సరిహద్దులో యువకుడు దారుణ హత్య
తిరుపతి, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం పుదుకుప్పం గ్రామానికి సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు ఆ యువకున్ని నమ్మించి జనసంచారం లేని ప్రాంతానికి తీసుకువచ్చి పథకం ప్రకారం కత్తులతో దాడి చేసి అంతమొందించారు. తమిళనాడులోని ప్రాంతానికి చెందిన సత్య(27)మండలంలోని పుదుకుప్పం సమీపంలోని గంగ జీరో పాయింట్‌కు వెళ్లె మార్గంలోని పంట పొలాల వద్ద హత్యకు గురైన విషయాన్ని స్థానిక రైతులు గుర్తించారు. దుండగులు సత్యను పథకం ప్రకారం ఇక్కడకు తీసుకువచ్చి కత్తులతో పైశాచికం దాడి చేసి హతమార్చారు.
ముఖం మీద పలుమార్లు కత్తులతో దాడిచేయటంతో ముఖం గుర్తు పట్టని విధంగా తయారైంది. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుని విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా ఘటనా స్థలంలో టీఎన్20 బీఆర్5636 నెంబరు గల బైక్ ఉండటం ద్వారా హతుని తాలూకు వివరాలను పోలీసులు సులువుగా గుర్తించారు. మంగళవారం వేకువ జామున ఈహత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన కిరాయి హంతకులు ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పుత్తూరు డీఎస్పీ నాగభూషణం, సత్యవేడు సీఐ నరసింహులు, ఎస్ఐ మల్లేష్‌యాదవ్‌లు పరిశీలించారు.
చిత్తూరు నుంచి జాగిలాలను కూడా తెప్పించి సంఘటనా స్థలం వద్ద వదిలారు. అవి జీరో పాయింట్ వైపుగా వెళ్లి ఆగి పోయాయి. అనారోగ్య సమస్యలతో మృతుడి కుడికాలు గతంలోనే తొలగించటంతో కృత్రిమకాలు అమర్చబడి ఉంది. తమిళనాడు రాష్ట్రం పట్టాభిరాంకు చెందిన రవి కుమారుడు సత్య(27) అక్కడ స్థానికంగా కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హతుడు, అతని స్నేహితుడు ఒకడు తమిళనాడులోని ఆవడిలో 2014లో జరిగిన ఓ హత్య కేసులో నిందితులుగా అక్కడి పోలీసుల నుంచి సమాచారం. సత్య తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ఆసుపత్రికి తరలించారు.


