సమస్యల సుడిగుండంలో సీఎం పాలన
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): తెలంగాణ సాధించిన మైకంలో నిన్నమొన్నటిదాక తిరుగులేదనుకున్న తెరాస అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ ఎదుగుదలకు బ్రేలు పడ్డాయన్న ప్రచారం ఊపందుకుంది. విపక్షాలను అసెంబ్లీలో నామమాత్రం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్, పరిపాలన సౌలభ్యం పేరిట తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం కేసీఆర్ ప్రతిష్టకు మచ్చతెచ్చేలా మారాయి. వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తుంటే ఆయనకు తగ్గించలేని తలనొప్పులు మొదలయ్యాయనిపిస్తోంది. దీంతో పాటు ప్రతిపక్షాన్ని బలహీనం చేసినా ఎదురుగాలి బలంగా వీస్తోందనే సూచనలూ కనిపిస్తున్నాయి. సమస్యలు అగ్నిపరీక్షగా కేసీఆర్ ముందు నిలబడి ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి.
తిరుగులేదనుకున్న సమయంలోనే ఎదురుగాలి బలంగా వీయడం మొదలైంది. ముఖ్యంగా కొత్త జిల్లాల విభజన, పార్టీలోకి చేరిన టీ-టీడీపీ ఎమ్మెల్యేల సమస్యలు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జనగామ, గద్వాల, ములుగు, సిరిసిల్ల రగులుకోవడం, ఇటీవల జనగామ ప్రాంతంలో ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి, హైకోర్టులో టీడీపీ విలీనంపై చుక్కెదురు కావడం, ఇలా వరుసగా కేసీఆర్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అంతేకాదు కేసీఆర్ తీరుపై సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లోలోపల అసంతృప్తులతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. జిల్లాల విభజన తీరుపై మండిపడుతూ ఇప్పటికే సొంత పార్టీ ఎమ్మెల్యే సంజీవ రావు ఝలక్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజీవరావు డిమాండ్ చేశారు. వికారాబాదును జిల్లా కేంద్రంగా చేయకుంటే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌ను జిల్లాగా మారుస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఒకసారి మాటిస్తే దాన్ని తప్పే వ్యక్తి కేసీఆర్ కాదన్నారు. 19 మండలాలతో కూడిన వికారాబాద్ జిల్లా సాకారమవుతుందని, ఈ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గబోరన్నారు. జిల్లాను అడ్డుకునేందుకు కొందరు కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా గెజిట్ 28వ తేదీలోగా వస్తుందని, అలా రాకుంటే తాను రాజీనామా చేస్తానన్నారు. ఇప్పటికే గద్వాల, జనగామ, సిరిసిల్ల, ములుగులను జిల్లాలుగా చేయాలంటూ భారీ ఎత్తున ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ తమ జిల్లాల కోసం విపక్షాలు, జేఏసీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కొన్ని జిల్లాల ఏర్పాటు సక్రమంగా జరుగుతున్నా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మూడు, నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే పనిలో పడినట్లు తాజా సమాచారం. కరీంనగర్ హైవేలో ఆర్టీసీ బస్సు అద్దాలను, వాణిజ్యం సంస్థలను టార్గెట్ చేసి ధ్వసం చేస్తున్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుక పోలీసు సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదు. తెలంగాణ ప్రజలు రొడ్డెక్కి నిరసనలు తెలియజేస్తే ఎలా ఉంటుందనేది తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నట్లు ఉంది. తమ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రజలు పోరాడుతుంటే కేసీఆర్ ఏసీ హాలులో కూర్చుని మీటింగ్‌లు పెట్టి ప్రజలను పోలీసులతో అదుపు చేయిస్తున్నాడని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత రెండేళ్ల వరకు కేసీఆర్‌కు, ఆయన పార్టీ టీఆర్ఎస్కు తిరుగులేకుండాపోయింది. కేసీఆర్ ఆడిందే ఆటగా ఉండేది.
అందుకు వరంగల్ తదితర ఉప ఎన్నికలతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 99 కార్పోరేట్ సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే, ఇప్పుడు కేసీఆర్‌కు ఎదురుగాలి వీస్తోందని అంటున్నారు. తెలంగాణలో కెసీఆర్‌కు ఎదురు లేకుండా పోవడంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాంటి సమయంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం తెరపైకి వచ్చారు. కెసీఆర్‌ను కోదండ ఏ మేరకు అడ్డుకోగలరనే విషయాన్ని పక్కన పెడితే, పలు సమస్యలపైన ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ నిర్ణయాలను ఎండగడుతూ కోదండరామ్ చేస్తున్న నిరసనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్ఎస్లో చేరారు. దీంతో తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. దీనిని రేవంత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. టీఆర్ఎస్లో టిడిపి విలీనం పైన నిర్ణయం ఇప్పుడే కాదని, టీఆర్ఎస్లో చేరిన వారి డిస్క్వాలిఫై పైన నిర్ణయం తీసుకున్నాక విలీనంపై నిర్ణయం ఉండాలని న్యాయస్థానం షాకిచ్చింది. ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షనాయకులను పూర్తిగా బలహీనం చేయడంలో విజయం సాధించిన కేసీఆర్‌కు ఇప్పుడు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే హామీలు ఇవ్వడమే తప్పా నెరవేర్చడం లేదని, బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి జరగడం లేదని నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేసీఆర్ ప్రభావం కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే, రానున్న ఎన్నికల వరకు కేసీఆర్ క్రేజ్ అమాంతం తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


