సింగరేణిలో నెలకొన్న ఎన్నికల కోలహలం
- 144 Views
- wadminw
- September 5, 2016
- రాష్ట్రీయం
ఆదిలాబాద్: త్వరలో జరగనున్న సింగరేణి గుర్తింపు ఎన్నికలకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ప్రతి నాలుగేళ్ళకోసారి జరిగే ఎన్నికలలో మొదటిసారిగా జాతీయ కార్మిక సంఘాలను కాదని, ఒక ప్రాంతీయ సంఘానికే కార్మికులు పట్టంకట్టారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2012లో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్కు అనుబంధమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించింది.
ఈసారి జరగనున్న ఎన్నికలలో వారి తప్పిదాలను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన తీరు, గుర్తింపు సంఘంలో నెలకొన్న విభేదాలను జాతీయ కార్మిక సంఘాలు ప్రచార హస్త్రంగా తీసుకోనున్నట్లు తెలిసింది. గుర్తింపు కార్మిక సంఘం గత నాలుగేళ్ళలో కార్మికుల హక్కులను కాపాడడంలో, ప్రధానమైన సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ప్రచారం చేపట్టాయి. సింగరేణి ఎన్నికల్లో పాల్గొనేందుకు వివిధ సంఘాలు ఇప్పటికే నివేదికలు సమర్పించారు.
ఇందులో కొన్ని కార్మిక సంఘాలు పోటీలో ఉంటాయి. కొన్ని సంఘాలు కలిసి పనిచేస్తాయా అన్న స్పష్టత ఇంకా రానపప్పటికీ సింగరేణిలో మాత్రం ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని సంఘాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రకటన వెలువడక ముందే వలసలు, సమీకరణలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఎన్నికల్లో జాతీయ సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తొలిసారిగా ఒక ప్రాంతీయ కార్మిక సంఘానికి కార్మికులు పట్టం కట్టినప్పటికీ కార్మికుల నమ్మకాన్ని వమ్ముచేశారని తెలంగాణ బొగ్గుగనిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని సంఘం బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ, ఐఎన్టియూసి అధ్యక్షులైన వెంకట్రావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో అధికార పార్టీలో కనిపిస్తోంది.
గతంలో చేసిన తప్పిదాలను, పొరపాట్లను దిద్దుకోవడంలో అధికార పార్టీ తలమునకలైంది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు జాతీయ సంఘాలు కూడా అదేస్థాయిలో ప్రచారాన్ని చేపట్టాయి. కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన వారసత్వ ఉద్యోగాలు, 10వ వేతన కమిటీ నియామకం, సింగరేణి లాభాల్లో 30శాతం వాటాపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే కార్మికుల సమస్యలతో పాటు ప్రధాన సమస్యలను నెరవేర్చేందుకు సీఎం సంసిద్ధంగా ఉన్నారని తెలంగాణ బొగ్గుగని సంఘం నాయకులు ప్రకటించారు. ఏదేమైనా, రానున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తంచేస్తున్నారు.


