సహకార సంఘాల్లోనూ ఈ-పోస్ యంత్రాలు
తూర్పు గోదావరి జిల్లాలోని 302 సహకార సంఘాల్లో నగదు రహిత లావాదేవీలకు ఈ-పోస్, ఎం-పోస్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా సహకార అధికారిణి టి.ప్రవీణ తెలిపారు. మంగళవారం మండలంలోని సోమేశ్వరంలో ఆమె తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సహకార సంఘాల్లో సభ్యులైన 1.80 లక్షల మందిలో 1.54 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతాలున్నాయన్నారు.
సంఘాల్లో సభ్యులందరికీ రూపే కార్డులను పంపిణీ చేసి డీసీసీబీ శాఖలు, సహకార సంఘాల్లో స్వైపింగ్ యంత్రాలపై లావాదేవీలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించనున్నామన్నారు. 2015-16లో ధాన్యం కొనుగోళ్లపై రూ.6.64 కోట్ల కమీషన్ వచ్చిందని, రూ.3.74 కోట్ల నగదు ఇప్పటి వరకు విడుదలైందన్నారు. 175 సహకార సంఘాలు లాభాలు ఆర్జిస్తుండగా, 160 సంఘాలను బహుళార్థక సాధక సంఘాలుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమన్నారు. వీటిలో 29 సంఘాల అభివృద్ధికి నాబార్డు రూ.9.82 కోట్లు విడుదల చేసిందన్నారు.
పెద్దనోట్ల రద్దుతో సహకార సంఘాల్లో ఆర్థిక లావాదేవీలు మందగించాయన్నారు. నోట్ల రద్దుకు ముందు రాయవరం డీసీసీబీ శాఖలో రోజు రూ.15 లక్షలు లావాదేవీలు జరుగగా, ప్రస్తుతం రూ.3 లక్షల లావాదేవీలు సైతం జరగడం లేదన్నారు. అన్ని శాఖల్లోనూ ఈ పరిస్థితి ఉందన్నారు. సమావేశంలో సోమేశ్వరం సహకార సంఘ అధ్యక్షుడు వైట్ల రాంబాబు, డీసీసీబీ రాయవరం శాఖ అధికారి పట్టాభిరామయ్య పాల్గొన్నారు.


