్తే గృహోపకరణాలను ఇస్తామంటూ ఆశలు కల్పిస్తున్నాయి. అయినప్పటికీ ప్లాట్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావటంలేదని పలువురు చెబుతున్నారు.
వెంచర్స్‌లో ఉన్న ప్లాట్ల అమ్మకం కోసం కొందరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా నియమించుకుంటున్నారు. ప్లాట్లు అమ్ముడవకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పలువురు వ్యాపారులు అంటున్నారు. గతంలో ఒకసారి ప్లాట్లు విక్రయం కాకపోవటంతో కొందరు రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా విజయవాడలో ఉన్నాయి. కొన్ని ఆర్థిక సంస్థలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి బోర్డు తిప్పేసిన ఘటనలు కూడా ఉన్నాయి. గన్నవరం – ఆగిరిపల్లి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు వెంచర్స్ నిర్మాణ పనులను సగంలోనే నిలిపివేశారు. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం ఏదోవిధంగా వాటిని సేల్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు.


