సముద్రంలోకి ‘వరద ప్రవాహం’
- 114 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
రాజమండ్రి, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): అఖండ గోదావరీ నదీ సముద్రం పాలవుతోంది. వరద జలాలు వృధా అవుతున్నాయి. వేల టీఎంసీల నీరు ఊళ్ళను చుడుతూ సముద్రంలో కలిసిపోతోంది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఏటా కనీసం రెండు వేల టీఎంసీల నీటిని వృధాగా వదిలేస్తున్నాం. ఒక టిఎంసీ నీటితోనే 10 వేల ఎకరాలను సాగు చేయవచ్చు! రెండు వేల టీఎంసీల నీరు వృధా కావడమంటే ఏ స్థారులో నష్టపోతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఏటా అక్ష రాలా 2 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సరిపడా నీరు సముద్రంలోకి వెళిపోతోంది. అంటే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వదిలేస్తున్న నీటితో దేశంలో మొత్తం వ్యవసాయానికే నీరు అందించవచ్చు.
ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై మనకున్నది ఆనకట్టే కానీ రిజర్వాయర్ కాదు. అందుచేత వరద జలాలను గేట్లు బార్లా తెరిచి సముద్రంలోకి నీటిని విడిచిపెట్టాల్సిందే. రాష్ట్రాన్ని, దేశాన్ని సుసంపన్నం, సస్యశ్యామలం చేసేందుకు ఈ నీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. అంటే నదీ జలాల విషయంలో పాలకుల నిర్లక్ష్యం ఎంతగా ఉందో కళ్లకు కడుతోంది. ఇంగ్లీషు దొరలు గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఒక బ్యారేజీని మాత్రమే నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన పాలకులు చేసింది శూన్యం. గోదావరిపై చెప్పుకోదగిన నిర్మాణాలేవీ జరగలేదు. నిత్యం వేల క్యూసెక్కుల నీటి లభ్యత కలిగిన గోదావరి నది నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, అటు తెలంగాణా కానీ వినియోగించుకున్న జలాలు చాలా తక్కువ. తెలంగాణా పరిధిలో శ్రీరాంసాగర్ తప్ప మరో ప్రాజెక్టు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 1896లో బ్రిటీష్ దొర కాటన్ కట్టిన బ్యారేజీ తప్ప మరోకటి లేదు.
ఈ బ్యారేజీ కట్టక ముందు ఉభయ గోదావరి జిల్లాలు అతివృష్టి, అనావృష్టితో కటకటలాడేవి. అందుకే కాటన్ ఇక్కడి ప్రజలకు మహాశయడయ్యాడు. కాటన్ బ్యారేజీ వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగి ధాన్యాగారంగా మారారు. ఇక్కడ ఉన్నది కేవలం నీటికి అడ్డుకట్టే కానీ రిజర్వాయర్ కాదు. నీటి ప్రవాహాన్ని కాలువల ద్వారా కాస్తంత మళ్లించడంతో ఈ ప్రాంతాలు పరిఢవిల్లాయి. 1986 వరదలను ప్రామాణికంగా తీసుకుని గట్లును ఎత్తు చేశారు. గోదావరి నదికి వరదల సమయంలో ఎన్ని లక్షల క్యూసెక్కుల నీర సముద్రం పాలవుతుందో అంచనా వేస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఒక టిఎంసీ నీరు అంటే 10 వేల ఎకరాలను సాగు చేయవచ్చునని అంచన. అంటే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రతీ ఏడాది వృధాగా పోయే ఒక సీజన్ జలాలతోనే భారత దేశంలోనే వ్యవసాయనికంతటికీ సరిపెట్టవచ్చునన్నది వాస్తవం.
వృధా జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టు నిర్మించుకుంటే లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. నీరు లేక నోరెళ్లబెడుతున్న ఎన్నో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయవచ్చు. దీనిపై పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్య్రం పూర్వం నుంచి పోలవరం వద్ద ఓ బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఎట్టకేలకు వివాదస్పద పరిస్థితుల నేపథ్యంలో ఇన్నాళ్ళకు చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సత్వరం చేసుకోగలిగితే వృధా జలాలను కొద్దిగానైనా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది బహుళార్ధక ప్రాజెక్టు కూడాను. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు సొంతంగా ఒక ప్రాజెక్టు కట్టుకున్నామనే పేరైనా దక్కుతుంది. మరోవైపు, నదుల నుండి ఉధృతంగా ప్రవహస్తున్న వరద నీరు ఉప్పు సముద్రం పాలవుతున్నాయి.
రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేయాల్సిన గోదావరి, కృష్ణా, వంశధార నదులకు భారీ మొత్తంలో చేరుతున్న వరద నీరు డ్యామ్‌లు, రిజర్వాయర్ల పరిధిని దాటి వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. రాష్ట్రంలోనే పెద్దదైన నాగార్జున సాగర్ డ్యామ్‌లో పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం కన్నా రెట్టింపునకు పైగా నీరు కేవలం ఒకటిన్నర నెలల్లోనే సముద్రంలోకి చేరింది. ఇది శ్రీశైలం డ్యామ్‌లో పూర్తి సామర్ధ్యపు నీటి కన్నా దాదాపు ఐదు రెట్లు అధికం కావడం విశేషం. వర్షాకాలం ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు 1113 టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలసిపోయింది. గత ఏడాది కేవలం 330 టిఎంసిల నీరు వృధాగా సముద్రంలోకి చేరగా, ఈ ఏడాది సుమారు నాలుగు రెట్లు అధికంగా నదీజలాలు సముద్రంలోకి వెళ్లిపోయాయి. ధవళేశ్వరాన్ని దాటి గోదావరి నది నుండి సముద్రంలో కలుస్తున్న నీరు ఏకంగా 1059 టిఎంసిలు ఉంది.
కృష్ణా నుండి 33 టిఎంసిలు, వంశధార నుండి 19 టిఎంసిల నీరు సముద్రంలో కలిసిపోయింది. గతఏడాది కన్నా ఈ సీజన్లో సముద్రంలోకి చేరిన అధిక జలాలు మొత్తం గోదావరివే కావడం విశేషం. వృధాగా సముద్రంలోకి పోతున్న నీటి పరిమణాన్ని పరిశీలిస్తే జూన్ 30వ తేదీన మూడు ప్రధాన నదుల నుండి కేవలం 15 టిఎంసిల నీరు మాత్రమే సముద్రంలోకి తరలిపోగా, జూలై ప్రారంభం నుండి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈనెల పదో తేదీ నాటికి 40 టిఎంసిలకుపైగా నీరు సముద్రంలోకి తరలిపోగా, 15వ తేదీ నాటికి వంద టిఎంసిల నీరు సాగరగర్భంలోకి చేరిపోయింది. ఈనెల చివరి వారం నుంటి ఈ సముద్రంలోకి వెళ్లిపోతున్న నీరు మరింత ఉధృతమైంది. 20వ తేదీన 178 టిఎంసిల వరకు, 25వ తేదీ నాటికి 219 టిఎంసిల నీరు, నెలాఖరు నాటికి సముద్రంలోకి కలిసిపోయిన ఏకంగా 510 టిఎంసిలకు చేరిపోయింది.
గత నెల్లో కూడా వృధాగా సముద్రంలోకి చేరిపోతున్న నీటి పరిమాణం భారీగానే కొనసాగింది. గత నెల ఒకటో తేదీన 563 టిఎంసిలు, రెండో తేదీనాటికి 608 టిఎంసిల నీరు, మూడో తేదీ నాటికి 650 టిఎంసిలు, నాలుగో తేదీ నాటికి 687 టిఎంసిలు, ఐదో తేదీ నాటికి 721 టిఎంసిలు, ఆరో తేదీ నాటికి 749 టిఎంసిలు, ఏడో తేదీ నాటికి 797 టిఎంసిలు నీరు సముద్రంలోకి చేరిపోగా, తాజాగా ముందు రోజుకన్నా సుమారు 45 టిఎంసిలు అదనంగా మొత్తం 941 టిఎంసిల నీరు సాగరంలోకి కలిసిపోయింది. ఇవాళ్టి ఈ మొత్తం 1113 టిఎంసిలకు చేరుకోవడం గమనార్హం. గత ఏడాది చుక్క నీటి కోసం వెంపర్లాడిన గోదావరి నదిలో ఈసారి ఉధృతంగా వరద నీరు ప్రవహించడం గమనార్హం.
గత ఏడాది గోదావరి నదిలో కేవలం 291 టిఎంసిలు సముద్రంలోకి విడిచిపెట్టగా, ఈ ఏడాది ఐదు రెట్లు అధికంగా నీటిని సముద్రం పాలుచేయాల్సి వచ్చింది. అలాగే కృష్ణా నది నుండి గత ఏడాది చుక్క నీరు కూడా సముద్రంలోకి విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండాపోయింది. ఇక వంశధార నుండి కూడా గత ఏడాది దాదాపు 40 టిఎంసిల నీరు సముద్రంలోకి వృధాగా కలిసిపోయింది. ఇలా ఉండగా, వృధాగా సముద్రంలోకి తరలిపోతున్న నదీ జలాలను అడ్డుకోవాలంటే నదులకు ఎగువ భాగంలో చిన్న చిన్న నీటి పథకాలను వీలయినంత ఎక్కువగా నిర్మించడం ఒక్కటే గత్యంతరమని భావిస్తున్నారు. గోదావరిపై ధవళేశ్వరం దాటిన తరువాత, కృష్ణా నదిపై నాగార్జునసాగర్ దాటిన తరువాత, వంశధారపై గొట్టా బ్యారేజీ దాటిన తరువాత ఒక్క ప్రాజెక్టు కూడా లేకపోవడం వల్ల వృధా జలాలు సముద్రంలోకి విడిచిపెట్టడం అనివార్యమవుతోంది.


