సింహపురి అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి: కలెక్టర్
నెల్లూరు, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): జిల్లాను వివిధ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ముత్యాలరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రెండంకెల అభివృద్ధిని సాధించడంలో జిల్లాలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతున్నందున నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పరిశ్రమల ద్వారా పన్నుల రూపంలో వచ్చే రాబడి ఆధారంతో రాష్ట్ర జిడిఇ రేటును 7.5 శాతానికి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
జిల్లాలో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేవారికి నిబంధనల ప్రకారం భూమి కేటాయించాల్సి ఉందని అన్నారు. అలాగే నీరు, విద్యుత్ సబ్సిడీపై సరఫరా చేయాల్సి ఉందని అన్నారు. పరిశ్రమలకు అనువైన భూములను ఏర్పాటు చేయడంలో రెవెన్యూ అధికారులు ఆయా ప్రాంతాల్లో భూములను గుర్తించాలని కలెక్టర్ చెప్పారు. వర్షాకాలం వస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ప్రభుత్వ వైద్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సి ఉందని అన్నారు. మున్సిపల్ పరిధిలో నీటి ముంపునకు గురయ్యేప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. పొదుపులక్ష్మీ గ్రూపులకు నిధులు మంజూరు చేయడంలో వాటిని అభివృద్ధి చేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): నగరంలోని కరెంటు ఆఫీసు సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రైలు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారింది. మృతుడికి సంబంధించిన ఏ ఆధారమూ దొరకలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. ఇదిలావుండగా, ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న డాన్స్‌మాస్టర్ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో మసీదులో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటన ఫత్తేఖాన్‌పేటలో చోటుచేసుకుంది. నెల్లూరు మెక్లిన్స్రోడ్డులో నివాసం ఉంటున్న జాకిరుల్లా (34) అలియాజ్ జాకీర్ డాన్స్‌మాస్టర్. ఆయనకు పెళ్లై ఇద్దరు పిల్లలు. అయితే కుటుంబసభ్యులతో కాకుండా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఆయనతో పాటు శిష్యుడు అబ్బులు ఉండేవాడు. ఈ క్రమంలో గతనెల 29వ తేదీన రాత్రి కుక్కలగుంటలో జాకీర్ సోదరుడి కుమార్తె నిశ్చితార్థం ఉండటంతో జాకీర్, అబ్బులు కలిసి వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని పూటుగా మద్యం తాగి తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇద్దరూ గదిలో నిద్రపోగా జాకీర్ తల్లిదండ్రులు మిద్దెపైన పడుకున్నారు. ఉదయం జాకీర్ సోదరుడి స్నేహితుడైన సెంట్రింగ్ పనులు చేసుకునే గోవిందరాజు ఇంటికొచ్చి తలుపు తీసి చూడగా ఇంట్లో ఫ్యానుకు జాకీర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. అబ్బులు నిద్రపోతూ ఉన్నాడు. అనంతరం శుక్రవారం కావడంతో మంచిరోజని జాకీర్‌ను ఫత్తేఖాన్‌పేటలోని ఓ మసీదులో ఖననం చేశారు. అయితే గత రెండ్రోజులుగా చుట్టుపక్కల వారు జాకీర్‌కు, అబ్బులుకు మధ్య ఆ రోజు రాత్రి గొడవ జరిగిందని, ఇద్దరు తీవ్రంగా అరుచుకున్నారని అతని తల్లిదండ్రుల చెవిన పడింది. దీంతో మృతుడి తల్లి హసీనాబేగం అనుమానం వ్యక్తం చేస్తూ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి మసీదు చేరుకుని తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డి సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీశారు. డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో పంచనామా జరిగింది. డీఎస్పీ వెంకటరాముడు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.
హెలికాఫ్టర్ ద్వారా గుండె తరలింపు
నెల్లూరు, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానానికి ముందుకు వచ్చారు ఆయన కుటుంబసభ్యులు. నెల్లూరు జిల్లా నారాయణ ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నారాయణ ఆసుపత్రి సీఈవో తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి నెల్లూరు జిల్లాలోని ఇంగూరుపేట గ్రామంలోని మద్యం దుకాణంలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై రంగపట్నంలోని బంధువు ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి ముళ్లపొదల్లో పడిపోయాడు. దీంతో ఆయనను నారాయణ ఆసుపత్రికి తీరలించారు. సోమవారం రాత్రి ఆయన బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. సుబ్బారెడ్డి భార్య శివకుమారి, బంధువుల అంగీకారంతో అవయవ దానానికి ఏర్పాటు చేశారు. దీంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రి నుంచి ఆయన గుండెను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి, కాలేయాన్ని విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి, ఉపిరితిత్తులను చెన్నైలోని ఫోర్సిస్ ఆసుపత్రికి, మూత్రపిండాల్లో ఒకదానిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి, మరోటి నారాయణ ఆసుపత్రిలోనే ఉన్నవ్యక్తికి, కళ్లను నెల్లూరులోని మోడరన్ ఐ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గుండెను వేగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కొత్తపట్నం పోర్టు సీఆర్వో వేణుగోపాల్ హెలికాఫ్టర్ ఏర్పాటు చేశారు. దీంతో కేవలం 20 నిమిషాల్లో గుండెను గుంటూరు తరలించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి భార్య శివకుమారి మాట్లాడుతూ తన భర్త అవయవదానం గురించి ఎప్పుడు తనకు చెప్తూ ఉండేవారని దీని ద్వారా ఇతరులకు పునర్జన్మ ఇవ్వొచ్చని అనేవారని తెలిపింది. ఆయన కోరిక మేరకు అవయవ దానానికి అంగీకరించామన్నారు. తన భర్త చనిపోవటంతో సర్వస్వం కోల్పోయానని, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నందున ప్రభుత్వం సాయం అందించి జీవనోపాధి కల్పించాలని కోరింది. ఈ కార్యక్రమంలో నారాయణ ఆసుపత్రి ఏజీఎం భాస్కర్‌రెడ్డి, ఆసుపత్రి వైద్యులు, కృష్ణపట్నం పోర్టు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


